డీఎస్సీ నోటిఫికేషన్ పేరుతో నిరుద్యోగులతో చంద్రబాబు సర్కారు ఆటలు!
అదిగో డీఎస్సీ..ఇదిగో నోటిఫికేషన్ అంటూ ఊరిస్తున్నారు. ఇప్పటికే ఐదు నెలలు గడిచిపోయింది. అయినా తొలి ఐదు సంతకాల్లో ఒకటైన డీఎస్సీ నోటిఫికేషన్ కి మోక్షం లేదు. ఇది ఆశావాహులను తీవ్రంగా నిరాశపరుస్తోంది. నిరుద్యోగ ఉపాధ్యాయులతో ఆటలాడుతున్నట్టుగా ఉంది.
నవంబర్ 3న నోటిఫికేషన్ అంటూ తొలుత ప్రకటించారు. మంత్రి నారా లోకేశ్ విదేశీయాత్ర ముగించుకుని రాలేదని 6వ తేదీకి వాయిదా వేశారు. తీరా ఆరు నాడు కూడా రిలీజ్ కాలేదు. మరో వారం పడుతుందని పాఠశాల విద్యాశాఖ ప్రకటన. ఇలా వాయిదా మీద వాయిదాలు వేస్తూ డీఎస్సీ నోటిఫికేషన్ మీద దాటవేత ధోరణి ఉపాధ్యాయ ఆశావాహులను నైరాశ్యంలో ముంచుతోంది.
ఇప్పటికే సీఎం సంతకం చేయడంతో డీఎస్సీ వస్తుందన్న నమ్మకంతో అనేక మంది కోచింగ్ సెంటర్ల బాట పట్టారు. పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. నోటిఫికేషన్ వస్తే తమ కలం నిజం చేసుకోవాలని ఆశిస్తున్నారు. అలాంటి వారిని వివిధ కారణాలతో ఆశాభంగం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
టెట్ ఫలితాలు వచ్చిన తర్వాతనైనా డీఎస్సీ వచ్చేస్తుందన్న నమ్మకంతో ఉన్న వారంతా తాజాగా రిజర్వేషన్ల వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదన్న వార్తలతో కలత చెందుతున్నారు. ముఖ్యంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కారణంగానే జాప్యం జరుగుతోందా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. తెలంగాణా డీఎస్సీలో వర్గీకరణ ఆధారంగా రిజర్వేషన్లు కేటాయింకపోవడాన్ని మంద కృష్ణమాదిగ తప్పుబట్టారు. ఏపీలో కూడా అదే జరిగితే పాలక టీడీపీకి అండగా ఉన్న మాదిగ కులస్తుల్లో ఆగ్రహం వస్తుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దానిపై స్పష్టత వచ్చిన తర్వాతే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేయోచనలో విద్యాశాఖ ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే అన్ని కసరత్తులు పూర్తి చేసి 16వేల పోస్టులతో డీఎస్సీ నియామక ప్రక్రియ ప్రారంభించాల్సి ఉండగా, తాత్సార్యం చేయడం తగదన్న అభిప్రాయం వినిపిస్తోంది. కానీ ప్రభుత్వం మాత్రం అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవడంతో పాటుగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ముంగిట నోటిఫికేషన్ ఇవ్వడం తమకు కలిసివస్తుందని భావిస్తున్నట్టు చెబుతున్నారు. నిరుద్యోగులకు తాము నియామకాల ద్వారా న్యాయం చేస్తున్నామన్న ప్రచారానికి డీఎస్సీ ఉపయోగించుకోవాలని లెక్కలేస్తున్నట్టు చెబుతున్నారు. కారణాలేమయినా నిరుద్యోగులతో ఆటలాడుతున్న తీరు మీద్ర సరికాదంటూ చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని ఆశావాహులు నిరశిస్తున్నారు.