ఆడబిడ్డల భద్రతకు ఒక్క చట్టమైనా తెచ్చారా? : రోజా
రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కల్పించడంలో ఎన్డీయే ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు.మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై కక్షతో దిశా పోలీస్ స్టేషన్ లను నిర్వీర్యం చేయడం తప్ప..ఆడపిల్లల భద్రత కోసం ఒక్క చట్టమైన తీసుకువచ్చారా? హోం మంత్రి ఎక్కడ ఉన్నారు? నేరస్థులకు ఎందుకు భయాన్ని కల్పించలేకపోతున్నారు అని ప్రశ్నించారు. శనివారం చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నగరిలో మూడేళ్ల పాపపై అత్యాచారం చేసి హత్య చేస్తే కనీసం ప్రభుత్వం స్పందించడం లేదని ధ్వజమెత్తారు.మద్యం మత్తులోనే నిందితుడు హత్య చేశారని అన్నారు. చిన్నారిని హత్య చేసిన సుశాంత్ కు ఉరి శిక్ష విధించాలని, బాధిత కుటుంబానికి 20 లక్షలు ఎక్స్ గ్రెషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. నగరి నియోజకవర్గంలో అత్యాచారం జరిగితే ఎమ్మెల్యే ఎక్కడ అన్నారు అని విరుచుకుపడ్డారు. ఈవిఏంలతో గెలిస్తే ఇలానే ఉంటుందని ఎద్దేవా చేశారు. పిఠాపురంలో పదహారేళ్ళ అమ్మాయికి టిడిపి నాయకులు మత్తు మందు ఇచ్చి హత్య చేస్తే ఇంతవరకు నిందితుడిని పట్టుకోలేదని మండిపడ్డారు. ఈరోజుకి బాధిత కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూపురం లో అత్తా కోడళ్ళపై అత్యాచారం చేసినా స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ కనీసం స్పందించలేదని ధ్వజమెత్తారు. మంగళగిరి నియోజకవర్గంలో 24 గంటల్లో ముగ్గురిపై అత్యాచారం మంత్రి నారా లోకేష్ పట్టించుకోలేదని విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మద్యం షాపులను తగ్గించాలని, బెల్ట్ షాపులను తొలగించాలని కోరారు. మద్యం షాపులపై రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ ఉండాలని అన్నారు.