మూడు ఎంపీ సీట్లు ఏకగ్రీవం, 6 నెలల తర్వాత మళ్లీ రాజ్యసభకు టీడీపీ ఎంపీ!
ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మూడు సీట్లు కూటమి ఖాతాలో చేరాయి. ఇద్దరు టీడీపీ తరుపున, ఒకరు బీజేపీ తరుపున బరిలో నిలవడంతో వారి ఎన్నికకు మార్గం సుగమమయ్యింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభలో ఖాళీ అయిన మూడు ఎంపి స్థానాల భర్తీకి సంబంధించి టిడిపి అభ్యర్ధులుగా బీద మస్తాన్ రావు,సానా సతీష్ బాబు,బిజెపి తరుపువ ఆర్.కృష్ణయ్యలు నామినేషన్లు దాఖలు చేశారు.మంగళవారం అసెంబ్లీ భవనంలో రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్.వనితా రాణి వద్ద రాజ్యసభ ఎంపి అభ్యర్ధులుగా వారు నామినేషన్లను దాఖలు చేశారు.మూడు రాజ్యసభ స్థానాలకు ముగ్గురు అభ్యర్ధులే నామినేషన్ల దాఖలు చేయడంతో నామినేషన్ల పరిశీలన,ఉప సంహరణల గడువు అనంతరం వారి ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
ఈనామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్ధులు తరపున ఆయా పార్టీల ప్రతినిధులుగా రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్,కొల్లు రవీంధ్ర,అనగాని సత్యప్రసాద్,సత్యకుమార్ యాదవ్, కె.అచ్చన్నాయుడు,పి.నారాయణ,పలువురు ఎంఎల్ఏలు తదితరులు పాల్గొన్నారు.
గత ఏప్రిల్ లో రాజ్యసభ టీడీపీ ప్రాతినిథ్యం కోల్పోయింది. అప్పట్లో రవీంద్రకుమార్ రిలీవ్ తర్వాత టీడీపీ చరిత్రలో తొలిసారిగా రాజ్యసభలో జీరో అయ్యింది. అయితే అనూహ్యంగా వైఎస్సార్సీపీకి ముగ్గురు ఎంపీలు రాజీనామా చేయడంతో ఆ స్థానంలో టీడీపీ తరుపున ఇద్దరిని గెలిపించేందుకు అవకాశం వచ్చింది. మళ్లీ ఆపార్టీ పార్లమెంట్ ఎగువ సభలో కనిపించబోతోంది.