ఇళయరాజాకి కులవివక్ష, గర్భగుడి ప్రవేశాన్ని అడ్డుకున్న అర్చకులు, జీయర్లు
దేశంలోనే ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకి చుక్కెదురయ్యింది. ఆయన ఆలయంలో అడుగుపెట్టే ప్రయత్నానికి అభ్యంతరం వ్యక్తమయ్యింది. గర్భగుడిలో ఆయన ప్రవేశించడానికి నిరాకరించారు. దాంతో ఇళయరాజా నిరాశ చెందాల్సి వచ్చింది.
గర్భగుడిలోకి వెళ్లేందుకు ఇళయరాజా ప్రయత్నించగా ‘గర్బగుడిలోకి మీకు లోపలికి ప్రవేశం లేదని’ పూజారులు, జీయర్లు వెనక్కి పంపించేశారు. తమిళనాడు లోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయం వద్ద ఈ ఘటన జరిగింది. గర్భుగడిలో ప్రవేశించేందుకు చేసిన యత్నానికి స్థానిక పూజార్లు, ఆలయ అర్చకులు అంగీకరించకపోవడం వివాదంగా మారుతోంది.
ఇళయరాజా ఎస్సీ కాబట్టి ఆయన గుడిలో ప్రవేశించే అధికారంలో లేదని అడ్డుకున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గర్భగుడి ముంగిట ఆయన్ను నిలిపివేసి బయటకు పంపించారు. తొలుత ఆలయానికి వచ్చిన ఇళయరాజాకు అధికారులు స్వాగతం పలుకగా… పెరియ పెరుమాళ్ గుడి, నందనవనం, ఆండాళ్ళను ఆయన సందర్శించుకున్నారు. ఈక్రమంలో గర్భగుడి ఎదురుగా ఉన్న అర్ధ మండపంలోకి ప్రవేశించేందుకు యత్నించగా అడ్డుకున్న వీడియో వైరలవుతోంది.
ఇళయరాజా తన ప్రతిభతో ప్రపంచాన్ని మెప్పించినా గర్భగుడిలో ప్రవేశించడానికి వీలులేదంటూ అడ్డుకున్న తీరు కులవివక్షకు తార్కాణమంటూ తమిళనాడులో దుమారం రేపుతోంది. ద్రావిడ ఉద్యమ కారులు తీవ్రంగా మండిపడుతున్నారు. బీజేపీకి, మోదీకి మద్ధతుగా నిలిచిన ఇళయరాజా విషయంలోనే ఇలా జరిగితే ఇక సామాన్య దళితుల పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందోనంటూ పలువురు డీఎంకే నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.