దళిత చేతిలో బీజేపీ పగ్గాలు పెడతారా, వ్యూహాత్మక ప్రచారమా?
![](https://teluguheadlines.com/wp-content/uploads/2024/12/pm_narendra_modi_amit_shah_jp_nadda_rajnath_singh_pti_file_photo__1715645491.webp)
బీజేపీ జాతీయ అధ్యక్షుడి నియామకం కొంతకాలంగా నానుతోంది. మొన్నటి సాధారణ ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్ర క్యాబినెట్లో చేరిన జేపీ నడ్డా రాజీనామా చేశారు. ఆ తర్వాత కొత్త అధ్యక్షుడి నియామకం వరకూ ఆయన పార్టీ పగ్గాలు మోస్తానని ప్రకటించారు. కానీ తీరా 8 నెలలుగా ఆ వ్యవహారం కొలిక్కి రావడం లేదు. ప్రస్తుతం సంస్థాగత ఎన్నికలు మొదలయ్యాయి కాబట్టి ఫిబ్రవరి నాటికి నూతన అధ్యక్షుడి విషయంలో స్పష్టత వస్తుందన్న ప్రచారం సాగుతోంది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడి నియామకం విషయంలో నరేంద్ర మోదీ- అమిత్ షా ఒక వైపు, ఆర్ఎస్ఎస్ పెద్దలు మరోవైపు ఆలోచిస్తుండడమే ఈ జాప్యానికి కారణమని బహిరంగంగా స్పష్టమవుతోంది. రెండు బృందాల మధ్య ఏకాభిప్రాయం కోసం చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దాంతో నియామకం వాయిదా పడుస్తూ వస్తోంది.
ఇక వచ్చే ఫిబ్రవరిలో కొత్త అధ్యక్షుడిని నియమించాల్సి వస్తే దళిత నేతకు అవకాశం ఉంటుందన్న ప్రచారం మొదలయ్యింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఒక దళిత నేతను నియమిస్తారని నాలుగైదు రోజులుగా చర్చ జరుగుతోంది. గతంలో కూడా బీజేపీ అధ్యక్ష బాధ్యతలను తెలంగాణాకి చెందిన బంగారు లక్ష్మణ్ అనే ఎస్సీ నేతకు అప్పగించారు. కానీ కొంతకాలం గడవకముందే ఆయన్ని లక్ష రూపాయల లంచం కేసు కారణంగా తొలగించారు. ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉండడం సహించలేని సెక్షన్ ఇలాంటి కుట్ర పన్నిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
![](https://teluguheadlines.com/wp-content/uploads/2024/12/BJP-National-President-JP-Nadda-C-former-Karnat_1680792459583-1024x576.webp)
తాజాగా డాక్టర్ అంబేడ్కర్ విషయంలో బీజేపీ అభాసుపాలయ్యింది. పార్లమెంట్‌లో హోం మంత్రి అమిత్ షా చేసిన కామెంట్స్ ఆ పార్టీని ఇరకాటంలో నెట్టాయి. ఇతర వివాదాలు రాజేసి విషయాన్ని పక్కదారి పట్టించినా అంబేడ్కర్ కి అవమానం జరిగిందన్న అభిప్రాయం బలంగా ఉంది. వాస్తవానికి ఎస్సీలలో దాదాపుగా ప్రతీ రాష్ట్రంలోనూ కొన్ని కులాలను టార్గెట్ గా చేసుకుని ఆర్ఎస్ఎస్ పనిచేసింది. అది ఫలించింది. బీజేపీకి కొంత మేర ఉపయోగపడింది. ఉదాహరణకు యూపీలో నాన్ చమర్ ఎస్సీలు బీజేపీకి అండగా నిలవడం. ఇప్పుడు అలాంటి ఎస్సీలను కూడా అంబేడ్కర్ వివాదం దూరం చేసిందన్న వాదన ఉంది. దాంతో సమస్యకు విరుగుడిగా ఎస్సీ నేతను పార్టీ అధ్యక్షుడిగా చేద్దామన్న ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చినట్టు కనిపిస్తోంది.
ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడిగా దళిత నేత మల్లికార్జున ఖర్గే ఉన్నారు. అదే క్రమంలో బీజేపీ కూడా దళితుడిని పార్టీ ప్రెసిడెంట్ చేయాలని ఆలోచిస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. అదే జరిగితే అర్జున్ మేఘ్‌వాల్, దుశ్యంత్ గౌతమ్, బేబీ రాణీ మౌర్య వంటి వారిని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. కానీ బీజేపీ ఇప్పుడు దక్షిణాది ఎస్సీ నేత కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అది అంత సులువుగా కనిపించడం లేదు. దాంతో ప్రస్తుతం దళితుడిని పార్టీ ప్రెసిడెంట్ చేయాలని ఆలోచించినప్పటికీ తగిన సమర్థుడు కనిపించడం లేదంటూ చివరిలో తమకు నచ్చిన నేతకు పగ్గాలు అప్పగించే యోచనలో ఉన్నారా అన్న సందేహం కలుగుతోంది. లేదంటే కొంతకాలం పాటు బీజేపీ అధ్యక్ష పగ్గాలు ఎస్సీ నేతకు ఇచ్చి అంబేడ్కర్ మీద కామెంట్స్ తో పోయిన పరువు దక్కించుకునే ప్రయత్నం చేస్తారా అన్నది కీలకం. ఏమయినా ఎస్సీలలో బీజేపీ నేతలంతా డిఫెన్స్ మోడ్ లోకి వెళ్లిన తరుణంలో ఈ నిర్ణయం ఆసక్తికరమే.