విశాఖ డెయిరీలో టీడీపీ లక్ష్యం నెరవేరిందా?

విశాఖ డెయిరీని దారికి తెచ్చుకునే ప్రయత్నంలో పాలక టీడీపీకి సానుకూల సంకేతం దక్కింది. ఇప్పటి వరకూ వైఎస్సార్సీపీలో ఉన్న ఆ డెయిరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్, ఇతర డైరెక్టర్లు రాజీనామా చేశారు. వైఎస్సార్సీపీని వీడుతున్నట్టు వెల్లడించారు. దాంతో వారిని టీడీపీలో చేర్చుకోవడమా లేక బీజేపీలో చేరే ప్రయత్నంలో ఉన్న అడారి ఆనంద్ కి సహకరించడమా అన్నదే మిగిలింది.

2019 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ తరుపున బరిలో దిగిన అడారి ఆనంద్ ఓటమి పాలయ్యారు. ఆతర్వాత వైఎస్సార్సీపీలో చేరి మొన్నటి ఎన్నికల్లో విశాఖ వెస్ట్ నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు. వాస్తవానికి ఆయనకు సానుకూల సంకేతాలు కనిపించినప్పటికీ చివరకు రాష్ట్రవ్యాప్త కూటమి ప్రభావంలో ఆయన కొట్టుకుపోయారు. చట్టసభల్లో అడుగుపెట్టాలన్న ఆయన లక్ష్యానికి దూరమయ్యారు.

ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి విశాఖ డెయిరీ యాజమాన్యం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఓవైపు చింతకాయల అయ్యన్నపాత్రుడు పట్టుదలగా వ్యవహరించారు. ఆ డెయిరీ తమ చెప్పుచేతల్లో ఉండాలన్న సంకల్పంతో కనిపించారు. దానికి తగ్గట్టుగా స్పీకర్ చొరవతోనే ఏపీ అసెంబ్లీ సభా సంఘాన్ని నియమించారు. దానికి తోడుగా విశాఖ డెయిరీలో పాలసేకరణ ధర మీద రైతులు, వేతనాల సమస్య మీద సిబ్బంది ఆందోళనలకు పూనుకున్నారు.

రాజకీయ కారణాలతోనే అన్ని వైపులా ఒత్తిడి పెంచుతున్నట్టు గ్రహించిన అడారి ఆనంద్ వైఎస్సార్సీపీని వీడుతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికైనా తమకు ఉపశమనం దక్కుతుందని ఆయన ఆశిస్తున్నారు. అయితే విశాఖ డెయిరీని దారికి తెచ్చుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న టీడీపీ నేతలు ఇంతటి ఊరుకుంటారా అన్నది సందేహమే. కానీ అడారి ఆనంద్ మాత్రం బీజేపీలో చేరడం ద్వారా టీడీపీ దూకుడుకి అడ్డుకట్ట వేయాలన్న సంకల్పంతో ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకు భిన్నంగా టీడీపీ నాయకత్వమే స్వాగతం పలికితే పసుపు కండువా కప్పుకున్నా ఆశ్చర్యం లేదు. దాంతో విశాఖ టీడీపీ నేతల పట్టు చెల్లుతుందా లేక అడారి ఆనంద్ తన హవా చాటుకుంటారా అన్నదే ఇప్పుడు కీలకం. ఏమైనా విశాఖ డెయిరీ వేదికగా జరుగుతున్న రాజకీయాలు మాత్రం ఆసక్తిగా మారుతున్నాయి.

అడారి ఆనంద్ టీడీపీలో ఉండగానే అయ్యన్నతో విబేధాలు మొదలయ్యాయి. తన కుమారుడు చింతకాయల విజయ్ కి రావాల్సిన ఎంపీ సీటు అడారి ఆనంద్ చేజిక్కించుకున్నారన్నది అప్పట్లో అయ్యన్న ఆగ్రహానికి కారణం. అదే సమయంలో అడారి ఆనంద్ తండ్రి తులసీరావు సుదీర్ఘకాలం పాటు విశాఖ డెయిరీలో చక్రం తిప్పిన సమయంలో కూడా అయ్యన్న ఆశించినట్టుగా జరగలేదన్న దుగ్ద ఉంది. అన్నింటికీ మించి ఆ ప్రాంతంలో కొప్పుల వెలమ వర్సెస్ గవర కులాల మధ్య ఉండే ఆధిపత్య పోరు కూడా తోడయ్యింది. వీటన్నింటితో అయ్యన్న నేరుగా రంగంలో దిగి అడారి ఆనంద్ కి చెక్ పెట్టాలని చూస్తున్న తరుణంలో ఇప్పుడు ఆనంద్ వైఎస్సార్సీపీని వీడిన తర్వాత వ్యవహారం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *