మోహన్ బాబు- మనోజ్ బాబు- మీడియా తప్పు ఎవరిది? శిక్ష ఎవరికీ?

మంచు కుటుంబంలో ఆస్తుల వివాదం కొత్తది కాదు. కొంతకాలంగా దాని ఆనవాళ్లు బయటకు వస్తూనే ఉన్నాయి. వాటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూనే వచ్చారు. చివరికిలా బయటపడింది. అయితే ఈసారి కూడా భౌతికదాడులు, బౌన్సర్ల తో గొడవలు, గేట్లు నెట్టుకోవడాలు, కేసులు పెట్టుకోవడాలు వంటివి చూస్తున్నాం. సహజంగానే సెలబ్రిటీ ఫ్యామిలీ కాబట్టి వాళ్ల చుట్టూ ఏం జరిగినా జనాల్లో ఆసక్తి ఉంటుంది. మీడియాకు మంచి సరుకుగా మారుతుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది.

అనూహ్యంగా మీడియానే నిందిస్తూ, మితిమీరి మీడియా మీద దాడికి దిగుతూ మోహన్ బాబు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. హద్దులు మీరి ప్రవర్తించినందుకు ఈపాటికే ఆయన పోలీసుల అదుపులో ఉండాలి. కానీ ఇక్కడ కూడా గాయపడిన బాధితుడు సామాన్య విలేకరి. గాయం చేసిన వాడు ఓ సెలబ్రిటీ. కనుకనే పోలీసుల సమక్షంలోనే దాడి జరిగినా ఇప్పటి వరకూ చర్యలు లేవు. చట్టం అందరికీ సమానం కాదని మరోసారి చాటుతున్న వాస్తవమిది.

మీడియా శృతిమించలేదా..

మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన ఘటనను అనేక మంది వివిధ కోణాల్లో వ్యాఖ్యానిస్తున్నారు. అందులో స్థూలంగా రెండు వాదనలు మీడియా శృతిమించి వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుందంటూ చాలాకాలంగా వినిపించే స్వరం ఒకటి. మోహన్ బాబు, మనోజ్ పరస్పరం పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్న తర్వాత కేసు విషయంలో మీడియా మౌనంగా ఉండాలా అన్న ప్రశ్న దానికి పోటీగా వస్తుంది. కేసు కవర్ చేయడం వేరు, వారి ఇంట్లో కెమెరాలతో చొరబడడం వేరు అంటూ మరో వాదన ముందుకొస్తుంది.

ఏమైన ఎలక్ట్రానిక్ మీడియా, ఇప్పుడు డిజటిల్ మీడియా విజృంభణ తర్వాత పరిధులు, హద్దులు అంటూ మాట్లాడుకోవడం హాస్యాస్పదమే. అదే మోహన్ బాబు రోడ్డెక్కి ధర్నాలకు దిగితే కావాల్సిన మీడియా కెమెరాలు, ఇప్పుడు ఆస్తుల తగాదాతో రోడ్డున పడితే రాకూడదా అన్న ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలి. ఏమైనా కెమెరాల సాక్షిగా వీరంగం చేసిన మోహన్ బాబు చాలా పెద్ద సంకేతం ఇచ్చారు. మీడియా ప్రతినిధుల చేతుల్లోని లోగోల సాయంతో వారినే తలపగులగొట్టవచ్చంటూ చాటేశారు. ఇది భవిష్యత్తులో మీడియా వాళ్లందరికీ ఓ ప్రమాద సూచిక.

వివాదం పక్కదారి పడుతుందా

నిజానికి మోహన్ బాబు ఆస్తులన్నీ కష్టార్జితమే. ఆయనకు తప్ప మరొకరికి వాటి మీద హక్కు లేదు. అందుకే తనకు నచ్చినట్టుగా వ్యవహరించే స్వేచ్ఛ ఉంటుంది. పెద్ద కొడుకుని కాసింత ప్రేమగా చూసినట్టు కనిపిస్తోంది. దానికి మంచు మనోజ్- మౌనికా రెడ్డి వివాహమే కారణమనే వాదన కూడా తోసిపుచ్చలేం. ఏ రీత్యా చూసినా మోహన్ బాబు ఇంటి ఆస్తుల పంచాయతీలో ఆయనకు చట్టం అండగా ఉంటుంది.

మనోజ్ మాత్రం కొంత దూకుడుగానే సాగుతున్నారు. తండ్రిని రోడ్డు పాల్జేస్తున్నారనడం నిస్సందేహం. మోహన్ బాబు కూడా కుటుంబ విషయాన్ని కూడా సహజధోరిణీలో తెగేవరకూ లాగుతున్న తీరు దానికి దోహదం చేస్తుంది. ఉభయుల శ్రేయస్కు కోరే కొద్దిమంది సమక్షంలో సెటిల్ చేసుకోవాల్సిన వ్యవహారాన్ని రచ్చ రంబోలా చేసుకున్నారు. అరిస్తే కరుస్తా అన్నట్టుగా ఈ వ్యవహారంలో అరుస్తున్న మీడియా మీద కస్సుమన్నారు.

మోహన్ బాబు- మనోజ్ మధ్య మొదలైన వివాదం ఇప్పుడు మోహన్ బాబు వర్సెస్ మీడియా అన్నట్టుగా మారింది. దాంతో ఇక మనోజ్ ఆశలు నెరవేరేనా అన్న ప్రశ్న కూడా ఉదయిస్తోంది. ఉద్దేశపూర్వకంగానే అసలు సమస్యను పక్కదారి పట్టించే లక్ష్యంతో మోహన్ బాబు ఇలాంటి వివాదం రాజేశారా లేక ఆవేశంలో అందరి మీద చేయిచేసుకుంటారన్న అపవాదుకి అనుగుణంగా వ్యవహరించారా అన్నది తేలదు గానీ అసలు సమస్య కొంత పక్కకు పోయినట్టే భావించాలి.

చివరకు ఏమవుతుందో

మీడియా దాడి విషయంలో మోహన్ బాబు అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి గానీ, ఇతర కారణాల రీత్యా గానీ ప్రస్తుతం ఆస్పత్రి పాలయ్యారు. కొంత వేడి చల్లారిన తర్వాత తనే టీవీ9 ప్రతినిధిని పిలిపించి మాట్లాడే అవకాశం ఉందని సినీ విలేకర్ల మాట. అది జరుగుతుందా లేదా అన్నది పక్కన పెడితే మనోజ్ కి మాత్రం ఆస్తుల విషయం మరింత ముడిపడినట్టుగా అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మోహన్ బాబు యూనివర్సిటీ విషయంలో విష్ణుతో సమానంగా వాటా కోరుతున్న మనోజ్ ఆశలు నెరవేరే అవకాశం లేదని ప్రచారం సాగుతోంది. మోహన్ బాబు మనసు మారితే తప్ప మనోజ్ ఆశించింది జరిగడానికి ఆస్కారం లేదు. కాబట్టి మోహన్ బాబు ఓ అడుగు దిగి వచ్చి ఇటు మీడియాతో పాటుగా అటు మనోజ్ ను కూడా శాంతిపజేసే ప్రయత్నం జరుగుతుందా లేదా అన్నది చూడాలి.

ప్రస్తుతానికి మంచు కుటుంబ వివాదం, మీడియాపై దాడి మాత్రం అనేక విషయాలను పక్కకు మళ్లించింది. ముఖ్యంగా టీడీపీలో యనమల లేఖ వివాదం, నాగబాబుకి మంత్రి పదవి మీద టీడీపీ శ్రేణుల అసహనం వంటివి కొంత చల్లారిపోయేందుకు దారితీసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *