అల్లు అర్జున్ కి శత్రువులెక్కువయ్యారా? ఈ కేసులో తనకిపోయిందెంత?
సమాజంలో ఏ రంగంలో ఎదిగిన వాళ్లయినా ఎదుటి వాళ్లకు ఈర్ష్యగానే ఉంటుంది. అందులోనూ తమ కళ్లెదురుగా ప్రస్థానం మొదలెట్టి, తాము ఊహించని స్థాయికి ఎదిగిపోతుంటే మరింత ఎక్కువవుతుంది. సరిగ్గా ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో అదే కనిపిస్తోంది.
సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనలో అల్లు అర్జున్ 11వ నిందితుడు. అంటే అతని కంటే ముందు బాధ్యులు మరో పది మంది ఉన్నారు. ఎఫ్ఐఆర్ లో నమోదుకాని అసలు అంశం ఈ విషయంలో పోలీసులు పాత్ర కూడా ఉంది. అనుమతి లేకుండా థియేటర్ వద్దకు, అది కూడా సీఎం చెప్పినట్టుగా రోడ్ షో చేసుకుంటూ వస్తే అడ్డుకోవాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారు?. అతని కారుని థియేటర్ లోపలికి వెళ్లేందుకు ఎందుకు అనుమతించాలి? ఇలాంటి సవాలక్ష సందేహాలు ఎదురవుతాయి. అన్నీ కలిపితే పోలీసుల వైఫల్యం కూడా పెద్దదేనని స్పష్టమవుతుంది. వేల మంది వచ్చిన చోట అవసరమైన సంఖ్యలో సిబ్బంది లేరన్నది రూఢీ అవుతుంది.
ఆ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆ బిడ్డ శ్రీ తేజ్ కోలుకుంటున్నట్టు బులిటెన్స్ బయటకు వస్తున్నాయి. కానీ ఒకరు మరణించిన కేసులో ఇంత రాద్ధాంతం చేయడం చూస్తుంటే అల్లు అర్జున్ కి అటు సినీ రంగంలో, ఇటు రాజకీయాల్లో ఉన్న శత్రువుల సంఖ్య స్పష్టంగా అర్థమవుతుంది. సినీ ఫంక్షన్లలో తొక్కిసలాటలు, కొందరు మరణించడం కొత్త కాదు. గతంలో క్షణంక్షణం సినిమా ఫంక్షన్ లో శ్రీదేవిని చూసేందుకు ఎగబడిన అభిమానుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన చరిత్ర చాలామందికి గుర్తుండే ఉంటుంది. 2016లో పవన్ కళ్యాణ్ కాకినాడలో ఓ సభ పెడితే అతని అభిమానులు చెట్టు కొమ్మ విరిగిపడి ప్రాణాలు కోల్పోయిన ఉదంతం కూడా ఉంది. కానీ ఎక్కడా, ఎవరి మీద కేసులు లేవు. తొలిసారిగా అల్లు అర్జున్ కేసుతో భవిష్యత్తులో ఇలాంటి ఉదంతాలు ఎందరి మెడకు చుట్టుకుంటాయో చూద్దాం.
టాలీవుడ్ లో ఓ స్టార్ హీరో విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంత రాద్ధాంతం చేయడం వెనుక రేవంత్ రెడ్డి కుటుంబానికి, అల్లు కుటుంబానికి మధ్య రియల్ ఎస్టేట్లో వచ్చిన తగాదాల పాత్ర కూడా లేకపోలేదు. సీఎం తన కుటుంబ సభ్యులను సంతృప్తి పరచడానికి అల్లు అర్జున్ విషయాన్ని వాడుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ సీఎంని శాంతపరిచేందుకు కనీసం చొరవ చూపిన సినీ పెద్దలు లేకపోవడం టాలీవుడ్ కి త్వరలో ఎదురుకాబోయే కష్టాలను సూచిస్తోంది. అల్లు అర్జున్ మీద కేసు పెట్టినప్పటి నుంచి అరెస్ట్ చేసి, జైలులో ఓ రాత్రంతా ఉంచడం వరకూ అంతా పథకం ప్రకారమే జరిగిందన్నది కాదనలేని విషయం. కానీ దానిని నివారించే ప్రయత్నాలు జరగకపోవడం అత్యంత విస్మయకరం.
