విజయసాయిరెడ్డి కరెక్ట్ ఆప్షన్ ఎంచుకున్నారా?
వైఎస్సార్సీపీని వీడిపోయిన విజయసాయిరెడ్డి రేపోమాపో కాషాయ కండువా కప్పుకుంటారు. అది తక్షణమే జరుగుతుందా, కొన్ని నెలల తర్వాత జరుగుతుందా అన్నదే ప్రశ్న. నేరుగా వైఎస్సార్సీపీ నుంచి బీజేపీలో చేరితే తన అభిమానులు జీర్ణించుకునే అవకాశం లేదు కాబట్టి కొంత విరామం తీసుకుని ఆయన మళ్లీ బీజేపీలో ఎంట్రీ ఇచ్చే అవకాశం పుష్కలంగా ఉంది.
విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీని వీడడం ద్వారా ఆపార్టీ కంటే వ్యక్తిగతంగా జగన్ ఎక్కువ నష్టపోతారనడం కూడా నిస్సందేహం. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుట్టంతా తెలిసిన ఆడిటర్ హఠాత్తుగా వెళ్లిపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అది ఎంతమేరకు అన్నది భవిష్యత్ చెబుతుంది. కానీ విజయసాయిరెడ్డి తీసుకున్న నిర్ణయం మాత్రం రాజకీయంగా తనకు మేలు చేసేందుకే అన్నది సుస్పష్టం.
అధికారం లేని దశలో రాజకీయ ఆరంగేట్రం చేసినప్పటికీ ఆ తర్వాత దాని రుచి మరిగిన తర్వాత అంత త్వరగా రాజకీయాలకు దూరమయ్యే అవకాశం ఉండదు. అందులోనూ అధికారంలో ఉండగా చక్కబెట్టిన వ్యవహారాల తాలూకా ప్రభావం కనిపిస్తూనే ఉంటుంది. అందుకే విజయసాయిరెడ్డికి తన సొంత పార్టీ విపక్షంలో గడ్డు స్థితిలో ఉన్న దశలో తగిన రక్షణ అవసరం అన్నది బోధపడినట్టు కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే కాషాయ ధారి కాబోతున్నట్టు తెలుస్తోంది.
వైఎస్సార్సీపీలో ఉంటే విజయసాయిరెడ్డి ఎప్పటికీ ఎంపీగానే ఉంటారు. ఒకవేళ ఎప్పుడైన కేంద్ర ప్రభుత్వంలో చేరే అవకాశం వస్తే మంత్రి హోదా కోసం ప్రయత్నించవచ్చు. అంతకుమించి అవకాశాలుండవు. కానీ బీజేపీలో సాయిరెడ్డికి ఉన్న నెట్ వర్క్ ద్వారా ఎంపీ కాకపోతే, మరో పదవి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. పైగా గవర్నర్ సహా వివిధ పదవుల కోసం ప్రయత్నించవచ్చు. ఇవన్నీ వ్యక్తిగతంగా సాయిరెడ్డికి మో_షాతో ఉన్న స్నేహం ద్వారా సిద్ధించినా ఆశ్చర్యం లేదు. ఇలాంటి అనేకనేక అవకాశాలు ఎదురుగా ఉండగా ఆ ఎంపీ పదవి పట్టుకుని, ఏపీలో పాలక కూటమి నుంచి ఒత్తిళ్లను ఎన్నాళ్లని ఎదుర్కోగలడు.
అందుకే ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజకీయాలకు రాం రాం అని చెప్పినప్పటికీ ఇక జై శ్రీరామ్ అనేలా రంగు మార్చి రాజకీయాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. ఫిబ్రవరిలో విదేశీపర్యటనకు బయలుదేరి, తిరిగి వచ్చిన తర్వాత ఏ మార్చిలో జెండా మార్చేసే ప్రయత్నం ఉంటుందని చెప్పవచ్చు. వైఎస్సార్సీపీకి, జగన్ కి సాయిరెడ్డి నిర్ణయం ద్వారా కలిగే నష్టం ఎంతన్నది పక్కన పెడితే వ్యక్తిగతంగా సాయిరెడ్డికి మాత్రం ఇది అత్యంత లాభదాయకమైన నిర్ణయంగా భావించాల్సి ఉంటుంది. కానీ వైఎస్సార్సీపీలో మాదిరిగా యధేశ్ఛగా వ్యవహరించే అవకాశం బీజేపీలో ఉండదు కాబట్టి అక్కడ ఎంతవరకూ అణిగిమణిగా సాగుతారు, అధిష్టానం నుంచి ఏమేరకు ఆశీస్సులు అందుతాయన్నదే చూడాలి.