తెలుగు రాష్ట్రాల విపక్షాలది ఒకే వ్యూహమా? అరెస్టు కోసం ఎదురుచూస్తున్నారా?
ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో Arrest Me అనే కామెంట్లు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అధికార మార్పిడి జరిగిన తర్వాత ఈ Arrest Me కామెంట్లపై చర్చ పెరిగింది. తెలంగాణలో Arrest Me రాగాన్ని కేటీఆర్ గత కొంత కాలంగా ఆలపిస్తుంటే.. తాజాగా వైసీపీ అధినేత జగన్ కూడా అదే తరహా రాగం అందుకున్నారు. హైదరాబాదులో ఫార్మూలా-ఈ రేసింగ్ కోసం 55 కోట్ల రూపాయలను కెబినెట్ అనుమతి లేకుండా ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించేశారనేది బీఆర్ఎస్ యువరాజు కేటీఆర్ మీదున్న అభియోగం. అభియోగమే కాదు.. దాన్ని స్వయంగా కేటీఆరే ఒప్పుకున్నారు. ఈ పరిస్థితుల్లో కేటీఆరును అరెస్ట్ చేస్తారని.. దీని కోసం గవర్నర్ పర్మిషన్ కూడా తీసుకుంటున్నారనే చర్చ ఇప్పటికే తెలంగాణ రాజకీయాల్లో ఉంది. అయితే తనను అరెస్ట్ చేసింది ఫార్మూలా-ఈ రేసింగ్ విషయంలో అవినీతి చేసి నందుకు కాదని చెప్పకునేందుకు కేటీఆర్ నానా తంటాలు పడుతున్నారనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు చేస్తున్నందుకు.. ప్రభుత్వాన్ని నిలదీసినందుకే తనను అరెస్ట్ చేశారని ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు రోజుకో ఇష్యూను కేటీఆర్ లేవనెత్తున్నారనేది కాంగ్రెస్ పార్టీ విమర్శ. ఈ క్రమంలోనే Arrest Me అంటూ ప్రకటనలు చేయడం కేటీఆర్ కు రివాజుగా మారింది. నన్ను అరెస్ట్ చేయండి.. నేను అరెస్ట్ కావడానికి సిద్దం.. జైలుకెళ్తా.. యోగా చేస్తా.. బయటకొస్తా.. పాదయాత్ర చేస్తా అంటూ అదే పనిగా రోజుకోసారి Arrest Me అంటూ ప్రభుత్వానికి సవాళ్ల లాంటి రిక్వెస్టులను కేటీఆర్ పెట్టుకుంటున్నారని తెలంగాణ సర్కిల్సులో చర్చ.
మరోవైపు ఏపీలో కూడా ఇదే తరహాలో Arrest Me నినాదం తెర మీదకు వచ్చింది. వైసీపీ అధినేత జగన్ తాజాగా ఈ కామెంట్లు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా వేదికగా నాటి ప్రతిపక్ష నేతలను.. వారి ఇళ్లల్లో వారిని ఇష్టానుసారంగా బండబూతులు తిట్టిన వారు.. పోస్టింగులు పెట్టిన వారిపై వరుస కేసులు నమోదవుతున్నాయి. నేను పోస్టింగులు పెడతా.. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని వైసీపీ అధినేత కూడా Arrest Me అంటూ కామెంట్ చేశారు. దీనికి మంత్రి సత్యకుమార్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. సింపతీ కోసం అరెస్ట్ కావడానికి సిద్దమంటూ జగన్ ప్రకటనలు చేస్తున్నారు.. కానీ జగన్ కోరుకున్నట్టు అరెస్టులు కావు.. ఎలా చేయాలో అలాగే జరుగుతుంది. చట్టం తన పని తాను చేసుకుని పోతుందంటూ ఆసక్తికరంగా స్పందించారు. అంటే జగన్ పాత కేసులు ఇంకా పెండింగులో ఉన్నాయని మంత్రి సత్యకుమార్ గుర్తు చేస్తున్నారా.. అనే చర్చ ఏపీ రాజకీయాల్లో జోరుగా జరుగుతోంది.
మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో Arrest Me అనే కామెంట్.. నినాదంగా చేసుకునేందుకు డియరెస్ట్ ఫ్రెండ్స్ అయిన కేటీఆర్, జగన్ తెగ ప్రయత్నిస్తున్నట్టుగానే కన్పిస్తోంది. ఫ్రెండ్స్ ఇద్దరికీ ఒకే రకమైన ఆలోచన రావడం విచిత్రంగా లేదు.
- చంద్రశేఖర్, సీనియర్ జర్నలిస్ట్