ఊగిసలాటలో పీఏసీ చైర్మన్, పెద్దరెడ్డికి దక్కేనా?
పీఏసీ చైర్మన్ గిరీ కొత్త మలుపు తిరిగింది. దాదాపుగా పెద్దిరెడ్డికి ఖాయం అనుకున్న దశలో కూటమి నేతలు మెలిక పెట్టారు. జనసేన తరుపున కూడా నామినేషన్ దాఖలయ్యింది. దాంతో వ్యవహారం ఆసక్తిగా మారింది. వైఎస్సార్సీపీకి పీఏసీ చైర్మన్ గిరీ రాకుండా చేసే ప్రణాళిక సిద్ధం చేసినట్టు కనిపిస్తోంది. అయితే అధికారకూటమి సంప్రదాయానికి భిన్నంగా ఆలోచిస్తుందా లేక సభలో ఏకైక విపక్షానికి ఇస్తుందా అన్నది ఆసక్తిగా మారింది.
ఏపీలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పోస్టుకి సంబంధించి ఓ దశలో కూటమి ప్రభుత్వం వెనకడుగు వేసినట్టు కనిపించింది. పోటీ చేసే యోచనలో లేనట్టు ప్రచారం జరిగింది. అది కూడా విపక్షానికి దక్కకుండా చేయాలని ఆలోచించిన పాలక ఎన్డీయే పక్షాలు మనసు మార్చుకున్నాయనే ప్రచారం నడిచింది. దానికి తగ్గట్టుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రంగంలో దిగారు. ఆయన తరుపున నామినేషన్లు దాఖలు కావడంతో కథ వైఎస్సార్సీపీకి అనుకూలంగా మళ్లినట్టు కనిపించింది.
కానీ అక్కడే కొత్త మలుపు తీసుకుంది. పీఏసీ చైర్మన్ గిరీ కోసం నామినేషన్ల స్వీకరణకు గడువు ముగుస్తున్న దశలో మరో నామినేషన్ రావడంతో ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి. అయితే ఈసారి ఎన్డీయే పక్షాలకు చెందిన నాయకులే దానికి పోటీ పడుతున్నట్టు ప్రచారం మొదలెట్టారు. తద్వారా విపక్షానికి అవకాశం లేకుండా చేసే ఆలోచనతో ఉన్నట్టు కథనాలు వచ్చాయి. అందుకు అనుగుణంగానే వైఎస్సార్సీపీని ఇరుకున పెట్టేందుకు నామినేషన్లు వేసినట్టు భావిస్తున్నారు.
చివరకు ప్రభుత్వపెద్దలు పునరాలోచన చేస్తారా లేక కూటమికే పీఏసీ చేరుతుందా అన్నది చర్చనీయాంశమవుతోంది. వైఎస్సార్సీపీ తరుపున సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దానిని కట్టబెట్టాలని వైఎస్సార్సీపీ నిర్ణయించుకుంది. పెద్దిరెడ్డి తన నామినేషన్ వేయాల్సి ఉండగా ఆయన తరుపున వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్, తాటిపర్తి చంద్రశేఖర్ నామినేషన్ వేశారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఖాయమని ఓ దశలో భావించగా ప్రస్తుతం అది పూర్తి సందేహాస్పదంగా మారిపోయింది. 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో చురుగ్గా ఉన్న పెద్దిరెడ్డికి ప్రోటోకాల్ పదవి దక్కుతుండడం టీడీపీ అధినేతకు సహించడం లేదన్న వాదన ఉంది. పుంగనూరులో ఆయన్ని, ఆయన తనయుడిని కూడా అడుగు పెట్టకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిన టీడీపీ ఇప్పుడు కూడా అడ్డంకులు పెట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ కథ చివరకు ఎటు మళ్లుతుందో చూడాలి.
పీఏసీ చైర్మన్ గా పులవర్తి రామాంజనేయులు జనసేన తరుపున నామినేషన్ వేశారు. ఆయన మూడు పార్టీల తరుపున మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యే కావడం విశేషం. 2009లో కాంగ్రెస్, 2014లో టీడీపీ, 2024లో జనసేన టికెట్ మీద ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు. భీమవరం నుంచి గెలిచిన సీనియర్ కాపు నేతగా గుర్తింపు ఉంది.
పీయూసీ చైర్మన్ పదవి కాళింగ సీనియర్ నేత కూన రవికుమార్ కి ఛాన్స్ ఇవ్వబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. బూర్ల రామాంజనేయులు, నక్కా ఆనంద్ బాబు కూడా నామినేషన్లు వేశారు. ఎస్సీ నేతలకు దక్కుతుందా లేక బీసీ కోటాలో ఇస్తారా అన్నది తేలాలి.