సాగనంపాల్సింది రోహిత్ నే కాదు, అతడిని కూడా!

టీమిండియా మేనేజ్మెంట్ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ఏకంగా కెప్టెన్ రోహిత్ శర్మను సాగనంపేసింది. కీలకమైన చివరి టెస్టులో ఆయన్ని పక్కన పెట్టేసింది. వైస్ కెప్టెన్ బుమ్రాకే సారధ్యం దక్కింది. పెర్త్ టెస్టులో గెలుపుబాట పట్టించిన సారధికి చివరి మ్యాచ్ లో కూడా ఛాన్స్ రావడంతో ఈ మ్యాచ్ కూడా గెలిచి, సిరీస్ ను డ్రా చేస్తారా అన్నది ఆసక్తికరం.

సిరీస్ మధ్యలో కెప్టెన్ ను పక్కన పెట్టడం టీమిండియాలో అరుదైన అంశం. గతంలో 1985లో కపిల్ దేవ్ ను కూడా ఇలానే పక్కన పెట్టిన తీరు పెనుదుమారం రేపింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా రోహిత్ శర్మ తన ఫామ్ లేమి కారణంగా తప్పుకున్నాడంటూ జట్టు యాజమాన్యం చెబుతున్నప్పటికీ ఓ సీనియర్ ఆటగాడిని పక్కన పెట్టేసిన వైనం చర్చనీయాంశమవుతోంది.

రోహిత్ ను పక్కన పెట్టేసి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా మరోసారి పేలవమైన ఆటతీరు ప్రదర్శించింది. ముఖ్యంగా కీలక బ్యాటర్లంతా విఫలమయ్యారు. కేఎల్ రాహుల్, జైశ్వాల్, కోహ్లీ చేతులెత్తేశారు. రోహిత్ స్థానంలో జట్టులోకి వచ్చిన శుభ్ మన్ గిల్ కూడా దారుణంగా ఫెయిలయ్యాడు. ముఖ్యంగా విదేశీ గడ్డ మీద తన పేలవ ప్రదర్శనను కొనసాగించాడు. సరిగ్గా లంచ్ కి ముందు చివరి బాల్ కి వికెట్ పారేసుకుని తన బలహీనతను చాటుకున్నాడు. చివర్లో కెప్టెన్ బుమ్రా రెండు పదుల స్కోర్ చేసి ఉండకపోతే జట్టు ఆ పాటి స్కోర్ కూడా చేయగలిగే పరిస్థితి కనిపించలేదు.

దాంతో జట్టు నుంచి బయటకు పంపించాల్సింది కేవలం కెప్టెన్ రోహిత్ శర్మను కాదని, అంతకుమించి జట్టు లయను తప్పడానికి కారకుడైన కోచ్ గౌతమ్ గంభీర్ ను సాగనంపాలన్న డిమాండ్ వినిపిస్తోంది. గౌతమ్ గంభీర్ కారణంగానే టీమిండియాలో ఇలాంటి పరిస్థితి ఉందన్న అభిప్రాయం ఉంది. గౌతమ్ గంభీర్ ను కోచ్ స్థానం నుంచి తప్పించాలన్న వాదన బలపడుతోంది. తను చేసిన ప్రయోగాలు, తన నిర్ణయాలతోనే విజయపథాన నడుస్తున్న జట్టు హఠాత్తుగా పేలవ ప్రదర్శనతో పరాజయాల బాట పట్టిందనే క్రికెట్ అభిమానుల మాట, రాహుల్ ద్రావిడ్ కష్టపడి జట్టుని గాడిలో పెడితే గంభీర్ స్వల్పకాలంలో ఆ కృషిని వృధా చేశాడనే వాదన చేస్తున్నారు.

టీమిండియాలో ప్రస్తుతం సీనియర్లుగా ఉన్న విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాతో పాటుగా రోహిత్ శర్మ కూడా ఈ సిరీస్ ముగిసిన తర్వాత టెస్ట్ కెరీర్ కి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారన్న ప్రచారం ఉంది. అదే సమయంలో గౌతమ్ గంభీర్ ను కూడా తప్పించకపోతే జట్టు మళ్లీ గాడిలో పడే అవకాశం తక్కువేననే అభిప్రాయం బలపడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *