ఏపీ పీఏసీ కోసం ఎన్నికలే, ఏకగ్రీవానికి అంగీకరించని కూటమి నేతలు
సంప్రదాయానికి భిన్నంగా సాగుతోంది ఎన్డీయే ప్రభుత్వం. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని విపక్షానికి అప్పగించడం 1966 నుంచి అమలవుతోంది. కానీ ఈసారి అందుకు భిన్నంగా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేనకు కట్టబెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆపార్టీ పక్షాన పులవర్తి రామాంజనేయులుకి పీఏసీ దక్కబోతోంది.
తొలుత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుని వైఎస్సార్సీపీ ప్రతిపాదించగానే ప్రభుత్వం కూడా అంగీకరించినట్టు ప్రచారం సాగుతోంది. దాంతో అంతా ఏకగ్రీవం అనుకున్నారు. తీరా అందుకు భిన్నంగా జనసేన నేతను బరిలో దింపాలని కూటమి నేతలు నిర్ణయించడంతో కథ మారిపోయింది. పోటీ అనివార్యమయ్యింది.
శుక్రవారం ఉదయం అసెంబ్లీ కమిటీ హాల్‌లో పీఏసీ సభ్యత్వాలకు ఓటింగ్ జరగబోతోంది. మండలికి మూడు సీట్లు దక్కుతుండగా అందులో రెండు వైఎస్సార్సీపీ కైవసంచేసుకుంటుంది. అసెంబ్లీలో మాత్రం ఆపార్టీకి అవకాశం లేకుండా చూడాలని ఆశిస్తున్నట్టు కనిపిస్తోంది. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహిస్తారు.
టీడీపీ తరపున నామినేషన్లు వేసిన ఏడుగురు సభ్యలు వేశారు. వారిలో శ్రీరాం రాజగోపాల్ (జగ్గయ్యపేట), బీవీ జయనాగేశ్వరరెడ్డి(ఎమ్మిగనూరు), ఆరిమిల్లి రాధాకృష్ణ (తణుకు), అశోక్‌రెడ్డి(గిద్దలూరు), బూర్ల రామాంజనేయులు(ప్రత్తిపాడు), నక్కా ఆనంద్‌బాబు(వేమూరు), కోళ్ల లలిత కుమారి(ఎస్ కోట) ఉన్నారు.
జనసేన తరపున భీమవరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పులవర్తి రామాంజనేయులు నామినేషన్ వేశారు. చైర్మన్ సీటు ఆయనకే ఖాయం చేసినట్టు సమాచారం. బీజేపీ తరపున నామినేషన్ వేసిన వారిలో ఆపార్టీ ఎల్పీ నాయకుడు విష్ణు కుమార్‌రాజు ఉన్నారు.
పీఎస్ యూ ఛైర్మన్‌గా కూన రవికుమార్( టీడీపీ- ఆముదాలవలస)కి అవకాశం ఇవ్వబోతున్నారు. అంచనాల కమిటీకి వేగుళ్ల జోగేశ్వర రావు( (మండపేట) చైర్మన్ అవుతారు.