అచ్చెన్నాయుడి సోదరుడైతే రిటైర్మెంట్ తర్వాత కూడా పోస్టింగ్!
ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రికలో ఓ కథనం వచ్చింది. రిటైర్మెంట్ తర్వాత బుడితి రాజశేఖర్ అనే ఐఏఎస్ అధికారి సర్వీస్ పొడిగింపునకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంగీకరించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. మరి తాజాగా ఏపీ మంత్రి అచ్చెన్నాయుడి సోదరుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడికి బాబాయ్ అయిన కింజరాపు ప్రభాకర్ కి రిటైర్మెంట్ తర్వాత ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. దాని మీద ఏమంటుందో మరి జ్యోతి.
జ్యోతి రాతలు పక్కన పెడితే రాష్ట్రంలో అనేక మంది తగిన పోస్టింగ్స్ లేవని అవస్థలు పడుతుంటే తాజాగా రిటైర్ అయిన ఏపీ మంత్రి సోదరుడికి మళ్లీ పోస్టింగ్ ఇచ్చిన తీరు చర్చనీయాంశమవుతోంది. కింజరాపు ప్రభాకర్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా రిటైర్ అయ్యారు. ఆయనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సహా అనేకం అందించారు. కానీ ఇప్పుడు ఆయనకు మరికొంత కాలం పాటు అధికారం కట్టబెట్టారు.
విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా ఆయన్ని నియమిస్తూ జీవో విడుదలయ్యింది. జీఏడీ రిలీజ్ చేసిన జీవో నెం., 17లో ఈ విషయంలో ప్రకటించారు. ప్రభాకర్ కోరిన మేరకు స్క్రీనింగ్ కమిటీ అంగీకరించడంతో ఆయన్ని నియమించినట్టు జీవోలో పేర్కొన్నారు. రిటైర్ అయిన తర్వాత కూడా ఇలాంటి అధికారం కట్టబెట్టడం ఆసక్తికరంగా మారుతోంది. అందరికీ ఇలాంటివి వర్తిస్తాయా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. మంత్రి సోదరుడైతే ఒక న్యాయం, ఇతరులకు మరో విధంగానా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి.
అప్పట్లో ఆయన పదవీ విరమణకు ముందు ప్రమోషన్ ఇచ్చిన తీరు కూడా వివాదాస్పదమయ్యింది. సరిగ్గా రిటైర్మెంట్ కి ఒకరోజు ముందు ప్రమోషన్ ఇవ్వడం కోసం నిబంధనలు కూడా పాటించలేదన్న విమర్శలు వచ్చాయి. మామూలుగా అయితే డీఎస్పీగానే ప్రభాకర్ నాయుడు రిటైర్ కావాల్సి ఉండగా ఆయనను ఏఎస్పీ గా చేసి ప్రమోషన్ ఇచ్చి మరీ రిటైర్ చేయించడం అందుకు కారణం. ప్రభాకర్ నాయుడు ఏఎస్పీ కావాలంటే ఆయన కంటే ముందు మరో ముప్పయి మంది దాక ఉన్నారని అలా ఒకేసారి 32 మందికి ఏఎస్పీగా ప్రమోషన్లు ఇచ్చి మరీ అన్నయ్య ప్రభాకర్ నాయుడు కోరికను తమ్ముడు మంత్రి అచ్చెన్న తీర్చారని అప్పట్లో విపక్షం మండిపడింది. ఇప్పుడు రిటైర్మెంట్ తో పాటుగా మరో పోస్ట్ కూడా సిద్ధం చేసిన తీరుతో అన్న కళ్లల్లో ఆనందం కోసం తమ్ముడు చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తిగా మారుతున్నాయి.
గతంలో వైఎస్సార్సీపీ హయంలో సలహాదారుల పేరుతో ప్రభుత్వ ధనం వృధా చేస్తున్నారంటూ విమర్శించిన చంద్రబాబు పాలనలో రిటైర్మెంట్ తీసుకున్న వారికి మళ్లీ అధికారం కట్టబెట్టి, అందుకు తగ్గట్టుగా భారీ నజారానా అందిస్తున్న తీరు మాత్రం విస్మయకరంగా మారుతోంది.