రాధాకృష్ణ అసలు బాధేంటి? నిజంగా బాబుకి పాలన మీద పట్టు చిక్కడం లేదా?

చంద్రబాబు పాలనలో ఏమీ బాలేదా..
చంద్రబాబు రాజకీయాలు చేయలేకపోతున్నారా..
వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్‌ పోటీ పడితే నారా లోకేశ్ వాళ్లను ఎదుర్కోలేరా
మర్రి చెట్టు కింద మొక్కలా లోకేశ్ మిగిలిపోతున్నారా
అసలెందుకిలా ఏబీఎన్ ఎండీ మండిపడే పరిస్థితి వచ్చింది.

ఆసక్తికరమైన రాతలతో రాధాకృష్ణ తీరు చర్చనీయాంశమవుతోంది. అయితే ఆయన అనేక కథనాలు ప్రస్తావించడం, ఆ తర్వాత ఏమవుతుందో తెలీదు దాని మాటే మరచిపోవడం ఆనవాయితీ. ఆ మధ్య సానా ముదురు అంటూ ఎంపీ సానా సతీశ్ గురించి రాశారు. ఏమయ్యింది ఆ వ్యవహారం అన్నది ఎవరికీ పట్టదు. ఇప్పుడు మంత్రి అనగాని సత్యప్రసాద్ గురించి రాశారు. ఆయన హైదరాబాద్ కేంద్రంగా గానా బజానాతో పాటుగా సెటిల్ మెంట్లు చేస్తున్నారన్నది కథనం. దాని వెనుక అసలు కథ ఏమిటన్నది ఆసక్తికరమే. రెవెన్యూలో ఏదయినా రాధాకృష్ణ సంబంధీకుల వ్యవహారం పెండింగులో ఉందా, లేక మంత్రి మీద ఏదయినా ఒత్తిడి తెచ్చేయత్నమా ఏమిటన్నది చూడాలి. కానీ ఇలాంటి వార్తలను వేడివేడిగా వండి వార్చి ఆ తర్వాత తెరవెనుక ఏం జరుగుతుందో తెలీదు గమ్మునుండడం ఆ సంస్థకు అలవాటు.

ఇక రాష్ట్రంలో చంద్రబాబుకి పాలన మీద పట్టు చిక్కలేదని నేరుగా వీకెండ్ లో ఆ ఎండీ రాసిన రాతలు ఆశ్చర్యమే. ఎమ్మెల్యేలను కూడా కట్టడిచేయలేకపోతున్నారని వాపోవడం విశేషమే. మళ్లీ జగన్ కి బలం చేకూర్చే ప్రయత్నం జరుగుతోందని కూడా వ్యాఖ్యానించడం విడ్డూరమే. 8పదుల వయసుకి సమీపంలో ఉన్న చంద్రబాబుకి వచ్చే ఎన్నికల్లో సీన్ ఉండదంటూ చెప్పడం కూడా విచిత్రమే. ఇలాంటి అనేకనేక చిత్ర, విచిత్ర విన్యాసాలతో ఈరోజు ఆయన విరుచుకుపడ్డారు. టీడీపీ నాయకత్వాన్ని తూర్పారబట్టేశారు.

దానికి కారణాలేమిటా అన్నదే కీలకం. ఒకటి చంద్రబాబుని దారికి తెచ్చుకునేందుకు బెదిరింపయినా కావాలి. లేదా తన మిత్రుడికి హెచ్చరిక అయినా కావాలి. హెచ్చరిక బాహాటంగా చెప్పాల్సి వచ్చిందంటే చంద్రబాబు ఆ ఎండీ మాటను ఖాతరుచేయడం లేదని భావించాలి. బెదిరింపు అయితే తన లక్ష్యాలు నెరవేర్చుకునే ప్రయత్నం అయి ఉండాలి. ఇప్పటికే టీవీ5 చైర్మన్ కి టీటీడీ చైర్మన్ ఇచ్చారు. ఏబీఎన్ కి 2014-19 మాదిరి ప్రభుత్వ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాల బాధ్యత దక్కలేదు. అయితే యువగళం కార్యక్రమం లైవ్ ఇచ్చిన సంస్థ దక్కించుకున్నప్పటికీ అది కూడా ఏబీఎన్ ఆర్కే బినామీ సంస్థేనా అని కొందరికి అనుమానాలుండేవి. కానీ తాజా రాతల తర్వాత అలాంటి సందేహాలకు ఆస్కారం లేదనిపిస్తోంది. నిజంగా అంత పెద్ద కాంట్రాక్ట్ అప్పగించి ఉంటే ఇంత తక్కువ కాలంలో కలం ఝుళిపించే అవకాశం ఉండకపోయేది.

మరోముఖ్యమైన అంశం నారా లోకేశ్ కి నాయకత్వ బాధ్యతలు అప్పగించి, చంద్రబాబుని సాగనంపేసే ప్రయత్నం జరుగుతోందా అన్న అనుమానం కూడా లేకపోలేదు. అందుకే చంద్రబాబు బలహీనుడని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. గతంలో ఎన్టీఆర్ విషయంలో కూడా ఇలానే మొదలయ్యింది. క్రమంగా అది పుంజుకుని ఆయన్ని పదవీచ్యుతుడిని చేసేటంత వరకూ వెళ్లింది. బహుశా అవన్నీ చంద్రబాబుకి గుర్తుండే ఉంటాయి. కానీ పుత్రప్రేమతో ఆయన కూడా పెద్దగా అభ్యంతరం పెట్టేందుకు ఆస్కారం లేదు. కానీ పవన్ కళ్యాణ్‌ దానిని సహించబోడని అర్థమవుతోంది. అయినా గానీ పవన్ కళ్యాణ్‌ క్రమంగా బీజేపీకి చేరువగా వ్యవహరిస్తూ వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యేకంగా సాగాలని ఆశిస్తున్నట్టు ఆంధ్రజ్యోతి అంచనా వేసిన తరుణంలో త్వరలో టీడీపీ నాయకత్వ మార్పు విషయంలో పవన్ నుంచి ఏమయినా అభ్యంతరాలు పెడితే దానిని లెక్కచేయకుండా ముందుకెళ్లే ఆలోచన చేస్తున్నారా అన్న సందేహం కూడా రాకమానదు.

ఏమయినా ఏబీఎన్ రాతల మర్మం అంత సులువుగా బోధపడదు. అసలు కారణం వెలుగులోకి రావడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఈలోగా ఆయన రాతలు మాత్రం పూర్తి ప్రణాళికాబద్ధంగానే ఉన్నాయన్నది గ్రహించాలి. తమ లక్ష్యాల సాధన కోసం చేసిన ఎత్తుగడగా భావించాలి. అప్పట్లో సీఎం రమేశ్ కి రాజ్యసభ సభ్యత్వం కోసం సుజనా చౌదరికి వ్యతిరేకంగా రాసినా, తీరా సుజనా కేంద్రమంత్రి అయిన తర్వాత మళ్లీ ఆయనకు భజన చేసినా అంతా కొన్ని లక్ష్యాల కోసమే జరుగుతాయి. కాబట్టి ఈ రాతల వెనుక అసలు ప్రయోజనం ఏమిటన్నది తెలియాల్సి ఉంది. అది వ్యక్తిగతమా లేక టీడీపీ వ్యవస్థాగతమా అన్నది తేలాలి. మొత్తంగా రాధాకృష్ణ మాత్రం మరోసారి చంద్రబాబుని అభివృద్ధి నిర్దేశకుడు, జగన్ విధ్వంశకుడు అని చెప్పడానికి సంకోచించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *