అదానీ కేసులో ఏపీ ఐఏఎస్ లు కూడా ఇరుక్కుంటారా?

అదానీ సంస్థల మీద అమెరికాలో నమోదయిన కేసు ఏపీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. రాజకీయంగానూ, అధికార వర్గాల్లోనూ విస్తృత చర్చకు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు దీని చుట్టూనే రాజకీయం రంజుగా సాగుతోంది. అమెరికా అధికారులు కోర్టులో సమర్పించిన పత్రాల్లో మాజీ సీఎం జగన్ పేరు కూడా ప్రస్తావనకు రావడంతో ఏపీలో దీనికి సంబంధించి హాట్ డిస్కషన్ జరుగుతోంది.

ఓవైపు ఈ రాజకీయం రంజుగా సాగుతుండగానే.. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ చేసిన ఓ ట్విట్ ఈ ఎపిసోడును మరో లెవలుకు తీసుకెళ్లింది. ఇప్పటి వరకు ప్రస్తావనకు రాని ఐఏఎస్ అధికారుల పాత్ర గురించి పీవీఆర్ ప్రస్తావించారు. పైగా తాను చేసిన ట్వీటును ఏపీ సీఎంకు ట్యాగ్ చేశారు. గత ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే రద్దు చేసిన పీపీఏల విషయంలో .. అలాగే 2021 డిసెంబరులో సోలార్ పవర్ ఒప్పందాల్లో ఇద్దరు IASలు కీలక పాత్ర పోషించారని ప్రస్తావించారు. అంతే కాకుండా.. ఆ IASలు ఇద్దరూ తమ lord & masterకు పూర్తి స్థాయిలో సహకారం అందించారంటూ కామెంట్ కూడా చేశారు. ఇప్పుడు ఆ ఇద్దరు అధికారులెవరనే అంశంపై తెలుగు రాష్ట్రాల్లోని ఐఏఎస్ సర్కిల్సులో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు ఈ వ్యవహరంలో ఐఏఎస్సుల పాత్ర లేకుండా ఉంటుందా..? అనే చర్చ లోలోపలే జరుగుతున్నా.. పైకి మాత్రం ఎవ్వరూ ప్రస్తావించ లేదు. ఈ సైలెన్సును రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ బ్రేక్ చేశారు.

ఇక అప్పటి ఇంధన శాఖ మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాస రెడ్డి తనకూ ఈ ఒప్పందం గరించి తెలియదని.. నాడు ఇంధన శాఖ కార్యదర్శిగా ఉన్న నాగులాపల్లి శ్రీకాంత్ ఈ ఫైలు మీద సంతకం పెట్టమంటే.. తాను పెట్టలేదని.. దీంతో కెబినెట్టుకు పంపాల్సిందిగా చెప్పడంతో తాను కెబినెట్టుకు పంపేశానని చెప్పారు బాలినేని. ఇక అదే సమయంలో ఈ సోలార్ పవర్ ఒప్పందంపై పెద్ద ఎత్తున విమర్శలూ వచ్చాయి. దానిపై అప్పట్లో ఇంధన శాఖ కార్యదర్శిగా ఉన్న నాగులాపల్లి శ్రీకాంత్ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ప్రభుత్వం కుదుర్చుకున్న సోలార్ పవర్ ఒప్పందం వల్ల ఎలాంటి నష్టం లేదని స్పష్టంగా చెప్పారు. నాటి ప్రభుత్వం నిర్ణయాన్ని వెనకేసుకొస్తూ.. అనేక ప్రశ్నలను ఎదుర్కొని ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పీవీఆర్ సంచలన ట్వీటుతో ఇప్పుడీ విషయాలన్నీ మరోసారి చర్చకు వస్తున్నాయి. అలాగే గత ప్రభుత్వంలో భూ వ్యవహరాల్లో చాలా కీలక పాత్ర పోషించిన ఓ సీనియర్ ఐఏఎస్ పాత్ర కూడా ఇందులో ఉందని మరో చర్చా జరుగుతోంది. ఇప్పుడు ఏ మాత్రం అవకాశం దక్కినా సీఎస్ పీఠంపై కూర్చొవాలని సదురు అధికారి కలలు కంటున్నారట. పీవీఆర్ సంచలన ట్వీటుతో పరిపాలన వర్గాల్లో ఈ తరహా చర్చ జరుగుతోంది.

నాడు ఈ ఒప్పందంలో జరిగిన లావాదేవీల్లో కీలక పాత్ర పోషించిన ఇద్దరు IASలు ఎవరోననేది ట్వీట్ చేసిన రిటైర్డ్ IAS పీవీ రమేషుకు కాకుండా.. అప్పట్లో ఇంధన శాఖలో ఉన్నతాధికారిగా ఉన్న నాగులాపల్లి శ్రీకాంతుకు మాత్రం కచ్చితంగా తెలిసే ఉంటుందని అంతా అంటున్నారు. విచిత్రం ఏంటంటే.. ఈ ఒప్పందం జరిగినప్పుడు ఏపీ ఇంధన శాఖలో ఉన్న నాగులాపల్లి శ్రీకాంత్.. ఇప్పుడు కేంద్ర ఇంధన శాఖ అదనపు సెక్రటరీగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *