గ్రంథి శ్రీనివాస్ పై ఐటీ దాడుల వెనుక రాజకీయ లక్ష్యాలున్నాయా?

దేశంలో ఎక్కడ ఐటీ, ఈడీ దాడులకు పూనుకున్నా దాని వెనుక రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయి. ఎవరినైనా తమ దారికి తెచ్చుకోవాలని ఆశిస్తున్న పాలక పెద్దలు ఆయా దర్యాప్తు సంస్థలు వినియోగిస్తున్నారన్న విమర్శలు చాలాకాలంగా ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో రాజకీయ నేత గ్రంథి శ్రీనివాస్ కి చెందిన సంస్థలు, ఇళ్లపై ఐటీ అధికారుల దాడులు అందులో భాగమేనా అన్న సందేహం కూడా కలుగుతోంది.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ వ్యాపారాలపై ఆదాయపు పన్నుశాఖ(ఐటీ) అధికారుల దాడులు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. రూ. కోట్ల వ్యాపారాలకు సంబంధించి పన్నులు ఎగవేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన నివాసం సహా వ్యాపార భాగస్వాముల ఇళ్లు, వ్యాపార సంస్థలలోనూ ఈ సోదాలు జరుగుతున్నాయి.

ఇటీవల గ్రంథి శ్రీనివాస్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రంధి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ నాగరాణికి ఫిర్యాదు చేశారు. పేదల ఇళ్ల కోసం సేకరించిన భూమిని అధిక ధరలకు కొనుగోలు చేశారని, అవకతవకలకు పాల్పడ్డారంటూ పవన్ కళ్యాణ్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇంతలోనే ఐటి దాడులు నిర్వహించటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

వైఎస్సార్సీపీలో అసంతృప్తిగా ఉన్న గ్రంథి శ్రీనివాస్ ఇటీవల పార్టీ ఫిరాయింపు ప్రయత్నాలు చేశారు. కానీ అవింకా కొలిక్కిరాలేదు. ఆయన్ని బుజ్జగించే ప్రయత్నం వైఎస్సార్సీపీ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజా దాడుల వ్యవహారం ఆసక్తిగా మారింది. ఇప్పటికే గ్రంథి శ్రీనివాస్ ఇల్లు, ఆఫీసులలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశంలోని జీవీఆర్‌ కంపెనీలోనూ సోదాలు చేశారు. పాత సింగరాయకొండ పంచాయతీ పరిధిలోని సాగర్‌ గ్రంధి ఎక్స్‌పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(జీవీఆర్‌)లో కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. రొయ్యల ప్రాసెసింగ్‌, ఎక్స్‌పోర్ట్‌ చేసే ఈ కంపెనీ గ్రంథి శ్రీనివాస్ కుటుంబీకులదే.

కృష్ణాజిల్లా నాగాయలంకకు చెందిన ప్రముఖ రొయ్యల వ్యాపారి, గ్రంధి శ్రీనివాస్‌ వ్యాపార భాగస్వామి చెన్ను లక్ష్మణరావు(సీఎల్‌ రావు) నివాసంలో కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఏకకాలంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఈ ఐటీ దాడుల వ్యవహారం వెనుక రాజకీయంగా గ్రంథి శ్రీనివాస్ ను దాడితెచ్చుకునే యత్నం ఏమైనా ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *