లక్కీ భాస్కర్ – మట్కా – పుష్ప : మూడు సినిమాలు ఒకటే సారాంశం!
దాదాపు నెల రెండు నెలల వ్యవధిలో రిలీజైన్ లక్కీ భాస్కర్, మట్కా, పుష్ప-2 సినిమాలను చూస్తే ఒకటే కథాంశం కనిపిస్తుంది. అక్రమ మార్గాల్లో కోట్లు కొల్లగొట్టడం ఎలా అనేదే ఈ మూడు సినిమాల సారాంశం. కథ జరిగే కాలాలే వేరు తప్ప…కథానాయకుల తీరు ఒక్కటే.
లక్కీభాస్కర్ సినిమాలో హీరో బ్యాంకుల మోసం చేసి, ఆ డబ్బును షేర్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టి, ఆ మార్కెట్లోనూ తన కుతంత్రాన్ని ప్రయోగించి కోట్లు కొల్లగొడతాడు.
మట్కా సినిమా కథానాయకుడు…మట్కా అనే సింగిల్ నెంబర్ లాటరీ అనే వ్యవసాన్ని జనానికి అలాటుచేసి, జనంలోని దురాశను ఆసరా చేసుకుని, కోట్ల రూపాయలు కుప్పపోస్తాడు.
మూడో సినిమా…పుష్ప. ఈ చిత్ర నాయకుడు ఎర్రచందాన్ని అక్రమంగా నరికి, విదేశాలకు ఎగుమతి చేసి వందల వేల కోట్లు వెనుకేసుకుంటాడు.
మామూలుగానైతే ఇవి విలన్లు చేసే పనులు. లేదా అటువంటి పనులు చేస్తే వారిని విలన్లుగా చూస్తాం. కానీ మారిన కాలంలో…విలన్లు చేసే పనినే హీరోలతో చేయించి, దాన్నే హీరోయిజంగా చూపించారు.
ఈ సినిమాల్లో హీరోలు అక్రమంగా సంపాదించిన డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు.
లక్కీభాస్కర్….తన కారు పార్కింగ్ కోసం తను వుంటున్న వీధి మొత్తాన్ని ఖాళీ చేయించి, ఆ వీధిలోని దుకాణాలు, నివాసాలన్నింటికీ నెలనెలా అద్దె చెల్లిస్తాడు.
మట్కా హీరో తనను చంపడానికి వచ్చిన రౌడీలకు బస్తాల కొద్దీ డబ్బులు కుమ్మరిస్తాడు.
ఇక పుష్పలోనైతే హీరో తన అక్రమ సంపాదనతో ముఖ్యమంత్రినే మార్చేస్తారు.
మూడు సినిమాలూ చూసినపుడు….కష్టపడి సంపాదించడం కంటే అక్రమంగా సంపాదించిన వారు వ్యవస్థలను తమ గుప్పెట్లో ఎలాపట్టిపెట్టారో అర్థమవుతుంది.
యాదృచ్ఛికమే కావచ్చుగానీ…ఈ మూడు సినిమాలో నెలా రెండు నెలల కాలంలోనే విడుదలయ్యాయి. ఒకేలాగా వున్నాయి.
దర్శకులు, నిర్మాతలు, నటులు….సినిమాల కోసం ఆయా కాలాల్లో ఆసక్తి కలిగించే అంశాలనే ఎంచుకుంటారు.
ఇప్పుడు లక్కీ భాస్కర్, మట్కా, పుష్ప వంటి సినిమాలు ఎందుకొస్తున్నాయంటే…సులభంగా డబ్బు సంపాదించాలన్న యావ సమాజంలో పెరిగిపోతోంది. అందుకే ఇటువంటి సినిమాలు వస్తున్నాయి. వాటికి ఆరణ లభిస్తోంది.
నేను ముందే చెప్పినట్లుగా విలన్లు చేసే పనులను హీరోలతో చేయిస్తారా? దాన్నే హీరోయిజంగా చూపిస్తారా? అని కొందరు ప్రశ్నస్తున్నారు.
సినిమాను అలా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు.
కొందరు వ్యక్తులు వ్యవస్థలనే బురిడీకొట్టించి, ఎలా కోటాను కోట్లు వెనుకేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఎర్రచందనం అక్రమ రవాణా గురించి ఈ తరానికి తెలుసుగానీ….మట్కా, షేర్ల కుంభకోణాలు వంటివి సరిగా తెలియవు. ఈ సినిమాలతో తెలుసుకున్నారు.
ఒకటి మాత్రం వాస్తవం…నేటి కథా రచయితలు, దర్శకులు అంత సామాన్యంగా సినిమాలు తీయడం లేదు. అందుకోసం చాలా పరిశోధన చేస్తున్నారు. శ్రమిస్తున్నారు. ఇవి ఈ మూడు సినిమాల్లోనూ కనిపిస్తాయి. అందుకు దర్శకులను, రచయితలను, నటీనటులను అభినందించాల్సిందే.
– ఆదిమూలం శేఖర్