కంగనా కథ నమ్మేసి అభాసుపాలయిన ఆంధ్రజ్యోతి!
ఆంధ్రజ్యోతి తప్పులో కాలేసింది. నిర్ధారణ లేని వార్త రాసి చేతులు కాల్చుకుంది. మరి తప్పిదాన్ని సరిదిద్దుకునేలా రేపు పాఠకులకు అసలు వాస్తవం చెబుతుందో లేదో చూద్దాం.
అందరికీ నీతులు చెప్పే బల్లి కుడితిలో పడిందన్న నానుడి చందంగా వేమూరి రాధాకృష్ణ పత్రిక తీరు ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెక్యూరిటీలో మహిళా అధికారి ఉన్నట్టుగా ఫోటోతో వార్త ఇచ్చింది. కానీ అది అది వాస్తవం కాదు. ఆమె రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బాడీగార్డ్. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 27నాడు పార్లమెంట్ వద్ద జరిగిన కార్యక్రమంలో తీసిన ఫోటోలో రాష్ట్రపతి రక్షణ బృందంలోని మహిళా అధికారిని ప్రధానికి ఆపాదించి జ్యోతి చిత్రమైన వార్తను ఇచ్చింది.
ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పార్లమెంట్‌కు వచ్చిన సమయంలో ఆమె ముందు నడుస్తుండగా, ఆవిడ వెనుకే ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి ధన్కడ్ నడిచారు. వారి వెనుక ఈ సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నారు. ఆ ఫోటో తీసి ప్రధాని వెనుక నిలుచున్నారు కాబట్టి, ఆమె ప్రధాన మంత్రి సెక్యూరిటీలో చేరారు అంటూ వార్త వడ్డించేసింది. వెనుకా ముందూ ఆలోచించుకోకుండా ప్రధాని వెనుక ఉన్నవారంతా ఆయన భద్రతాదళంలోని వారే అనే రీతిలో వార్తలు ఇవ్వడమే విస్మయకరంగా కనిపిస్తోంది. నిజానికి ఇది మొదట బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వాట్సాప్ స్టేటస్ లో దర్శనమిచ్చింది. దానిని కొన్ని పత్రికలు కాపీ చేశాయి. చెక్ చేసుకోకుండా ఆంధ్రజ్యోతి కూడా వారి దారిలో న డిచేసింది. వాట్సాప్ యూనివర్సిటీ కహానీ వల్లించే ప్రయత్నం చేసేసింది.
పెద్ద మీడియా సంస్థల్లో కూడా వార్తల్లో నిర్దారణ లేకుండా, తోచిందల్లా రాస్తున్నారనడానికి ఇదో సాక్ష్యం. ముఖ్యంగా వాట్సాప్ యూనివర్సిటీ రాతలను వల్లించి పాఠకులను పక్కదారి పట్టించడంలో ఆంధ్రజ్యోతి వంటి సంస్థలు ముందున్నట్టు మరోసారి రుజువయ్యింది.