జగన్ ఇల్లు ప్యాలెస్ అయితే చంద్రబాబుది నివాసం మాత్రమే ఎలా అయ్యింది?

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసాన్ని సీఎం ఇల్లు అనే అంటారు. కానీ మాజీ ముఖ్యమంత్రి ఇంటిని మాత్రం తాడేపల్లి ప్యాలెస్ అంటారు. నిజానికి చెప్పాలంటే సీఎం చంద్రబాబు నివశిస్తోంది నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కట్టడం. ప్రభుత్వం నుంచి నోటీసులు కూడా అందుకున్న నదీ గర్భంలో ఉన్న భవనం. అయినా దానిని జనం అంగీకరించేలా చేయడం సాధారణ నైపుణ్యం కాదు. అది నేరం కాదని జనాలను నమ్మించడం చిన్న విషయం కాదు. హైకోర్టు నోటీసులు ఇచ్చిన భవనంలో కూడా నివశిస్తూ అంతా చట్టబద్ధమేనని నమ్మించడమన్నదే స్కిల్

పైగా ఆ ఇల్లు ప్రభుత్వానికి అప్పగించేశామని ఇంటి యజమాని లింగమనేని రమేశ్ ఓసారి అంటారు. ప్రభుత్వానిది కాదు అని మరోసారి అంటారు. ఇలా అధికారంలో ఉన్నోళ్లు, లేనోళ్లు కూడా మాట మార్చేసిన నిర్మాణం సీఎం నివాసం కావడం మీద జనాలెవరికీ అభ్యంతరం లేకుండా చేయడం అసాధారణం. జగన్ కి ఇడుపులపాయ, లోటస్ పాండ్, బెంగళూరు, తాడేపల్లి ఇలా వివిధ ప్రాంతాల్లో ఇళ్లున్న విషయాన్ని కొందరు ప్రస్తావిస్తారు. చంద్రబాబు కి కూడా జూబ్లీహిల్స్, ఫామ్ హౌస్, ఇప్పుడు కుప్పం.. ఇలా వివిధ ఇళ్లున్నాయన్నది మాత్రం తెలివిగా విస్మరిస్తారు.

అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన నివాసం కోసం స్థలం కొనుగోలు చేసి కట్టుకున్న భవనాన్ని మాత్రం తాడేపల్లి ప్యాలెస్ అంటారు. పైగా దానిని సినీ సూపర్ స్టార్ మహేశ్ బాబు బాబాయ్ నుంచి లాక్కున్నారనే ప్రచారం కూడా చేస్తారు. పైగా తన దగ్గర కొనుగోలు చేశారని ఆయనే చెప్పిన తర్వాత కూడా జగన్ ఇల్లు ప్యాలెస్ అవుతుంది. చంద్రబాబుది మాత్రం కేవలం నివాశమే అవుతుంది.

జగన్ సొంత భవనమే కాదు.. ఆఖరికి రుషికొండ మీద నిర్మించిన ప్రభుత్వ భవనాలు కూడా ప్యాలెస్ నే. అదే చంద్రబాబు ఆధ్వర్యంలో అమరావతి పేరుతో అంగరంగ వైభవంగా సాగించే నిర్మాణాలు మాత్రమే నిజమైన అభివృద్ధి అని చెబుతారు. జగన్ హయంలో నిర్మించేవి మాత్రమే ప్యాలెస్ లు. అది ఆయన సొంత ప్రయోజనాల కోసం. చంద్రబాబు పాలనలో కట్టేవి మాత్రం ప్రజా ప్రయోజనార్థం. ప్రజల కోసం బాబు పడిన శ్రమ ఫలితం. చివరకు నీరుగారిపోయే నిర్మాణాలు కూడా బాబు వైఫల్యం కాదు.. ఆధునిక హంగులతో ఉన్న కట్టడాలు జగన్ స్వప్రయోజనం.

ఇలా ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా చిత్రీకరించడంలో, జనం నమ్మేలా చేయడంలో, జనం కూడా అలానే మాట్లాడుకునేలా చేయడం గతంలో ఎన్నడో ఈనాడు జమానాలోనే కాదు.. సోషల్ మీడియా కాలంలోనూ సాగుతోంది. నేటికీ అదే పంథా. అందులో చంద్రబాబు సామర్థ్యం అర్థమవుతుంది. ప్రచారం ద్వారా ఆయన సాధించిన విజయాలు చాటుతుంటాయి. బాబులో ఉన్న మార్కెటింగ్ స్కిల్ తో తనేం చేసినా జనం కోసమేనని ఒప్పించడంలో ఉన్న ఘనత బోధపడుతుంది.

జగన్ మాత్రం వ్యాపారంలో సక్సెస్ అయ్యారని ఆయన అనుచరులు అంటుంటారు గానీ మార్కెటింగ్ లో అట్టర్ ఫెయిల్ పొలిటీషియన్ అతడు. తను చేసిన కార్యక్రమాలే కాదు.. చివరకు తన సొంత ఇంటి మీద సాగుతున్న ప్రచారానికి కూడా చెక్ పెట్టలేని అసహాయుడు. తన ఇంటి మీద ప్యాలెస్ అనే ముద్ర వేస్తున్నా చూస్తూ ఏమీ చేయలేని నిస్సహాయుడు. ఇంతటి చేతగానితనం రాజకీయంగా ఎవరికీ మేలు చేయదు. అంతెందుకు ఆయన హయంలో ప్రభుత్వ భవనాలకు రంగులు వేస్తే నేరమని, ఇప్పుడు అన్నా క్యాంటీన్లను పసుపు రంగులో ప్రారంభించినా ఏమీ చేయలేని చేతగానితనం తనది. అదొక్కటే కాదు.. జగన్ అప్పులు చేయడం నేరం, జగన్ పథకాలు ఘోరమన్న వాళ్లే.. ఇప్పుడు ఆస్తులు తనాఖా కాదు..ఏకంగా అమ్మకాలకే దిగినా దానిని జనాలకు చెప్పడానికి తగిన యంత్రాంగం సిద్ధం చేసుకోలేని అసహాయ స్థితిలో జగన్ ఉన్నారంటే కాదనగలమా..

రాజకీయాల్లో ఎన్ని నైపుణ్యతలున్నా అసలైనది మార్కెటింగ్ స్కిల్ తోడయితేనే ఎవరైనా విజయం సాధించగలరని జగన్- చంద్రబాబు మధ్య తేడా చాటుతోంది. ప్రజల కోసం ఎంతగా పనిచేసినా కమ్యూనిస్టులకు ఓట్లు రావడం లేదని చాలామంది అంటుంటారు. అది కూడా మార్కెటింగ్ నైపుణ్య లోపమే. తాము మాత్రమే ప్రజలను ఉద్దరించగలమని జనాలను నమ్మించడంలో ఉన్న వైఫల్యమే. దానికి తగ్గ యంత్రాంగం లేనితనమే. జనాలను ఉద్దరించడమే కాదు.. తాము మాత్రమే ఉద్దరించగలమన్న విశ్వాసం కలిగించాలి. జనాలను వంచించినా అది కూడా జనాలకు మేలు చేయడం కోసం చేస్తున్నదే అని నమ్మించాలి. ఈ విషయంలో జగన్ పునరాలోచన చేసుకుంటారా.. లేదంటే చంద్రబాబు ఆయన చుట్టూ ఉన్న శక్తిమంతుల వల చిక్కి శల్యమయిపోతారా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *