‘సీజ్ ద షిప్’ చివరికి అలా ఉపయోగపడింది..!
కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ చేసిన హంగామా ఫలితాన్నిచ్చినట్టు కనిపించడం లేదు. పది రోజులు గడుస్తున్నా ఆయన ఆదేశాలు అమలులోకి రాలేదు. ఇంకా ఆ బియ్యం ఎవరివన్నది తేల్చలేదు. చివరకు బుధవారం శాంపిల్స్ సేకరించారు. అవి పీడీఎస్ బియ్యమా కాదా అన్నది తేల్చడానికే పది రోజులు పడుతుంటే ఇక అసలు కథ కొలిక్కివచ్చేదెన్నడూ అన్నది ప్రశ్నార్థకం.
అదే సమయంలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ మాత్రం సినిమాట్రిక్ గా ఉండడంతో ఏకంగా సినిమా టైటిల్ ఒకటి సిద్ధమయ్యింది. సీజ్ ద షిప్’ పేరుతో సినిమా టైటిల్ రిజిస్ట్రేషన్ అయింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఆర్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, ప్రొడక్షన్స్ అనే సంస్థ సోమవారం ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేయించుకొంది. ఇటీవల కాకినాడ పోర్టు నుంచి పేదల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న నౌకను ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పరిశీలించారు. ఆ క్రమంలో ఆయన చేసిన ‘సీజ్ ద షిప్’ అనే వ్యాఖ్యలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి.
షిప్ సీజ్ చేయడం కూడా సాధ్యం కాదని తేలిపోయింది. పవన్ కళ్యాణ్ “సీజ్ ది షిప్” తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని సముద్ర తీర ప్రాంతం యొక్క ప్రాముఖ్యత వెలుగులోనికి వచ్చింది. ఏపీ 975 కిలోమీటర్ల తీరరేఖ తో దేశంలో రెండవ అతి పెద్ద సముద్ర తీరం కలిగి ఉంది. ఓడల ద్వారా ఎగుమతి దిగుతులు ఇతర కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన పర్యవేక్షణకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సిబ్బంది కాకినాడ రేవులో వుంటారు. అంతర్రాష్ట్ర సముద్రయాన నియమాలు చట్టాలు (Maritime Laws),ఒడంబడికలు / ఒప్పందాలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తీర ప్రాంత రాష్ట్ర హై కోర్టు కు మాత్రమే అక్కడ కార్యకలాపాల వివాదాల పైన అధికార పరిది (Admirality Jurisdiction) ఉంటుంది. విదేశాలలో రిజిస్టర్ కాబడి ఆదేశ జాతీయ పతాకం కలిగిన నౌకల పైన నేరుగా చర్యలు చేపట్టే అవకాశం లేదు ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్(UNCLOS ) ప్రకారం జరగాలి. అయినప్పటికీ ఏపీ మారిటైమ్ బోర్డ్ మాత్రం మౌనంగా మిగిలిపోవడం ఆసక్తిగా మారుతోంది.
పవన్ కళ్యాణ్ కాకినాడ తీరాన చేసిన హంగామాతో రేషన్ బియ్యం మాఫియా కట్టడి ఎంతమేరకన్నది ప్రశ్నార్థకమవుతోంది. సరిగ్గా అదే సమయంలో ఆయన డైలాగ్ సినిమా టైటిల్ గా మారిపోవడం విశేషంగా కనిపిస్తోంది.