కార్యకర్తలే బలిపశువులు, చంద్రబాబు, జగన్ ఎవరైనా అదే తంతు!
అధికారంలో టీడీపీ ఉందా లేక వైఎస్సార్సీపీనే కొనసాగుతుందా అన్నది తెలీయడం లేదు- ఇదీ ఓ సగటు టీడీపీ కార్యకర్త ఆవేదన. అంతకుముందు వైఎస్సార్సీపీ హయంలోనూ ఇలాంటి మాటలే వినిపించాయి. ఇంకా చెప్పాలంటే మేమంతా కష్టపడితే గెలిచిన సీఎం ఈయనేనా అని అప్పుడూ, ఇప్పుడూ సందేహించే పరిస్థితి ఆయా పార్టీల శ్రేణుల్లో ఉంది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు.
ఉదాహరణకు ఏలూరు పరిస్థితి చూద్దాం. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా టీడీపీ శ్రేణుల మీద పలు కేసులు పెట్టారు. ఆ కేసుల్లో ఇంకా కార్యకర్తలు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు కేసులు పెట్టించిన ఆయన టీడీపీ కండువా కప్పుకుంటున్నారు. తిరిగి మళ్లీ అదే కార్యకర్తల మీద పెత్తనం చేసేందుకు సిద్దమవుతున్నారు.ఇది ఒక్క ఏలూరులోనో, మరో ఊరిలో మాత్రమే అనుకుంటే పొరపాటు. దాదాపుగా అన్ని చోట్లా ఇదే తంతు. వలస పక్షులదే పెత్తనం. అప్పుడు చక్రం తిప్పిన వాళ్లే ఇప్పుడు అంతా తామై నడిపిస్తున్నారు. దాంతో నిబద్ధతతో పనిచేసిన కార్యకర్తలంతా తలలు పట్టుకుంటున్నారు.
అధికారుల నుంచి మొదలు..
జగన్ పాలనలో చెలరేగిపోయిన వారందరి పేర్లు రెడ్ బుక్ లో రాసుకున్నామని, అందరికీ చట్టం పరిధిలో చర్యలుంటాయని టీడీపీ నేతలు పదే పదే చెబుతూ వచ్చారు. కానీ తీరా అప్పట్లో కీలక పోస్టుల్లో చక్రం తిప్పిన అధికారులే ఇప్పుడు కూడా కథ నడుపుతున్నారు. రాష్ట్ర స్థాయిలో ఉన్న పదవుల నుంచి డివిజన్ స్థాయి, మండల స్థాయిల్లోనూ అదే తంతు. డీఎస్పీల నియామకాలు చూస్తే దానికో చక్కటి సాక్ష్యం. జగన్ హయంలో టీడీపీ నేతల మీద కాలుదువ్విన అధికారులంతా దాదాపుగా మంచి పోస్టులు దక్కించుకున్నారు. అప్పట్లో లూప్ లైన్లో ఉంటూ టీడీపీకి పరోక్షంగా సహకరించిన వారికి ఇప్పటికీ న్యాయం జరగిన దాఖలాలు లేవు. దాంతో తామంతా కష్టపడింది వీళ్ల కోసమా అని చాలామంది సతమతం కావాల్సి వస్తోంది.
మంత్రివర్గంలోనూ అదే తంతు..
చంద్రబాబు క్యాబినెట్ మంత్రుల్లోనూ అదే పంథా. విపక్షంలో ఉండగా టీడీపీ కోసం తెగించి పోరాడిన నేతలను పక్కన పెట్టేశారు. అనేక అవస్థలు ఎదుర్కొని నిలబడిన వారిని విస్మరించారు. ఎన్నికలకు కొన్ని నెలల ముందు టీడీపీ కండువా కప్పుకున్న వారికి పట్టం కట్టేశారు. అందులో మంత్రులు కొలుసు పార్థసారధి, వాసంశెట్టి సుభాష్, మడిపల్లి రాంప్రసాద్ రెడ్డి వారిని చూడొచ్చు. వీళ్లంతా వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా అక్కడ అనేక పనులు చక్కబెట్టుకున్నారు. చివరి క్షణంలో టీడీపీ పంచన చేరారు. ఏకంగా క్యాబినెట్ బెర్త్ దక్కించుకుని ఇప్పుడు అమాత్య హోదా అనుభవిస్తున్నారు. మరి అప్పుడు చంద్రబాబు వెంట సవాలక్ష సమస్యలు ఎదుర్కొంటూ సాగిన నేతలంతా ఏం నేరం చేశారు.
మాఫియాలోనూ మారలేదు..
