ఏపీలో కొత్త ఎయిర్ పోర్టుల చుట్టూ వివాదాలు, అడుగులు పడేనా?
ఏపీకి కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సహాయం ఎంత అన్నది అంతుబట్టకుండా ఉంది. ఆఖరికి అమరావతికి ఇచ్చే రూ. 15వేల కోట్ల నిధులు కూడా అప్పుగానా, గ్రాంట్ గానా అన్నది సందేహంగా కనిపిస్తోంది. ఈ సందిగ్ధం కొనసాగుతున్న వేళ తాజాగా కొత్త ఎయిర్ పోర్టుల చుట్టూ ప్రకటనలు చిచ్చుపెడుతున్నాయి. బహుశా పౌరవిమానయాన శాఖ టీడీపీ ఎంపీ చేతిలో ఉండడంతో ఆ శాఖ ద్వారానే ఎక్కువ ఫలితాలను ఆశిస్తూ ఎయిర్ పోర్టుల చుట్టూ హంగామా చేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది.
తాజాగా కాకినాడ జిల్లాలోని అన్నవరం చేరువలో ఓ ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం ప్రకటనలు వస్తున్నాయి. అన్నవరం చేరువలోని తొండంగి మండలం బెండపూడి వద్ద ఎయిర్ పోర్ట్ నిర్మాణ ప్రతిపాదనలు తెరమీదకు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బెండపూడి గ్రామపరిధిలో విమానాశ్రయం ఏర్పాటుకు చురుగ్గా సన్నాహాలు చేస్తుండడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 519 ఎకరాల్లో 1222 మంది రైతు ల వద్ద నుండి స్థలం సేకరణకు రెవెన్యూ అధికారులు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో రైతులు రోడ్డెక్కుతున్నారు.
మరోవైపు శ్రీకాకుళంలో కూడా ఎయిర్ పోర్ట్ నిర్మించబోతున్నట్టు స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. అక్కడ కూడా పెద్ద మొత్తంలో భూసేకరణ చేయాల్సి ఉంటుందనడం నిస్సందేహం. అయితే ఇప్పుడు అటు అన్నవరం, ఇటు శ్రీకాకుళంలో కొత్త ఎయిర్ పోర్టుల అవసరం మీద చర్చించాల్సిన అవసరం కనిపిస్తోంది.
ప్రస్తుతం నిర్మాణంలో భోగాపురం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని చివరి ప్రాంతానికి కూడా సుమారు 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంత తక్కువ దూరంలో మరో ఎయిర్ పోర్ట్ నిర్మాణం అవసరం ఏమిటన్నది గుర్తించాల్సి ఉంది. ఇక రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుంచి అన్నవరం వరకూ కేవలం 100 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. ప్రస్తుత విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి అన్నవరం కూడా అంతేదూరంలో ఉంటుంది. ఇరువైపులా అంతే దూరంలో మధ్యలో మరో ఎయిర్ పోర్ట్ నిర్మాణ అవసరాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. దానికోసమంటూ విలువైన భూములు సేకరించడం మీద అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే కర్నూలు, కడప ఎయిర్ పోర్టుల నిర్మాణం ఇరవై ఏళ్లుగా ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికీ అరకొర సర్వీసులతోనే సరిపెడుతున్నారు. నెల్లూరులో ఎయిర్ పోర్ట్ ప్రతిపాదన చాలాకాలంగా ఉంది. అదింకా స్పష్టత రాలేదు. అలాంటి అవసరమున్న చోట కాకుండా అందుబాటు దూరంలోనే ఎయిర్ పోర్ట్ ఉండగా, మరోటి నిర్మించాలన్న తపనలో ప్రభుత్వం ఉండడం మీద రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం భూయజమానుల మాట కాదని ముందుకెళ్తే పరిస్థితి ఎటు మళ్లుతుందన్నది ఆసక్తిగా మారుతోంది.