గోదావరి జిల్లాల్లో బీసీలకు అన్యాయం జరుగుతోందా?
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ కేటాయింపుల్లో బీసీలకు అన్యాయం జరుగుతుందన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మొత్తం ఎమ్మెల్యే స్థానాల్లో ఎన్డీయే కూటమి గెలుచుకుంది. కూటమిలో టీడీపీ-15, జనసేన-5, బీజేపీ ఒకటి చొప్పున దక్కించుకున్నాయి. మూడు ఎంపీ సీట్లను కూడా తలో ఒకటి చొప్పున మూడు పార్టీలు కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేశాయి.
ఇక నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా ఇప్పటి వరకూ కేటాయించిన వాటిలో బీసీలకు తగిన రీతిలో న్యాయం జరగలేదన్న వాదన బలపడుతోంది. మూడు మంత్రి పదవులు ఇస్తే అందులో రెండు కాపులకు( పవన్ కళ్యాణ్, దుర్గేశ్) దక్కించుకోగా, మరోటి శెట్టిబలిజ కోటాలో వాసంశెట్టి సుభాష్ కి దక్కింది.
ఇటీవల ప్రకటించిన వివిధ కార్పోరేషన్ చైర్మన్ల సహా నామినేటెడ్ పోస్టుల్లో 9 కీలక పదవుల్లో కాపులకు 5 దక్కాయి. అందులో సివిల్ సప్లయిస్ కార్పోరేషన్, కాకినాడ, అమలాపురం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ వంటి వాటితో పాటుగా ఏపీ క్రికెట్ అసోసియేషన్ లో సానా సతీశ్, టీటీడీ బోర్డ్ మెంబర్ గా నియమితులయిన జ్యోతుల నెహ్రూ వంటివారున్నారు.
క్షత్రియుడైన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబుకి విప్ హోదా దక్కగా, రాజమండ్రి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీని కమ్మ కులానికి చెందిన బొడ్డు వెంకటరమణ చౌదరికి కేటాయించారు. వారితో పాటుగా ప్రభుత్వ సలహాదారుగా బ్రాహ్మణుడైన చాగంటి కోటేశ్వరరావుకి ఛాన్సిచ్చారు. ఇలా 8 పోస్టులు ఓసీలకు దక్కగా కేవలం ఒకే ఒక్క విప్ హోదా మాత్రమే తుని ఎమ్మెల్యే, యాదవ కులానికి చెందిన యనమల దివ్యకు కేటాయించారు.
దాంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా లెక్కల ప్రకారం బీసీలకు తగిన ప్రాధాన్యత కేటాయించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్న విమర్శలు వస్తున్నాయి. కనీసం ఒక్క కార్పోరేషన్ చైర్ పర్సన్ పోస్టు కూడా బీసీలకు దక్కలేదన్న విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా బీసీలలో శెట్టిబలిజ కార్పోరేషన్ రాజమండ్రికి చెందిన నాయకుడికి కేటాయించినప్పటికీ ఆయనకు స్థానికంగా అంతగా ప్రాధాన్యత లేదన్న వాదన ఉంది. దాంతో నామినేటెడ్ పోస్టుల్లో అన్యాయం జరుగుతుందన్న వాదన బీసీల నుంచి వినిపిస్తోంది.