బోరుగడ్డ అనిల్ కేసులో టీవీ5 ప్రతినిధి అరెస్ట్
ఏపీలో విపక్షం మీదనే కాదు.. టీడీపీ గొంతుగా మారిన టీవీ5 జర్నలిస్టులను కూడా పోలీసులు వదలడం లేదు. తాజాగా గుంటూరులో టీవీ5 జర్నలిస్ట్ పాలడుగు వంశీకృష్ణను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం గుంటూరులో ఆయన కెమెరామేన్ గా పనిచేస్తున్నారు. దాంతో ఈ వ్యవహారం ఆసక్తిగా మారింది.
బోరుగడ్డ అనిల్ కుమార్ రిమాండ్ లో ఉన్న కాలంలో ఆయనకు సకల సదుపాయాలు కల్పించారంటూ టీవీ5 కొన్ని కథనాలు ప్రచారం చేసింది. పోలీస్ స్టేషన్ కి చెందిన సీసీ ఫుటేజ్ ను ప్రసారం చేసింది. అదే ఇప్పుడు టీవీ5 విలేకరిని చిక్కుల్లో పెట్టింది. పోలీస్ స్టేషన్ కి చెందిన సీసీ ఫుటేజ్ ను చట్టవిరుద్ధంగా కాజేశారన్నది పోలీసుల అభియోగం.
దాంతో ఇప్పటికే పాలడుగు వంశీకృష్ణ తో పాటుగా పీఎస్ లోని ఆపరేటర్ మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు నగరంలోని ఆరండల్ పేట పోలీసులు వంశీకృష్ణను అరెస్ట్ చేయడం ఆసక్తిగా మారింది. టీవీ5 యాజమాన్యం ఘాటుగా స్పందించింది. టీవీ5 మీద బోరుగడ్డ హెచ్చరికలు చేసినా పట్టించుకోకుండా ప్రైవసీ పేరుతో తమ ప్రతినిధిని అరెస్ట్ చేసిన తీరు మీద మండిపడుతోంది.