సీఎం రమేశ్ ఇచ్చిన గిఫ్ట్ వెనక్కి పంపించిన ఎంపీ

అనకాపల్లి ఎంపీ, బీజేపీ నేత సీఎం రమేశ్ కి షాక్ తగిలింది. ప్రభుత్వ ధనాన్ని వృధా చేయడం తగదంటూ ఆయనకు సహచర మంత్రి హితువు పలికారు. ఖరీదైన కానుకలతో ఎంపీలను మభ్యపెట్టాలనే ప్రయత్నం మానుకోవాలని సూచించారు. బీహార్ ఎంపీ సుదామ ప్రసాద్ తీరుతో సీఎం రమేశ్ ఖంగుతినాల్సి వచ్చింది.
పార్లమెంట్ లో రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా సీఎం రమేశ్ ఉన్నారు. ఆయన నాయకత్వంలోని కమిటీ స్టడీ టూర్ కి వెళ్లిన సమయంలో కమిటీ సభ్యులకు ఖరీదైన కానుకలు పంపిణీ చేశారు. వాటిపై బీహార్ కి చెందిన ఎంపీ సుదామ ప్రసాద్ ఎదురుతిరిగారు.

సభ్యులకు ఇచ్చిన గిఫ్ట్ ప్యాక్ లో ఒక గ్రాము బంగారం, వంద గ్రాముల వెండి ఉండడాన్ని సుదామ ప్రసాద్ తప్పుబట్టారు. ప్రభుత్వ ధనాన్ని దుబారా చేయడమేనంటూ హితువుపలికారు. ప్రజాధనాన్ని ఇలా పార్లమెంట్ సభ్యలకు గిఫ్టుల పేరుతో వృధా చేయడం తగదంటూ సూచించారు. అంతేగాకుండా తనకు ఇచ్చిన గిఫ్ట్ ప్యాక్ తిరిగి వెనక్కి పంపించేశారు.
ప్రజలకు సేవచేయడం కోసమంటూ వచ్చిన పార్లమెంట్ సభ్యులకు ఇలాంటి కానుకులతో ప్రలోభపెట్టే ప్రయత్నం తగదని నేరుగా స్టాండింగ్ కమిటీ చైర్మన్ సీఎం రమేశ్ కి రాసిన లేఖలో పేర్కొన్నారు.
బీహార్ లో వరుసగా 2015,20 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన సుదామ ప్రసాద్ ప్రస్తుతం అర్రా ఎంపీ సీటుకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సీపీఐఎంల్ పార్టీకి చెందిన ఆయన తన పార్టీ విధానాలకు కట్టుబడి ఎంపీలు ఆదర్శంగా ఉండాలంటూ సీఎం రమేశ్ కి రాసిన లేఖ చర్చనీయాంశమవుతోంది. ఖరీదైన గిఫ్టులు వద్దని చెప్పడంతో సరిపెట్టకుండా తనకు అందించిన కానుకలను వెనక్కి పంపించి చెంపపెట్టు తీరుని వ్యవహరించారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఓవైపు భారీగా వేతనాలు పొందుతూ, ఇంకోవైపు స్టడీ టూర్ల పేరుతో దేశమంతా తిరగడం, భారీగా కానుకలు పొందడం ఏమిటంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. సుదామ ప్రసాద్ తీరుని అభినందిస్తున్నారు.