బాహుబలిలో బిజ్జాలదేవుడిలా జగన్ కి సజ్జల అన్నట్టేనా, ఎందుకలా?
బాహుబలి గుర్తుంది కదా. అందులో బిజ్జలదేవుడి పాత్రనే సజ్జల రామకృష్ణారెడ్డి పోషిస్తున్నారా.. ఎందుకో వైఎస్సార్సీపీ క్యాడర్ లో మెజార్టీ అలాంటి అభిప్రాయంతోనే ఉన్నారు. అధికారంలో ఉండగా అన్నీ తానై అన్నట్టుగా చక్రం తిప్పిన సజ్జల తీరు మీద నోరుమెదపలేకపోయారు గానీ ఆ తర్వాత చాలా గగ్గోలు పెట్టారు. అయినా గానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వెంట సజ్జల మినహా మరొకరికి ఛాన్స్ ఉండదని చెబుతున్నారు.
తాజాగా పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సజ్జల రామకృష్ణారెడ్డిని వైఎస్ జగన్ నియమించారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న స్పందనలు చూస్తుంటే సజ్జల వ్యవహారశైలితో జనం ఎంతగా విసుగుచెందారో అర్థమవుతుంది. జనం పక్కన పెడితే వైఎస్సార్సీపీ క్యాడర్ లో ఎంత అసహనం ఉందన్నది బోధపడుతుంది. సజ్జలను నియమించిన మరుక్షణం నుంచి పలువురు తమ అసహనం ప్రదర్శిస్తున్నారు. సజ్జల కారణంగానే పార్టీ భ్రష్టుపట్టే స్థితికి వచ్చినప్పటికీ ఆయన్నింకా మా నెత్తిన పెడతారా అంటూ క్యాడర్ వాపోతోంది.
అధికారంలో ఉండగా సజ్జలను సకల శాఖ మంత్రి అంటూ టీడీపీ వ్యాఖ్యానించేది. దాదాపుగా వాస్తవం కూడా. డీఫ్యాక్టో సీఎం స్థాయిలో ఆయన తీరుండేది. ఆ సమయంలోనే పార్టీని, క్యాడర్ ను ఆయన పూర్తిగా విస్మరించేశారు. జగన్ తనను నమ్ముకుంటే, తాను మాత్రం అందరికీ అతీతం అన్నట్టుగా వ్యవహరించారు. జగన్ కి, జనానికి మధ్య గ్యాప్ పెరగడానికి కారణమయ్యారు. అంతటితో సరిపెట్టుకుండా తన దగ్గరకు వచ్చిన వారిని కనీసం మనుషులుగా చూడడానికి కూడా ఆయన సిద్ధపడేవారు కాదన్న అభిప్రాయం కూడా ఉంది. అపాయింట్మెంట్ ఇవ్వకుండా అనేక మందిని వేధించిన అనుభవం ఉంది. సీఎంని కలిసేవారికి కూడా అడ్డుపెట్టిన అనుభవాలున్నాయి.
ఆ తర్వాత సోషల్ మీడియా బాధ్యతల్లో తన కొడుకుని తీసుకొచ్చి వైఎస్సార్సీపీ ప్రతిష్టను పూర్తిగా మంటగలిపేసిన వైనం కూడా అందరికీ తెలిసిందే. తాజాగా సోషల్ మీడియా కార్యకర్తలను వెంటాడుతున్న చంద్రబాబు ప్రభుత్వ తీరు మీద ప్రజల్లో ఆశించిన వ్యతిరేకత రాకపోగా, తగిన శాస్తి జరిగిందని చాలామంది అనుకోవడానికి అప్పట్లో సజ్జల సైన్యం సాగించిన అరాచకాలే కారణం. అలా పెద్ద సజ్జల, పిల్ల సజ్జల కలిసి జగన్ పరువు తీసిన అనుభవం కళ్లెదురుగా కనిపిస్తున్నా ఇంకా అదే సజ్జల రామకృష్ణారెడ్డిని ముందుపెట్టి పార్టీని గాడిలో పెట్టాలనే ప్రయత్నంలో ఉన్న జగన్ తీరు విస్మయకరంగా కనిపిస్తోంది.
సజ్జలను శకుని మామ అంటూ కొందరు సీనియర్ వైఎస్సార్సీపీ లీడర్లు ఆఫ్ ది రికార్డులో మాట్లాడుకుంటున్న వైనం గమనిస్తే సజ్జల కారణంగా జగన్ కి మేలు జరుగుతుందా మరింత మునిగే ముప్పు పొంచి ఉన్నట్టా అన్నది కీలకాంశం. నిజానికి సజ్జలకి క్షేత్రస్థాయి రాజకీయ అనుభవం లేదు. ఆయన జర్నలిస్టుగా జగన్ కి చేరువయ్యి, అక్కడి నుంచి సాక్షిలో కీలకంగా వ్యవహరించి, జగన్ క్యాంప్ లో నాయకుడిగా ఎదిగారు. దాంతో రాజకీయ అనుభవం లేకపోవడంతో ఆయనకు క్యాడర్ తో సఖ్యత, లీడర్లతో సమన్వయం సాధ్యం కాదనే అభిప్రాయం ప్రబలంగా ఉంది. అయినప్పటికీ ఆయనకే పార్టీ కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించడం ద్వారా వైఎస్సార్సీపీని వైఎస్ జగన్ ఎక్కడికి తీసుకెళ్తున్నారో పునఃసమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందో లేదో ఆపార్టీ అధినేతకే తెలియాలి.
చంద్రబాబు మీద వ్యతిరేకత పెరిగితే తనకే ఛాన్స్ వస్తుందన్న భ్రమలో వైఎస్సార్సీపీ ఉంటే అంతకుమించిన అవివేకం మరోటి ఉండదు. ఎందుకంటే 2024 ఎన్నికల ముంగిట కూడా మోదీ తమకే అండగా ఉంటారని భావించి, చివరకు ఎలా షాకిచ్చారో గుర్తిస్తే వచ్చే ఎన్నికల నాటికి ఎలాంటి పరిణామాలు మారుతాయో ఊహించడం పెద్ద కష్టం కాదు. అయినప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత మీద ఆశతో 2019-24 మధ్య పార్టీని భ్రష్టు పట్టించిన వాళ్లకే పెత్తనమంటే ఫలితాలు ఎలా ఉంటాయో అంచనా వేయొచ్చునేమో. రాజకీయాలు స్థిరంగా ఉండవు. కొన్నిసార్లు అంచనాలకు కూడా అందవు. అందుకే గతం నుంచి పాఠాలు నేర్చుకుని, పరిస్థితి చక్కదిద్దుకోవాలే తప్ప, అవే తప్పులు పదే పదే చేస్తామంటే చివరకు భంగపాటుకి రెడీ కావాల్సిందే మరి.