పీకే అక్కడ ఏమీ పీకలేకపోతున్నారు, యువత తిరుగుబాటుతో తలపట్టుకున్న నేత
ఎన్నికల వ్యూహకర్త ముసుగులో సకల అరాచకాలకు శ్రీకారం చుట్టిన ప్రశాంత్ కిషోర్ కి సొంత రాష్ట్రంలో చీవాట్లు తప్పడం లేదు. 2014లో బీజేపీ, 2019లో వైఎస్సార్సీపీ, 2024లో టీడీపీ కోసం పనిచేసి అడ్డమైన పనులతో ప్రజలను నమ్మించడానికి తెగించిన ఈ తుంటరికి తగిన శాస్తి జరుగుతోందంటూ గిట్టని వారు సంతోషపడుతుండడం విశేషం. ఒక ఎన్నికల్లో బీజేపీకి, ఆ వెంటనే కాంగ్రెస్ కి కూడా పనిచేసిన నేపథ్యం అతడిది. ఏపీలో కూడా వైఎస్సార్సీపీకి, టీడీపీ కి మద్ధతుగా నిలిచిన నేపథ్యం అతనికుంది. ఇప్పుడు తమిళనాడులో డీఎంకే కి పనిచేసి, తాజాగా అన్నా డీఎంకేతో చేతులు కలిపిన చరిత్ర అతడిది. రాజకీయ వైరిపక్షాల పంచన కూడా చేరి, ఒకరి గుట్టు మరొకరికి అందించే అవకాశవాద నేపథ్యం తనదని విమర్శకుల మాట.
తాను ఎవరికి అండగా ఉంటే వారినే గెలిపించగలనని భావించే అతడికి సొంత రాష్ట్రం మాత్రం చుక్కలుచూపిస్తోంది. జనసురాజ్ పేరుతో ప్రారంభించిన సొంత పార్టీలో ఇప్పటికే లుకలుకలు బయటపడ్డాయి. సీనియర్లు సెలవు చెప్పేశారు. మిగిలిన వారు కూడా రేపోమాపో అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆర్జేడీ అధికారంలోకి రాకుండా అడ్డుకునే లక్ష్యంతో ఓట్ల చీలిక కోసం ప్రారంభించిన పార్టీ ఫలితాన్నిచ్చేలా కనిపించడం లేదన్నది అతని అనుచరుల్లో సైతం వినిపిస్తున్న మాట. సొమ్ములు కోసం నానా గడ్డీ కరిచి, తన క్లయింట్లకి సానుకూల ఫలితాల కోసం జనాలను పక్కదారి పట్టించేటంత సులువు కాదు సొంత పార్టీ నడపడం అన్నది ఆయనకి ఎరుకలోకి వస్తుందన్న వాదన ఉంది.
తాజాగా బీహర్ లో నిరుద్యోగులు నిరసనలకు పూనుకున్నారు. ఉద్యోగ నియామకాల ప్రశ్నాపత్రాలు లీక్ చేసి నితీశ్ కుమార్ ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ ఆందోళన సాగిస్తున్నారు. పట్నాలో ఈ నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అప్పటి వరకూ నిరుద్యోగులకు అండగా ఉంటానని వారి ధర్నా శిబిరం వద్ద ఉపన్యాసం దంచిన ప్రశాంత్ కిషోర్ తీరా పోలీసులు రాగానే పక్కకి పారిపోయిన విషయాన్ని నిరుద్యోగులు గుర్తించారు. లాఠీఛార్జ్ తర్వాత మళ్లీ వచ్చి మీకు మద్ధతుగా నిలుస్తానని ప్రకటించడంతో ఆందోళనకారులు భగ్గుమన్నారు. ప్రశాంత్ కిషోర్ ను నిలదీశారు. దాంతో ఆయనకు కోపం రప్పించింది. యువత తిరగబడి, తనను ప్రశ్నించడం సహించలేని పీకే చివరకు తానే ఆమరణదీక్షకు పూనుకుంటున్నట్టు వెల్లడించారు.
నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ఆందోళనను పక్కదారి పట్టించే వ్యూహంలో ఉన్నట్టు బీహారీ యువత గుర్తించారు. అది మింగుడుపడని ప్రశాంత్ కిషోర్ ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయడం ఆసక్తిగా మారుతోంది. ఆయనకు మద్ధతుగా నిలిచే యువత పెద్దగా కానరాకపోవడంతో ఆయన ఎత్తుగడ ఫలించే అవకాశం లేదని అంటున్నారు. ఈ పరిణామంతో దేశమంతా తానో పెద్ద తోపు అనుకున్న పీకే సొంత స్టేట్ లో ఏమీ పీకలేకపోతున్నారన్న అభిప్రాయం బలపడేందుకు కారణమవుతోంది. ఇక మరికొని నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఏమవుతారో చూడాలి.