ఏపీలో పెట్టుబడుల మీద తెలంగాణా మంత్రి కీలక వ్యాఖ్యలు
తెలంగాణా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు భయపడుతున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. అమరావతికి వరద ముప్పు కారణంగా ఏపీకి పెట్టుబడులు వెళ్లే పరిస్థితి లేదంటూ అభిప్రాయపడ్డారు.
ఏపీలో చంద్రబాబు రాగానే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోయిందనేది తప్పుడు ప్రచారం మాత్రమేనంటూ చెప్పుకొచ్చారు. పెట్టుబడిదారులు అమరావతి కంటే హైదరాబాద్, బెంగళూరుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారంటూ మంత్రి పొంగులేటి అన్నారు.
ఏపీలో ఇటీవల ప్రభుత్వం వరుసగా ఎంవోయూలు కుదుర్చుకుంటోంది. అదే సమయంలో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ విషయంలో భిన్నమైన కథనాలు వస్తున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ఏపీ ప్రభుత్వంలో కీలక నేతలంతా పొంగులేటి మీద ఘాటుగా స్పందించే అవకాశం కనిపిస్తోంది.
గతంలో కూడా ఏపీ విషయంలో బీఆర్ఎస్ మంత్రులు తక్కువ చేసి మాట్లాడడం అనే ఆనవాయితీ ఉండేది. రోడ్లు సహా వివిధ సమస్యలను ప్రస్తావిస్తూ ఏపీని ఎద్దేవా చేసిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అది కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది. తమ పరిస్థితి బాగుందని చాటేందుకు ఏపీలో బాలేదన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నంలో తెలంగాణా నేతలు పార్టీలకతీతంగా ప్రయత్నించడం విడ్డూరమే.