టీడీపీకి పెద్ద తలనొప్పి సొంత శిబిరం నుంచే! ఏంటి కారణం?
ఓ రాజకీయ పార్టీకి మీడియాలో అనుకూల వార్తలు వస్తే.. బాగుంది బాగుందని ఆ పార్టీ అధిష్టానం అనుకుంటుంది. అదే నెగెటీవ్ వార్తలు వస్తే.. ఇదెక్కడి గొడవ రా బాబూ.. అనుకుంటుంది. దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలోననే ఆలోచన చేస్తుంది. అలాంటింది.. ఆ రాజకీయ పార్టీ కేడరే మీడియా పాత్ర పోషిస్తే ఎలా ఉంటుంది..? అయితే బ్లాక్ బ్లస్టర్.. లేదా అట్టర్ ప్లాప్ అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఏపీలో ఇదే తరహా రాజకీయం కన్పిస్తోంది.
కేడర్.. మీడియా పాత్ర పోషించడమనే పాయింట్ పాతదే కదా.. ఇందులో కొత్తేముంది అనుకోవచ్చు. 1994కు ముందు నుంచి కొద్దిగా.. 2004 తర్వాత నుంచి మరింత ఎక్కువగా తెలుగునాట రాజకీయాల్లో ఈ మాట వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు సడెనుగా ఈ ప్రశ్న ఎందుకు ఉత్పన్నమైందనే డౌట్ రావచ్చు. కానీ ఈ డౌట్ రావడానికి కారణం లేకపోలేదు. తమ ప్రత్యర్థి పార్టీకి మీడియా సపోర్ట్ ఉందని.. తమకు లేదని.. కాబట్టి కేడరే మీడియా పాత్ర పోషించాలని.. నిజాలను ప్రజలకు వివరించాలని రాజకీయ నేతలు కొందరు చెప్పేవారు. ఇలా చెప్పిన వారిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అగ్రగణ్యుడు. ఓ విధంగా చెప్పాలంటే తెలుగు రాజకీయాల్లో బహుశా ఆయనే ఆద్యుడు కూడా కావచ్చు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత నుంచి ఈ మాట తరుచూ వినబడుతూనే ఉంది. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కూడా ఇదే లైన్ తీసుకున్నారు. ఆయనకు ఏకంగా సొంత పత్రిక, ఛానెల్ ఉన్నప్పటికీ.. మీడియా సపోర్ట్ లేదని మాట్లాడేవారు. దీని మీద విమర్శలు వచ్చాయి.. ఇది వేరే విషయం.
ఇక టీడీపీ విషయానికొస్తే.. టీడీపీ కూడా నెమ్మదిగా అదే బాట పట్టింది. మనకు మీడియా సపోర్ట్ లేదు.. కార్యకర్తలే మీడియా పాత్ర పోషించాలనే లైన్ తీసుకుంది. ఇది 2014 ఎన్నికల్లో చిన్నగా.. 2019 ఎన్నికల్లో ఓ మాదిరిగా.. ఉంటే.. 2024 ఎన్నికల్లో మాత్రం పెద్ద ఎత్తున ఇదే తరహా ప్రచారం చేసింది టీడీపీ. సోషల్ మీడియాను ఆయుధంగా వాడుకుని.. ప్రత్యర్థి వైసీపీని టార్గెట్ చేసుకుంది టీడీపీ కేడర్. అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ చేసిన ఘోరతప్పిదాలతో పాటు.. టీడీపీ కేడర్ చేసిన సోషల్ మీడియా యుద్దం కూడా టీడీపీని, కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి ఉపయోగపడ్డాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
అయితే ఇప్పుడు టీడీపీకి ఓ విచిత్రమైన ఇబ్బంది వస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీడియా పాత్ర పోషించిన కేడర్.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ పాత్ర నుంచి బయటకు రాలేకపోతోంది. ఆ పాత్రలోనే ఇమిడిపోయి కంటిన్యూ చేస్తోంది. దీంతో ఇప్పుడు కేడరే టీడీపీకి అతి పెద్ద క్రిటిక్ బ్యాంకులా తయారైంది. ఇటు పార్టీలోనూ.. అటు ప్రభుత్వంలోనూ టీడీపీ అధినాయకత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్నిపోస్ట్ మార్టం చేసేస్తోన్నారు కేడర్. చంద్రబాబు, లోకేష్ సహా ఏ ఒక్కర్ని వదిలి పెట్టకుండా పార్టీ సానుభూతి పరులే విపరీతమైన పోస్టింగులు పెట్టేస్తున్నారు. విశ్లేషణలు చేసేస్తున్నారు. తీసుకున్న నిర్ణయాల వల్ల కలిగే లాభాలేంటనే అంశాల కంటే.. ఎదురు కాబోయే ప్రమాదాలను వివరిస్తున్నాయి.
అలాగే పార్టీ అధినాయకత్వం ఓ రాంగ్ డెసిషన్ తీసుకుందని భావిస్తే.. దాన్ని తప్పు పట్టడానికి కార్యకర్తలు ఏ మాత్రం వెనుకాడడం లేదు. ఏకంగా వాల్ స్క్రీన్లు పెట్టి మరీ చేస్తున్న తప్పులను స్వయంగా కార్యకర్తలు.. సానుభూతి పరులే ఎండగట్టేస్తున్నారు. ప్రస్తుతం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తున్న వార్తలు ఓ విధంగా చెప్పాలంటే చద్ది వార్తలుగా మారిపోతున్న పరిస్థితి. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు చేసే తప్పిదాలను ఎత్తి చూపడమే కాదు.. ఏకంగా చంద్రబాబు, లోకేష్ వంటి అగ్ర నాయకులు తప్పు చేశారని భావిస్తే.. వారిని లిటరలుగా నిలబెట్టి మరీ సోషల్ మీడియాలో కడిగి పారేస్తున్న పరిస్థితి ఏపీ అధికార పార్టీలో కన్పిస్తోంది.
దీంతో దీనిపై ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఈ తరహా పరిణామం మంచికో.. చెడుతో అర్థం కావడం లేదు. సీఎంగా, పార్టీ అధినేతగా.. చంద్రబాబు కావచ్చు.. కీలక నేతలుగా ఉన్న లోకేష్ సహా ఇతర కొంత మంది నేతలు కొన్ని డెసిషన్స్ తీసుకునే సందర్భంలో ఓ యాంగిల్ నుంచే కాకుండా.. అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలా నిర్ణయాలు తీసుకునే సందర్భంలో కొద్ది మందిని నొప్పించవచ్చు. పార్టీ, ప్రభుత్వ విశాల ప్రయోజనాలను.. దృష్టిలో పెట్టుకుని తీసుకునే నిర్ణయాలు ఉంటాయి. అవి చాలా మందికి మింగుడు పడకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో చంద్రబాబో, లోకేషో తీసుకున్న నిర్ణయాలను పోస్ట్ మార్టం చేస్తూ కూర్చొంటే ప్రత్యర్థి పార్టీలకు పని మరింత సులువు అవుతుంది. ఇక న్యూట్రల్సుకూ తప్పుడు సంకేతాలు పంపినట్టు అవుతుంది. ఈ తరహా చర్చ ఏకంగా సొంత పార్టీ కేడర్ నుంచే జరుగుతోందంటే పార్టీకి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇదే సందర్భంలో మరో చర్చా జరుగుతోంది. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందనడానికి ఇదే నిదర్శనం అనే వారూ లేకపోలేదు. రాంగ్ ట్రాకులో వెళ్తున్న వారిని సరైన ట్రాకులో పెట్టడం ద్వారా.. కేడరే పార్టీకి సరైన ఫీడ్ బ్యాక్ అందించినట్టుగా ఉంటుందని.. ఇదో రకంగా మంచిదేననే వారూ ఉన్నారు. మొత్తంగా చూస్తే.. ఈ పరిణామం మంచికో, చెడుకో అర్థం కాకుండా ఉందనే చెప్పాలి. కేడర్ ఒకసారి కంట్రోల్ తప్పితే.. తిరిగి తమ దారిలోకి తెచ్చుకోవడం అధిష్టానానికి ఏమంత ఈజీ కాదనే చర్చ జరుగుతోంది. అంతర్గత ప్రజాస్యామ్యం విపరీతంగా ఉందని భావించే కాంగ్రెస్ పార్టీలో కూడా పార్టీ అధినాయకత్వం తీసుకునే నిర్ణయాలపై ఇంతటి పోస్ట్ మార్టం జరగడం లేదు.
ఓ విధంగా చెప్పాలంటే.. ప్రపంచంలోనే ఏ రాజకీయ పార్టీలోనూ కన్పించని విచిత్రమైన పరిస్థితి టీడీపీలో కన్పిస్తోంది. సాహో.. జయహో అనే పరిస్థితి నుంచి కాస్కో అనే పరిస్థితికి టీడీపీ కేడర్ చేరుకున్నట్టే కన్పిస్తోంది. సొంత పార్టీ కేడరే.. అధినాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో విబేధించడమే కాకుండా.. వాటిని పోస్ట్ మార్టం చేయడమంటే మామూలు విషయం కాదు. ఈ విషయంలో టీడీపీ అధినాయకత్వం ఆలోచన ఏ విధంగా ఉందో మరి.
-చంద్రశేఖర్
సీనియర్ జర్నలిస్ట్