జమిలీ ఎన్నికలకు రెడీ అవుతున్న వైఎస్సార్సీపీ, టీడీపీ అధిష్టానం కూడా సిద్ఢమా?
ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు తప్పవన్న అంచనాకు రాజకీయ పార్టీలు వచ్చేశాయి. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అంటూ మోదీ పదే పదే చెబుతుండడంతో పరిణామాలు అనివార్యంగా భావిస్తున్నారు.
వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కూడా జమిలీ ఎన్నికలంటూ తమ క్యాడర్ కి పిలుపునిచ్చారు. మరో రెండేళ్లలో ఎన్నికలు అనివార్యమంటూ చెబుతున్నారు. రాబోయే ఎన్నికలకు అంతా సిద్ధం కావాలని సూచిస్తున్నారు. సాధారణ ఎన్నికలు ముగిసి ఇంకా ఆరు నెలలు కూడా గడవకముందే అప్పుడే ఎన్నికలకు సన్నద్ధం కావాలని తమ పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం ఆసక్తిగా మారింది.
టీడీపీ నేతలు కూడా దాదాపుగా ఎన్నికల ముంగిట ఉన్నామన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. రాజకీయంగా జగన్ అండ్ కోను బద్నాం చేసే ప్రయత్నం జోరుగా చేస్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లో కూడా విపక్షాన్ని విమర్శించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఎక్కువ సమయమే కేటాయిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అదే బాట నడుస్తున్నారు. రాజకీయంగా వ్యాఖ్యాలు చేయడం ద్వారా క్యాడర్ కి కీలక సంకేతాలు పంపిస్తున్నట్టు కనిపిస్తోంది.
ఏపీలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నట్టు కనిపిస్తుండడం కీలకమైన పరిణామం. చివరకు పాలకపక్ష ఎమ్మెల్యేలు, నేతలు కూడా దానికి అనుగుణంగానే పెద్ద మొత్తంలో కూడబెట్టే పనిలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇసుక, లిక్కర్ దందాలలో అన్ని చోట్లా వేలుపెట్టి భారీగా సంపాదించే ప్రయత్నంలో పడ్డారు. అధిష్టానం కూడా అందుకు తగ్గట్టుగా సన్నద్ధం కావాలన్న సూచనలు పంపుతుండడంతో క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు సైతం అదే బాటలో ఉన్నట్టు కనిపిస్తోంది.
ఈ పరిణామాలన్నీ జమిలీకి ఏపీ జై కొట్టే సూచనలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు జమిలీని సమర్థించారు. పార్లమెంట్ లో బిల్లు పెడితే టీడీపీతో పాటుగా వైఎస్సార్సీపీ కూడా సమర్థించేలా కనిపిస్తోంది. దాంతో జమిలీ చట్టం సిద్దమయితే 2027లో మరోసారి సాధారణ ఎన్నికలతో పాటుగా ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగడం అనివార్యం. ఈ పరిస్థితుల్లో రాజకీయ సందడి జోరందుకునే సూచనలు కనిపిస్తున్నాయి.