తెలుగువారిని అంతఃపురం సేవకులుగా వర్ణించిన సినీ నటి!
సినీ నటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తెలుగువారి పట్ల చేసిన విమర్శలు ఆమెను వివాదాల్లోకి నెట్టాయి. ఆ నటి తీరు మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరకి ఆమె తలొగ్గాల్సి వచ్చింది. తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇదంతా సీనియర్ నటి కస్తూరి కామెంట్స్ కారణంగా చెలరేగిన కలకలం తర్వాత పరిస్థితి.
తాజాగా తమిళనాడులో స్థిరపడిన తెలుగు వారి గురించి తాను చేసిన వ్యాఖ్యలపై కస్తూరి వివరణ ఇచ్చారు. ఆమె తెలుగువారినుద్దేశించి చేసిన కొన్ని విమర్శలు వైరల్ అయ్యాయి. దాంతో ఆమె తెలుగువారిని అవమానించలేదంటూ సర్ధుబాటు చేసుకోవాల్సి వచ్చింది.
చెన్నైలో జరిగిన ఓ రాజకీయ కార్యక్రమంలో ఆమె తళపతి విజయ్ పార్టీనుద్దేశించి మాట్లాడారు. ఆ సమయంలో వివిధ కులాలను ప్రస్తావించారు. దానికి తోడుగా తెలుగువారంతా 300 ఏళ్ల క్రితం అంతఃపురంలో మహిళలకు సేవ చేసేందుకు వచ్చినవారేనంటూ వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలపట్ల తెలుగువారంతా ఘాటుగా స్పందించారు. డీఎంకే కూడా కస్తూరి తీరుని తప్పుబట్టింది.
చివరకు తన వ్యాఖ్యలు విమర్శలకు దారితీయడంతో కస్తూరి వెనక్కితగ్గారు. ‘తెలుగు నా మెట్టినిల్లు. తెలుగు వారంతా నా కుటుంబం. ఇది తెలియనివారు నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. తెలుగు వారు ఎంతోమంది నాపై ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. తమిళ మీడియాలో నా కామెంట్స్‌ను వక్రీకరిస్తూ వస్తోన్న వార్తలను తెలుగు ప్రజలు నమ్మొద్దని కోరుతున్నా. డీఎంకే పార్టీ నా కామెంట్స్‌ను వక్రీకరిస్తోంది. ఇలా నాపై నెగెటివిటీ తీసుకొచ్చి నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తోంది. నేను తెలుగు వారికి వ్యతిరేకంగా మాట్లాడానంటూ విష ప్రచారం చేస్తోంది’ అని కస్తూరి తన పోస్ట్‌లలో పేర్కొన్నారు.
తమిళంతో పాటుగా తెలుగులో కూడా పలు సినిమాలతో కస్తూరి ప్రేక్షకులకు చిరపరిచితులే. టీవీ సీరియళ్లలోనూ నటించారు. తాజాగా కస్తూరి వివరణ తర్వాత వివాదం చల్లారుతుందా లేదా అన్నది చూడాలి. కానీ నోరు జారిన నటీమణి తీరు మాత్రం తమిళనాట తెలుగువారిలో తీవ్ర చర్చకు దారితీయడంతో ఆమెకు గట్టి ప్రతిఘటన తప్పలేదు.