విజయసాయిరెడ్డి తీరు విడ్డూరంగా ఉందా, వ్యవహారం తేడాగా ఉందా?
వైఎస్సార్సీపీని కీలక నేతలు వీడుతుంటే టీడీపీ సంతోషపడాలి. ప్రత్యర్థి బలహీనపడుతున్నాడని ఆనందించాలి. కానీ ఇప్పుడు పాలక టీడీపీలో కలవరం కనిపిస్తోంది. తాజా పరిణామాల మర్మం తెలియక ఆచితూచి వ్యవహరిస్తోంది. ఆఖరికి టీడీపీ అధినేత కూడా విజయసాయిరెడ్డి రాజీనామా మీద ముక్తసరిగా మాట్లాడి సరిపెట్టాల్సి వచ్చింది. అదే సమయంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి వారు విజయసాయి రెడ్డి మీద విమర్శలు కొనసాగిస్తున్నారు. ఇదంతా ఆసక్తికర అంశం.
వాస్తవానికి టీడీపీ నేతలు సందేహించడానికి తగ్గట్టుగానే సాయిరెడ్డి వైఖరి కనిపిస్తోంది. సహజంగా ఎవరైనా పార్టీని వీడుతుంటే వదిలిపోతున్న పార్టీ నాయకుడి మీద నాలుగు రాళ్లేసే ప్రయత్నం చేస్తారు. అక్కడేమీ బాలేదని, ఆ పార్టీకి అసలు భవితవ్యమే లేదని ఇలాంటి అనేకనేక వ్యాఖ్యలు వినిపించాలి. కానీ విజయసాయిరెడ్డి అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. పైగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు. విస్తృత ప్రజాభిమానం కలిగిన నేతగా కితాబునిచ్చారు. తనలాంటి వాళ్ళు వెయ్యి మంది బయటకు పోయినా ఆపార్టీకి ఏమీ కాదంటూ భరోసా కూడా ఇచ్చారు.
ఇదంతా టీడీపీ నేతలను కంగారు పెడుతున్నట్టుగా ఉంది. విజయసాయిరెడ్డి వ్యూహాత్మకంగానే వైఎస్సార్సీపీని వీడుతున్నట్టు భావిస్తున్నారు. జగన్ తో విబేధించి గానీ, ఆయన్ని వ్యతిరేకించి గానీ బయటకు వస్తున్న బాపతు కాదని లెక్కలేస్తున్నారు. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరి కొత్త కథ మొదలెట్టే ప్రమాదం పొంచి ఉందని అంచనా వేస్తున్నారు. దాని వల్ల కలిగే పరిణామాలను లెక్కలేసే పనిలో పడ్డారు. ఇదో ఆసక్తికర వ్యవహారం. విపక్షం నుంచి నాయకులు బయటకు వెళ్ళడం, మళ్లీ అధికారం దక్కితే వచ్చి చేరిపోవడం వర్తమాన రాజకీయాల్లో అత్యంత సహజ పరిణామంగా మారింది. విజయసాయిరెడ్డి కూడా అదే తీరులో రాజీనామా చేస్తున్నారా అన్న అనుమానం బలపడుతోంది.
రాజీనామా తర్వాత మీడియాతో మాట్లాడిన సాయిరెడ్డి ఎక్కడా తగ్గేదేలా అన్నట్టుగా మాట్లాడారు. ఏబీఎన్ రాధాకృష్ణ మీద ఎదురుదాడి కొనసాగించారు. ఇతర టీడీపీ అనుకూల పత్రికలు, కేవీరావు వంటి వారి విషయంలో కూడా తన దూకుడు ప్రదర్శించారు. ఇదంతా చూస్తుంటే ఆయన రాజకీయాలకు దూరమయ్యే అవకాశం లేదన్న సంకేతలు సుస్పష్టం. అదే సమయంలో జగన్ ను చిక్కుల్లో నెట్టే వ్యవహారంలా ఇది కనిపించడం లేదన్నది కూడా వాస్తవం. మొత్తంగా వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి రాజీనామా చేసి, మళ్లీ తమ పార్టీకి దక్కదని తెలిసినప్పటికీ ఓ రాజ్యసభ సీటు వదులుకున్న వైనం వెనుక అసలు మర్మం టీడీపీ నేతలకు పూర్తిగా అంతుబట్టకపోవడం విశేషంగా కనిపిస్తోంది.