అధికారులు, మంత్రులే కాదు.. దిగువన అన్నింటా కథ నడిపించే మాఫియా ముఠాలు కూడా దాదాపుగా అవే. ఇసుక, లిక్కర్, రైస్ మాపియా విషయాల్లో ఏం మార్పులు కనిపించడం లేదు. కాకినాడలో రైస్ మాఫియాను కట్టడి చేయలేకపోతున్నామని స్వయంగా సీఎం, డీసీఎం కూడా వాపోతున్నారు. సరిగ్గా అప్పుడు నడిపించిన వాళ్లే ఇప్పుడు తెరవెనుక ఉండి మాఫియా సాగిస్తున్నారంటూ ఉప ముఖ్యమంత్రి కూడా చెప్పాల్సి వస్తోంది. ఇసుక కూడా అంతే. అన్ని ర్యాంపులలోనూ దాదాపుగా వాళ్లే. అప్పట్లో ఇసుక అక్రమాలకు కారకులే ఇప్పుడు కథ నడిపేస్తున్నారు. టీడీపీ వెంట కష్టపడిన వారంతా ఇప్పుడు పూర్వపు మాఫియా ముందు దిగదుడుపే అన్నట్టుగా మారింది.
జనంలో అభాసుపాలు
అధికారంలో టీడీపీ ఉన్నప్పటికీ వైఎస్సార్సీపీ అనునాయులే హవా సాగిస్తున్న తీరు టీడీపీ శ్రేణులను తీవ్రంగా కలచివేస్తోంది. తమ ఆగ్రహాన్ని బాహాటంగా వెళ్లగక్కుతున్నారు. అసంతృప్తిని సోషల్ మీడియా నిండా పరుస్తున్నారు. అయినా అధిష్టానం లెక్క చేస్తే ఒట్టు. తమకు నచ్చినట్టు సాగుతామన్న సంకేతాలు పంపేస్తున్నారు. విపక్షంలో ఉండగా నాయకత్వం హైదరాబాద్ లో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో తెగించి పోరాడిన వారితో తమకేం పని అన్నట్టుగా సాగుతున్నారు.
వీలయితే కొందరు నేరుగా టీడీపీలో చేరడం, సాధ్యం కాకపోతే జనసేన రూపంలో వచ్చి పెత్తనం చేస్తుండడంతో క్యాడర్ ఆధారిత పార్టీగా చెప్పుకున్న టీడీపీలోనూ అసంతృప్తి పెరుగుతోంది. క్షేత్రస్థాయిలో శ్రేణులు కుతకుతలాడుతున్నాయి.
సరిగ్గా వైఎస్ జగన్ సీఎం గా ఉండగా ఆపార్టీ శ్రేణులకు సైతం ఇదే అనుభవం. తమను కాదని వాలంటీర్లకు పెత్తనమివ్వడంతో కుతకుతలాడిపోయారు. చివరకు కాడి వదిలేశారు. ఎన్నికల ముంగిట జగన్ ఎంత ప్రయత్నించినా స్పందన రాలేదు. తమకు అన్యాయం జరిగినందుకు అందరూ దూరం కావడంతో జగన్ కి ఝలక్ తప్పలేదు. ప్రస్తుతం చంద్రబాబు, లోకేశ్ కూడా పునరాలోచన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడుతోంది. ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి త్వరగా సర్థుకుంటే సమస్య పరిష్కారమవుతుంది.
అందుకు భిన్నంగా పార్టీ ఫిరాయింపుదారులకు పెద్ద పీట వేసి, వలసపక్షులతో కథ నడపాలని ఆశిస్తే కష్టాలు తప్పవు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు, ఎమ్మెల్యేలకు మధ్య దూరం పెరుగుతోంది. చాలాచోట్ల ఎమ్మెల్యేలు క్యాడర్ ను ఖాతరు చేయడం లేదు. ఇది తీవ్రమయితే తలనొప్పులు అనివార్యం.అ దే సమయంలో అధికార యంత్రాంగంలో సైతం ఇలాంటి అభిప్రాయమే బలపడుతుంది. అధికారం కోసం తమను వాడుకున్నారే తప్ప గెలిచిన తర్వాత తమకు న్యాయం జరగడం లేదన్నది అత్యధికుల వాదన. అధికారం చేతిలో ఉన్నంత మాత్రాన అందరికీ న్యాయం జరగకపోయినప్పటికీ కొందరికైనా జరుగుతుంది, అందరికోసం ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం కల్పించలేకపోతే అది నాయకత్వ లోపమే అవుతుంది చూసుకోండి మరి.