సూపర్ స్టార్ కృష్ణకి, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి పోలిక ఏంటి?
తెలుగునాట ఎవరికిష్టమున్నా లేకున్నా సినిమాల ప్రభావం అసామాన్యం. సినీ హీరోలను కొలిచే యువతరం ఎప్పుడూ ఉంటుంది. అందుకు తగ్గట్టుగా సినిమాల నుంచి వచ్చి రాజకీయాలను, ప్రజల జీవితాలను శాసించే ప్రయత్నం కొందరు చేస్తుంటారు. వారిలో కొందరు సక్సెస్ అయిన చరిత్ర కూడా తెలుగునేల మీద ఉంది.
తెలుగు హీరోలలో నెంబర్ వన్ గేమ్ ఆరంభం నుంచి ఆసక్తికరమే. అందులోనూ ఎన్టీఆర్ హవా సాగిన తర్వాత ఆయన కొత్త ట్రాక్ ఎంచుకోవడంతో ఆయన తర్వాత ఎవరూ అన్న ప్రశ్న ఉదయించింది. అదే సమయంలో సుప్రీం హీరోగా ఉన్న చిరంజీవి మెగాస్టార్ గా రూపొంతంరం చెందుతున్న మధ్య సంధికాలాన్ని సూపర్ స్టార్ కృష్ణ ఏలిన కాలం కూడా కొంత ఉంది.
డేరింగ్, డాషింగ్ హీరోగా కృష్ణకు ప్రత్యేక అభిమానవర్గం ఉండేది. అదే ఆయనకు అండగా మారింది. ఎన్టీఆర్ రాజకీయాల వైపు మళ్లడం, చిరంజీవి ఇంకా ఎదుగుతున్న దశలో కొంతకాలం పాటు టాలీవుడ్ ను ఏలేందుకు అవకాశం వచ్చింది. అందుకు ఆయన ఎన్టీఆర్ నే ఢీకొట్టిన నేపథ్యం తోడయ్యింది. ఎన్టీఆర్ ను కూడా కాదని పలు సినిమాలు చేసిన సాహసం ఉపయోగపడింది. రాజకీయంగా ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పక్షాన పనిచేయడం కలిసొచ్చింది. ఎన్టీఆర్ మీదనే రాజకీయ సినిమాలు చేసిన వైనం మేలు చేసింది.
ఇక నేరుగా తనే రాజకీయాల్లో ఆరంగేట్రం చేసి ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేసేటంత వరకూ సూపర్ స్టార్ కి ఈ ఇమేజ్ ఉపయోగపడింది. సరిగ్గా ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కూడా అదే రీతిలో కనిపిస్తోంది. అల్లు అర్జున్ కి ఆరంభంలో మెగా ఫ్యాన్స్ పునాదిగా నిలిచారు. వారి అండతో ఆయన ఎదిగారు. మెగా అభిమానుల ఆశీస్సులు పుష్కలంగా లభించి పుష్ప1 వరకూ సాగుతూ నేషనల్ అవార్డ్ విన్నర్ గా నిలిచారు.
కానీ ఆతర్వాత మారిన పరిణామాలతో మెగా శిబిరం పూర్తిగా దూరం పెట్టింది. వైరం వర్గంగా మారిపోయింది. అల్లు అర్జున్ సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించే స్థాయికి విబేధాలు ముదిరాయి. రాజకీయంగా మొదలయ్యి వ్యక్తిగత దుమారానికి దారితీసింది. అయినా అల్లు అర్జున్ పుష్ప2తో తన ప్రతాపం చూపించారు. ఫ్యాన్స్ ను మెప్పించారు. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో బంపర్ హిట్ కొట్టేశారు. కొందరికి నచ్చినా, ఎందరికి గిట్టకపోయినా పుష్ప ద రూల్ అయితే మొదలయ్యిందనే చెప్పాలి.
ఇది అల్లు అర్జున్ సొంత ఛరిష్మాతో సాధించిన విజయమే. గానీ అందులో ఆయనకు చాలా ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా అప్పట్లో కృష్ణకు ఉపయోగపడినట్టుగానే ఇప్పుడు అల్లు అర్జున్ దూకుడిగా వైఎస్సార్సీపీ శ్రేణుల బలం మేలు చేస్తోంది. ఆపార్టీకి పునాదిగా ఉన్న రెడ్డి, ఎస్సీ కులాల్లో పుష్ప2 పాపులర్ పెంచుకున్నాడు. ఇది సినిమా, రాజకీయాలు మేళవింపుగా కులం కలిసిన మసాలాగా కనిపిస్తోంది. కానీ తెలుగు సమాజంలో ఉన్న వర్తమాన వాస్తవాలకు నిలువుటద్దంగా కనిపిస్తుంది. అన్నీ కలిసి అల్లు అర్జున్ ఇప్పుడు మెగా శిబిరాన్నే ఢీకొట్టే స్థాయికి చేరారు. ఇంకా చెప్పాలంటే వర్తమాన తరంలో మెగా శిబిరం నుంచి మరో హీరో అందుకోలేని రీతిలో ఎదిగే దిశలో ఉన్నారు.
ఇది టాలీవుడ్ లో అల్లు అర్జున్ చరిష్మా పెంచడమే కాకుండా నెంబర్ వన్ స్థానానికి పోటీ పడేందుకు దోహదపడుతుంది. అప్పట్లో కృష్ణ కొంతకాలం పాటు సంధి కాలంలో చెలరేగిపోయినట్టే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా సక్సెస్ ఫుల్ హీరోగా టాప్ హీరో స్థాయికి చేరుకునే ఛాన్స్ కనిపిస్తోంది. కృష్ణకు కాంగ్రెస్ , వైఎస్సార్ వంటి వాళ్ల అండదండలు దక్కినట్టే, అల్లు అర్జున్ కి వైఎస్ జగన్, ఆయన పార్టీ తోడ్పడే ఛాన్స్ లేకపోలేదు. అయినా గానీ ఒకటి, రెండు సినిమాలతోనే అలాంటివి సాధ్యం కాకపోవచ్చు గానీ అలాంటి అవకాశం మాత్రం అల్లు అర్జున్ చేతికివచ్చిందని పుష్ప2 ఫలితం చెబుతోంది. చూద్దాం రాబోయే రోజుల్లో అల్లు అర్జున్ సినీ రాజకీయాలు ఎలా ఉంటాయో.