భారీ వర్ష సూచన, రైతులు సర్దుకోండి!
నవంబర్ నెలాఖరులో ఏపీలో భారీ వర్షాలకు అవకాశం ఉంది. దానికి అనుగుణంగా అంతా అప్రమత్తం కావాలని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా రైతాంగం వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది.
నవంబర్ 21వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం మరియు పరిసర ప్రాంతాలలో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందంటూ అంచనా వేసింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో నవంబర్ 23 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని చెబుతోంది. తర్వాత, పశ్చిమ-వాయువ్య దిశగా కొనసాగి, ఆతదుపరి 2 రోజుల్లో నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని లెక్కలేస్తోంది. తుఫాన్ గా పరిణమిస్తుందా లేక వాయుగండం తర్వాత బలహీనపడుతుందా అన్నది తేలాలి.
దీని ప్రభావంతో ఈ నెల 27,28 తేదీల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది. రైతులు ముందస్తుగా ఇప్పటి నుంచే వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.