ఇజ్రాయెల్ మీద ఎదురుదాడి దిశలో ఇరాన్, యూఎస్ ఎన్నికల తర్వాత సంక్లిష్టమే!
పశ్చిమాసియా పరిస్థితులు పట్టుతప్పేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ముదురుతున్న యుద్ధమేఘాలు మరింతగా కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయోలు, ఇరాన్ మధ్య యుద్ధం అనివార్యంగా కనిపిస్తోంది. అక్టోబర్ ప్రారంభంలో ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడితో ఉధృతమయిన పరిస్థితులు గత వారం ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలతో మరింత తీవ్రంగా మారింది. తాజాగా మరోసారి ఇజ్రాయెల్ మీద దాడులకు ఇరాన్ సన్నద్ధమవుతోంది. అందుకు తగ్గట్టుగా ఇరాన్ బలగాలకు దేశ అధ్యక్షుడి నుంచి ఆదేశాలు వచ్చాయి.
ఇరాక్ భూభాగం నుంచి ఇజ్రాయెల్ మీద విరుచుకుపడాలని ఇరాన్ భావిస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే అమెరికన్ నిఘా వర్గాలు నిర్ధారించాయి. న్యూయార్క్ టైమ్స్ పత్రికలో కథనాలు కూడా వచ్చాయి. తాజాగా ఇజ్రాయెల్ నిఘా వర్గాలు కూడా ఇరాన్ దాడిని ఎదుర్కొనేందుకు సన్నద్దమవుతున్నట్టు చెబుతున్నాయి. అక్టోబర్ లో జరిగిన దాడితో ఇజ్రాయెల్ తీవ్రంగా నష్టబోయింది. ఆ దేశ రక్షణబలగాల వైఫల్యం, ముఖ్యంగా మిస్సైల్ నియంత్రణ వ్యవస్థ లోపాలు బయటపడ్డాయి. నేరుగా మెసాద్ ప్రధాన కార్యాలయం చేరువలో ఇరాన్ మిస్సైల్ పేలడం సంచలనంగా మారింది.
మరోవైపు ఇజ్రాయెల్ – హెజ్బుల్లా మధ్య కూడా వైరం ముదురుతోంది. హెజ్బుల్లాచీఫ్ ను మట్టుబెట్టేసినందున ఊపిరిపీల్చుకున్న ఇజ్రాయెల్ కి ఇప్పుడు హెజ్బుల్లా ఎదురుదాడులు తలనొప్పిగా మారాయి. దక్షిణ లెబనాన్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే దిశలో ఐడీఎఫ్ అడుగులు వేస్తోంది. కానీ తీవ్రంగా ప్రతిఘటన ఎదుర్కొంటోంది. లెబనాన్ సరిహద్దుల సమీపంలోని ఇజ్రాయెల్ పోర్ట్ సిటీపై హెజ్బుల్లా బలగాలు విరుచుకుపడుతుండడంతో ఇజ్రాయెల్ కి కూడా సమస్యగా మారుతోంది.
ఈ పరిణామాలన్నీ పశ్చిమాసియా పరిస్థితిని మరింత దిగజార్చేలా కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ తో దౌత్య సంబంధాల విషయంలో తాజాగా సౌదీ అరేబియా కూడా తీవ్రంగా స్పందించింది. పాలస్తీనా భూభాగాన్ని గుర్తించి, గాజాలో దాడులు నిలువరిస్తేనే ఇజ్రాయెల్ తో సంబంధాలు మెరుగుపర్చుకుంటామని ఆ దేశం ప్రకటించింది. దాంతో వ్యవహారం మరింత ముదిరేలా కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత యుద్ధం తీవ్రమయ్యే ప్రమాదం కనిపిస్తోంది.