ప్రజారోగ్యం పడకేస్తోంది.. ఆరోగ్య మంత్రి ఏమయ్యారో?
ఆంధ్రప్రదేశ్ లో వైద్య ఆరోగ్య శాఖ వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటికే పీజీ కోర్సుల్లో చేరే వైద్య విద్యార్థుల విషయంలో ప్రభుత్వ తీరు మీద నిరసనలు వ్యక్తమయ్యాయి. నేరుగా మంత్రి సత్యకుమార్ నే నిలదీశారు. గుంటూరులో విద్యార్థుల తల్లిదండ్రుల ప్రశ్నలకు మంత్రి ఖంగుతిన్నారు. పీజీ కోసం ఫీజులు ఖరారు చేయకుండా అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తి చేసి పీజీలో ఫీజులు పెంచే ప్రతిపాదన మీద మండిపడ్డారు.
అది మరచిపోకముందే తాజాగా విదేశాల్లో వైద్య విద్య అభ్యసించిన విద్యార్థులు నిరసనలకు దిగారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద ఆందోళనకు పూనుకున్నారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ తీరుని తీవ్రంగా నిరసించారు. విదేశాల్లో చదువుకుని వచ్చిన వారికి మూడేళ్ల పాటు ఇంటర్న్ షిప్ చేయాలంటూ పెట్టిన షరతు మీద మండిపడ్డారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ తీరుని తప్పుబట్టారు.
అవన్నీ విద్యార్థులకు, వారి తల్లిందండ్రులకు సంబంధించిన సమస్యలనుకుంటే తాజాగా ప్రజలందరికీ సంబంధించిన విషయంలో ఆరోగ్య శ్రీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఏపీలో ఆరోగ్య శ్రీ ఓపీడీ సేవలను నెట్ వర్క్ ఆస్పత్రులు నిలిపివేశాయి. ఉద్యోగుల సేవలను పూర్తిగా ఆపేశారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేసినప్పటికీ మంత్రికి చీమకుట్టినట్టు కూడా లేదు. కనీసం సమస్య పరిష్కరించాలన్న సోయ లేదు. ప్రజలు ఎటు పోయినా, ప్రజారోగ్యం ఏమయినా పట్టనట్టే ఆయన తీరు ఉంది. ఏపీ ప్రభుత్వంలో మంత్రికి, సీఎం కి కూడా ఈ విషయం చెవికెక్కినట్టు లేదు. చాలా విస్మయకరమైన పరిస్థితి. ప్రజా సమస్యల విషయంలో ఇలాంటి నిర్లప్తత విచారకరం.