మంచు ఇంట్లో చిచ్చు, మోహన్ బాబు మీద మనోజ్ ఫ్యామిలీ ఫిర్యాదు!

ఆస్తుల కోసం, పెత్తనం కోసం సాగే వివాదాలు ఫ్యామిలీల మధ్య చిచ్చు పెట్టడం చాలా సహజం. అందులో చిన్నా, పెద్దా, సెలబ్రిటీ అన్న తేడా ఏమీ ఉండదని తాజాగా మంచు ఫ్యామిలీ నిరూపిస్తోంది. ఇప్పటికే మోహన్ బాబు యూనివర్సిటీ వ్యవహారంలో తగాదా తారస్థాయికి చేరింది. తాజాగా తమకు అన్యాయం జరుగుతోందంటూ మోహన్ మీద మంచు మనోజ్, ఆయన భార్య ఫిర్యాదు చేయడం ఆసక్తిగా మారింది.

చిత్తూరు జిల్లాలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీ వ్యవహారంలో మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య వివాదం నడుస్తోంది. మోహన్ బాబు మాత్రం విష్ణుకి అనుకూలంగా ఉన్నారు. ఆ వ్యవహారం ఇప్పటికే దుమారం రేపింది. మంచు మనోజ్ సారధ్యంలో యూనివర్సిటీ నిర్వహణలో వైఫల్యాలపై విద్యార్థి సంఘాల ఆందోళనకు మంచు మనోజ్ మద్ధతుగా నిలవడం కలకలం రేపింది.

దానికి కొనసాగింపుగా తాజాగా తన తండ్రి మోహన్ బాబు తమపై దాడికి దిగారంటూ మనోజ్, ఆయన భార్య ఫిర్యాదు చేయడం విస్మయకరంగా మారింది. మంచు మ‌నోజ్ త‌న తండ్రి మోహ‌న్ బాబుపై పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. త‌న‌తో పాటు త‌న భార్య‌పై ఇంటికి వ‌చ్చి దాడి చేశార‌ని మోహ‌న్ బాబు మీద ఫిర్యాదు చేయడంతో వారి ఇంటి వ్యవహారం రచ్చకెక్కినట్టయ్యింది.

అదే సమయంలో మంచు మనోజ్ తనపై దాడి చేశారంటూ మోహన్ బాబు కూడా ఫిర్యాదు చేశారు. తనను గాయాలు పాలుజేశారంటూ మనోజ్ ఆరోపిస్తుండగా, మనోజ్ తనమీద దాడికి వచ్చారంటూ మోహన్ బాబు పోటీగా ఫిర్యాదు చేయడం విశేషంగా మారుతోంది. మంచు కుటుంబంలో ఆస్తుల తగాదా మరో మలుపు తిరిగినట్టవుతోంది.

మంచు మనోజ్ మొదటి భార్యతో విడాకుల తర్వాత భూమా మౌనికారెడ్డిని పెళ్లాడారు. వారిద్దరూ ఇప్పుడు కలిసి ఉంటున్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సోదరి మౌనికారెడ్డి తమ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచే వివాదాలు మొదలయ్యాయని మంచు విష్ణు కుటుంబం ఆరోపిస్తోంది. ఏమయినా ఆస్తులు, పెత్తనాల విషయంలో వారి ఇంట్లో వివాదం ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకూ చేరిన నేపథ్యంలో తండ్రి మీదనే మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *