టీమిండియాలో గంభీర్ చిచ్చు పెట్టారా.. పరాజయాల పరంపరలో కోచ్ పాత్ర ఎంత?
టీమిండియా ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంత పేలవ ప్రదర్శన చేసింది. న్యూజీలాండ్ తో సొంత గడ్డ మీద సిరీస్ లో ఏకంగా మూడుకి మూడు టెస్టులు ఓడిపోయింది. అయితే ఓటమి కన్నా జట్టులో కీలక ఆటగాళ్ల ప్రదర్శన మీద తీవ్ర చర్చ సాగుతోంది. అందులో ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముంగిట జట్టులో పరిణామాల మీద ఆందోళన వ్యక్తమవుతోంది.
జట్టు కోచ్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీమిండియా తగిన స్థాయిలో ప్రతిభ కనబర్చలేకపోతోంది. వరుసగా అటు శ్రీలంకలో , ఇటు సొంత గడ్డపై సిరీస్ లో కోల్పోయింది. గంభీర్ నిర్ణయాల వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్న వాదన వినిపిస్తోంది. గంభీర్ వ్యవహారశైలి జట్టులో సీనియర్లకు అసలు గిట్టడం లేదన్నట్టుగా కథనాలు వస్తున్నాయి. చేజేతులా అవుట్ అవుతున్న తీరు అందుకు నిదర్శనంగా చెబుతున్నారు.
గంభీర్ ఏకపక్ష నిర్ణయాలు రుచించని జట్టులోని కీలక ఆటగాళ్ల వైపల్యమే జట్టు కొంప ముంచింది. కొద్దిపాటి టర్నింగ్ పిచ్ ల మీద కూడా చేతులారా వికెట్లు పారేసుకున్న వైనం అందుకు కారణంగా కనిపిస్తోంది. వాస్తవానికి గంభీర్ ను కోచ్ గా వద్దని సీనియర్లు మొత్తుకున్న బీసీసీఐ సెక్రటరీ జై షా పంతానికి పోయి నియమించినట్టుగా సమాచారం. దాంతో గంభీర్ వ్యవహారశైలితో పొసగని జట్టు ఆటగాళ్లు ఓటమికయినా సిద్ధపడుతున్నారు గానీ గంభీర్ తో సర్ధుబాటు చేసుకోవడానికి సిద్ధంగా లేరన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
గౌతమ్ గంభీర్ ను తొలగించడానికి ఇప్పటికిప్పుడు బీసీసీఐ అంగీకరించే అవకాశం కనిపించడం లేదు. అదే సమయంలో గంభీర్ చేసిన ప్రయోగాలతో జట్టు కుదుటపడే ఛాన్స్ కూడా లేదు. ఏ ప్లేయర్ బ్యాటింగ్ ఆర్డర్ కూడా స్థిరంగా ఉంచకపోవడం ఈ సిరీస్ లో ప్రస్ఫుటంగా కనిపించింది. ఏకంగా కెప్టెన్ నిర్ణయాల్లో కూడా జోక్యం చేసుకుని తనకు నచ్చినట్టుగా అంతా నడవాలని గంభీర్ కోరడంతో రోహిత్ శర్మ ఏమాత్రం సహించలేకపోతున్నట్టు ప్రచారం. కోహ్లీ అయితే మరింత అసహనంగా ఉన్నట్టు సమాచారం. మొత్తంగా టీమిండియాలో గంభీర్ కారణంగా మొదలయిన చిచ్చు మరింత రచ్చ కావడం ఖాయంగా ఉంది.
కామెంటేటర్ గానూ, ఐపీఎల్ వేర్వేరు ఫ్రాంచైజీలకు కోచ్ గానూ ఉన్న కాలంలో గంభీర్ వ్యవహరించిన తీరు, ఆయన సంధించిన విమర్శనాస్త్రాలు అన్నీ ఇప్పుడు జట్టు ఆటగాళ్ల మధ్య సఖ్యతకు చేటు తెస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే విబేధాలకు ఆస్కారమిస్తున్న గంభీర్ వ్యవహారశైలి సరిచేసుకునే అవకాశం లేకపోవడంతో ఈ వ్యవహారం మరింత ముదిరే అవకాశమే ఉంది. జట్టు విజయావకాశాలపై అది తీవ్ర ప్రభావం చూపడం అనివార్యం. రాహుల్ ద్రావిడ్ కోచ్ గా ఉన్నంత కాలం అందరినీ సమన్వయం పరిచడంలో, సఖ్యంగా నిలపడంలో పెట్టిన శ్రద్ధ గంభీర్ లో వీసమెత్తు కనిపించడం లేదన్నది బహిరంగ సత్యం. ఇలాంటి పరిణామాలు జట్టు ని ఏ దిశకు తీసుకెళ్తాయో చూడాలి మరి.