ఉపాధ్యాయుల ఒత్తిడికి తలొగ్గిన నారా లోకేశ్
ఏపీ విద్యాశాఖ మంత్రి వెనకడుగు వేశారు. ఓవైపు ఉపాధ్యాయులు, మరోవైపు సంఘాలు ఒత్తిడి తీసుకురావడంతో నిర్ణయం ఉపసంహరించుకున్నారు. హైస్కూళ్ల సమయాలు మార్చాలన్న నిర్ణయం మార్చుకున్నారు. దాంతో ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెనక్కి తగ్గినందుకు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
డిసెంబరు 2 నుంచి పాఠశాలల వేళలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి తగ్గట్టుగా తొలుత పైలట్ ప్రాజెక్టుగా కొన్ని స్కూళ్లను ఎంపిక చేసి అమలుచేసేందుకు పూనుకున్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ పాఠశాలలు తెరిచేలా నిర్ణయం తీసుకున్నారు.
కానీ తీరా ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అభ్యంతరం పెట్టాయి. ప్రభుత్వ తీరు మీద ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీలో స్కూల్ సమయాలు సవరించడం మీద గగ్గోలు పెట్టారు. ఇది ఏమాత్రం ప్రయోజనం కాదంటూ అభిప్రాయపడ్డారు. దాంంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. చివరకు పీడీఎఫ్ ఎమ్మెల్సీలతో నడిపిన చర్చల్లో నిర్ణయం ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది.
ఈ విషయాన్ని పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఐ. వెంకటేశ్వరరావు వెల్లడించారు. ఉపాధ్యాయులతో పాటుగా విద్యార్థులు కూడా అవస్థలు పడేలా స్కూల్ సమయాలు మార్చొద్దంటూ చేసిన వినతికి ఆయన స్పందించారని, సానుకూలంగా నిర్ణయం తీసుకుని పైలట్ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్టు ప్రకటించారని తెలిపారు.పాఠశాలల పనివేళల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు శాసనమండలిలో ప్రస్తావించడంతో విద్యామంత్రి స్పందించి ఈ ప్రతిపాదన రద్దు చేస్తున్నట్టు హామీ ఇచ్చారన్నారు.