జోరు వాన, జారుతున్న బురదలోనూ పవన్ ముందుకే!
మన్యంలో మారుమూల ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను స్వయంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. పనసభద్ర పంచాయతీ బాగుజోల వెళ్లారు. గిరిజన గ్రామాలకు రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. రూ. 40 కోట్లతో నిర్మిస్తున్న 19 రోడ్ల పనులకు శ్రీకారం చుట్టారు. 39.32 కి.మీ. మేర నూతన రోడ్ల నిర్మాణం జరగబోతోంది. ఈ రోడ్ల నిర్మాణం పూర్తయితే 55 గిరిజన గ్రామాలకు చెందిన 3782 మందికి డొలీల బాధల నుండి విముక్తి లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.
సుదీర్ఘకాలంగా రోడ్డు సదుపాయం కూడా లేని గ్రామాలకు రహదారి నిర్మాణం ఆహ్వానించాలి. దానికి డీసీఎం పవన్ కళ్యాణ్ చొరవను అభినందించాలి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్ఆర్జీయే పథకంలో భాగంగా నిధులతో ఈ రోడ్ల నిర్మాణం జరపబోతున్నట్టు పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
వాతావరణం సహకరించకపోయినా, వాన తాకిడితో తాను పర్యటించాల్సిన ప్రాంతం బురదమయంగా మారినప్పటికీ వెనకడుగు వేయకుండా పవన్ కళ్యాణ్ ముందుకు సాగడం విశేషంగా మారింది. అనేక అవరోధాలను ఎదుర్కొని మారుమూల గ్రామాల్లో ఉపముఖ్యమంత్రి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తీరు ఆకట్టుకుంది. రోడ్లు, తాగునీరు, ఉపాధి అవకాశాల మీద తాను దృష్టి పెట్టినట్టు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆయన చెప్పినట్టుగా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు తాగునీరు, రహదారి అవస్థలు తొలగిస్తే పవన్ చొరవ నిజంగా కార్యరూపం దాల్చినట్టవుతుంది. వేల మంది గిరిజన ప్రజలు పవన్ చొరవను మనసులో ఉంచుకుంటారు.
గిరిజన ప్రాంతాల్లో గతంలో ఎన్టీఆర్, ఆ తర్వాత వైఎస్ఆర్ వంటి నేతలు చూపిన చొరవకు వారు రుణం తీర్చుకున్నారు. టీడీపీకి చాలాకాలం పాటు పట్టంకట్టిన గిరిజనులు, ఆ తర్వాత వైఎస్ జగన్ ను ఆదరించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తాను చెప్పింది అభివృద్ధిని చేతల్లో చూపితే పవన్ కళ్యాణ్ కి అదే రీతిలో గిరిజనుల్లో విశ్వాసం కలుగుతుందని చెప్పవచ్చు. పవన్ కేవలం శంకుస్థాపనలతో సరిపెట్టకుండా ఆపనులన్నీ పూర్తయ్యేలా చూస్తారని ఆశిద్దాం.