ఈ క్రికెటర్ త్వరలో డాక్టర్ అయిపోతున్నాడట..!

జాన్ కోరా,
సీనియర్ జర్నలిస్ట్

క్రీడాకారులు ఏం చదువుకున్నారు? సచిన్ టెన్త్, కోహ్లీ ఇంటర్, ధోనీ బీఏ ఫెయిల్ అంటూ చాలా సార్లు మనం సోషల్ మీడియాలో పోస్టులు చూశాం. క్రికెటర్లు, సినిమా నటులు, కళాకారులు చాలా మంది పెద్దగా చదువుకోలేదని.. అయినా వారు పేరు ప్రఖ్యాతులు, డబ్బు సంపాదించడం లేదా అని ప్రశ్నించే వారినీ చూశాం. కానీ.. అది అన్ని వేళలా సాధ్యం‌ కాదు. ఇలాంటి స్టేట్మెంట్ల ద్వారా పిల్లల మనసుల్లో చదువుకు విలువే లేదనేది నాటుతున్నామని గ్రహించలేక పోతున్నాం.

ఇంజనీరింగ్ చేసిన అనిల్ కుంబ్లే ఒక సారి ఏమన్నాడంటే.. నేను బంతిని పెద్దగా స్పిన్ చేయనని.. నేనసలు స్పిన్నర్నే కాదన్నారు. ఆ విషయం పాక్షికంగా నిజమే ఒప్పుకుంటా. నేను బంతిని పరిస్థితికి తగ్గట్టు స్పిన్ చేస్తా.. అన్ని బంతులను కాదు. నేను ఇంజనీరింగ్ చదివా.. ఒక బంతిని ఎంత వేగంతో.. ఏ దిశలో వేస్తే.. బంతి వికెట్లను తాకుతుందో నేను calculate చేయగలను. అందుకే నా బంతులు స్పిన్ అయినట్లు కనిపించవు. కానీ నా లెక్క ప్రకారం అవి దిశను తప్పకుండా మార్చుకొని బ్యాటర్లను ఇబ్బంది పెడతాయి అని అన్నాడు.

ఇక ఫొటోలోని వెంకటేశ్ అయ్యర్ కూడా ఒక మాట చెప్పాడు. నేను ప్రస్తుతం ఫైనాన్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్నాను. నెక్ట్స్ టైం నన్ను ఇంటర్వ్యూ చేసే సమయానికి నేను డాక్టర్ వెంకటేశ్‌ అయ్యుంటాను. నాకు చదువే ముఖ్యం. క్రికెట్ ఎంత కాలం ఆడగలను. మహా అయితే 35వ ఏట వరకు.. అంతే.. ఆ తర్వాత ఖాళీగా కూర్చోవడమే కదా. 60 ఏళ్ల వరకు ఏదో ఒక పని చేయాలంటే చదువుకొని ఉండాలి. క్రికెట్‌ లేదా ఇతర క్రీడలకు సంబంధచిన ఉన్నత ఉద్యోగాలు చేయాలన్నా చదువు కావాలి‌ కదా. చదవు లేకపోతే కామెంటేటరో, కోచ్‌నో కాగలను. అంతకు మించి ఏమీ చేయలేను. అందుకే చదువుకుంటున్నాను అన్నాడు. ఇది కదా క్రీడాకారులు, సెలబ్రిటీలు చెప్పాల్సింది.

నెక్ట్స్ టైం పిల్లలకు వెంకటేశ్ అయ్యర్ లాంటి వాళ్ల గురించి చెప్దాం. చదువు లేకపోయినా‌ సచిన్, కోహ్లీ సంపాదించలేదా అనే స్టోరీలు పక్కన పెడదాం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *