లౌకిక రాజ్యానికి ప్రతీకగా విశాఖ రాస్‌హిల్ … విశాఖ కన్నెమరియ గుడికి నాగులచవితి శోభ
భారతీయత సంస్కృతికి మూలం భిన్నత్వంలో ఏకత్వమే. వేల ఏళ్లుగా అది మన సంస్కృతిలో జీర్ణించుకు పోయింది. కుల, మత విభేదాలు వెర్రితలలు వేసే ఘర్షణలు అక్కడ లేవు. ఆచారం, అనాచారం అసుంటసుంట వంటి విభజన రేఖలు అక్కడ భూతద్ధం పెట్టినా కనిపించవు. ఇదంతా ఆధునిక నాగరిక సమాజానికి దూరంగా ఎక్కడో అడవుల్లోనో, ఏ కొండ కోనల్లోనో అనుకుంటే తప్పులో కాలు వేసినట్టే. అన్ని రంగాల‌్లో అంతర్జాతీయ ప్రమాణాలతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ మహానగరంలోనే. అన్యమత ప్రచారం అంటూ బురద జల్లడాలు పెచ్చు మీరుతున్న ఈ రోజుల్లో కూడా పాత పోస్టాఫీసు పరిసర lవీధుల్లో మత సామరస్యం చెక్కు చెదరకుండా కొనసాగుతూ వస్తోంది. ఇది రమారమి 500 ఏళ్లుగా బంగాళాఖాతం అలల తీవ్రత నుంచి నగరాన్ని కాపాడే ఒడ్డు రాస్‌హిల్స్‌పై ఉన్న కన్నె మరియమ్మ కొండ చుట్టూ మంగళవారం నాగులచవితి శోభ సంతరించుకుంది. పెయిందొర పేట, అంబుసరంగ్ వీధి, బురుజుపేట, లక్ష్మీ టాకీస్ ఏరియా వాసులే కాక, నగరం నలు చెరగుల నుంచి పలు కుటుంబాల సభ్యులు ఈ కొండ గుడికి వచ్చి బాణా సంచాను కాల్చి నాగుల చవితి పండగను అట్టహాసంగా జరుపు కున్నారు. పూజ అనంతరం కొండపైకి వెళ్లి మేరీమాత ఆలయం బైట తమ చెప్పులు విడిచి అక్కడి నియమ నిబంధనల ప్రకారం నిశ్శబ్ధంగా ప్రార్థనలు చేసుకొని కొండ నలుచెరగులా తిరిగి సెల్ఫీలు తీసుకుంటూ సంబరం చేసుకున్నారు.
మేరీమాత కొండగుడి నిర్వాహకులు, సిబ్బంది కొండ దారి పొడవునా బాణా సంచాలను కాల్చుకుంటూ పుట్టలో పాలు పోసుకోవడానికి ఏమాత్రం అభ్యంతరం చెప్పకపోవడం గమనార్హం. నిజానికి పునీత మరియమ్మ కొండ పై సుప్రసిద్ధ రోమన్ క్యాధలిక్ ఆలయం ఉంది. ఇందులో ప్రతీ ఏటా డిసెంబర్ ఎనిమిదో తేదీన జరిగే పండగకు క్రైస్తవులే కాదు అన్ని మతాల వారూ ఆనందోత్సవంలా జరుపుకొంటారు. పైగా అపచారం, అన్యమత ప్రచారం అనే పదాలు ఆ దరిదాపుల్లో ఎవరి ఆలోచనల్లోనూ లేక పోవడాన్ని చూస్తే లౌకికరాజ్య నిజమైన సులక్షణం ఇదే కదా అనిపించకమానదు. హిందూ, ముస్లిం, క్రైస్తవ ప్రార్థనా స్థలాలన్నీ ఈ ఒకే కొండ మీద కొలువై ఉండటమే కాకుండా ఆయా కుల మతాల వారంతా అన్ని మతాల పండగల్నీ తమ సొంత పండగల్లాగే నిర్వహించు కోవడం వీరి నర నరాల్లో జీర్ణించుకకున్న ఐక్యతారాగానికి అద్దం పట్టింది.