డ్యుయెల్ రోల్స్ చేయడానికి ఇది సినిమా కాదు పవన్..!
కొన్ని సినిమాల్లో హీరో , విలన్ ఒకడే ఉంటారు. హీరో, విలన్ మాత్రమే కాదు..కమెడియన్ పాత్ర సైతం తనే పోషించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది నిజజీవితంలో సాధ్యం కాదు. రాజకీయాల్లోనూ అసాధ్యం. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీరు చూస్తుంటే అటు అధికారంలో భాగం పంచుకుంటూ, ఇటు విపక్షంగా గొంతు వినిపించాలన్న వ్యూహంలో ఏమైనా ఉన్నారా అన్న సందేహం కలుగుతోంది.
ఏపీలో ఎవరికి నచ్చినా నచ్చకున్నా బలమైన ప్రతిపక్షం ఉంది. సీట్ల పరంగా అది ప్రస్ఫుటించకపోవచ్చు గానీ ఓట్ల పరంగా 40 శాతం ఉన్న పార్టీ అంటే చిన్న విషయం కాదు. పైగా తను సింగిల్ గా బరిలో దిగి ఓ జట్టు మీద సాధించిన ఓట్లు. కాబట్టి వైఎస్సార్సీపీకి బలమైన పునాదులున్నట్టు లెక్క. అలాంటి విపక్షం కార్యాచరణలోకి దిగితే కథ వేరుగా ఉంటుంది. ఆపార్టీకి సంస్థాగతంగా ఉన్న అనేక చిక్కులను అధిగమించి, సంఘటితంగా ముందడుగు వేస్తే అధికార కూటమికి అవస్థలు తప్పవు.
అలాంటి ఛాన్సివ్వకూడదని పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నారా.. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న తను విపక్ష నేత పాత్రలోనూ కనిపించాలన్న తపనతో ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే పిఠాపురంలో హోం మంత్రి మీద చేసిన విమర్శలున్నాయి. తన సహచర క్యాబినెట్ మంత్రిని ఆ విధంగా విమర్శించాల్సిన అవసరం లేకపోయినా అధికార భాగస్వామిగా విపక్షంలో వాటా కోరుతున్నారా అన్న సందేహం కలుగుతోంది.
సినిమాల మాదిరిగా ఇక్కడ డ్యుయెల్ రోల్ సాధ్యం కాబట్టి పవన్ నిజంగా అలాంటి ఆలోచనతో ఈ ప్రయత్నం చేస్తే అది బెడిసికొట్టే ప్రమాదం ఉంటుంది. అందుకు భిన్నమైన పథక రచన చేసి ఉంటే అది వేరుగా గానీ విపక్షానికి చోటు లేకుండా చేద్దామన్న ప్రయత్నంలో ఉంటే మాత్రం రెంటికీ చెడ్డ రేవడి అయిపోతారు జరభద్రం.