నాగార్జున అనుభవం తర్వాత రేవంత్ రెడ్డితో పెట్టుకోవడానికి సినీ ప్రముఖులు భయపడితే ఇక జీవితాంతం భయపడుతూ గడపాల్సిందే. ఎందుకంటే రేవంత్ నేర్పిన పాఠాలు తదుపరి సీఎం కూడా ఉపయోగించకోకమానరు. అదే సమయంలో తన కుటుంబ సభ్యుడి విషయంలోనే ఇలా జరుగుతూ ఉంటే కనీసం పవన్ కళ్యాణ్ పెదవి విప్పకపోవడం, చిరంజీవి కూడా చొరవ చూపకపోవడం చూస్తుంటే వాళ్ల వాళ్ల లక్ష్యాలు అర్థమవుతున్నాయి. కానీ ఇలాంటివి అల్లు అర్జున్ కెరీర్ ను నిలుపుదల చేసేటంత పెద్ద వ్యవహారం ఏమీ కాదు. మహా అయితే ఇంకా నెలా, లేదా కొన్ని నెలల పాటు ఈ ఎపిసోడ్ నడుస్తుంది. ఆ తర్వాత ఆ కేసు అంతగా ప్రభావితం చేయదు. అల్లు అర్జున్ ఎదుగుదలకు అడ్డుగా వచ్చే అవకాశం కూడా లేదు. పైగా పల్లెల్లో ఇప్పటికే చిరంజీవి తర్వాత అంతటి స్టార్ డమ్ సాధించే దిశలో ఉన్న హీరోకి ఆటంకాలు అధిగమించడం కూడా కలిసొచ్చే అంశమయినా ఆశ్చర్యం లేదు.
అయినా మెగా కుటుంబ అభిమానులే కాకుండా అనేక మందికి ఇప్పుడు అల్లు అర్జున్ టార్గెట్ అయ్యాడు. దానికి అతని తీరు కూడా తోడ్పాటునిస్తోంది. సోషల్ మీడియాలో ఎవరు ఎంతగా అల్లు అర్జున్ మీద విరుచుకుపడినా అతని ఇమేజ్ ఈకాలంలో పెరిగిందే తప్ప తగ్గలేదు. పైగా ఆయన ఇంటి మీద దాడి, ఆంధ్రావాడు అంటూ కాంగ్రెస్ నేతలు నోరు పారేసుకోవడం వంటివి అతనికి మళ్లీ కొంత సానుకూలతను తెచ్చే అంశాలే అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అల్లు అర్జున్ కి అండగా నిలవడానికి భయపడి కొందరు, అవసరం లేదని మరికొందరు భావిస్తుండగా, వాళ్లంతా ఆ తర్వాత చింతించే రోజు రాకమానదు. ఇప్పటికే బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల మీద అసెంబ్లీ సాక్షిగా సీఎం ప్రకటన చేసిన తర్వాత దాని ప్రభావం ఉండకపోదు. ఆంధ్రాతో పోలిస్తే నైజాం మార్కెట్ చిన్నదేనని సరిపెట్టుకున్నా అలాంటి డిమాండ్లు పెరిగితే పెద్ద తలకాయ లేని టాలీవుడ్ కి తలనొప్పులు అనివార్యం.
రేవంత్ రెడ్డి ఇంత కక్షపూరితంగా అల్లు అర్జున్ ను వేధించాలని చూసినా మహా అయితే మరో అంశం ముందుకొచ్చే వరకూ ఇది సాగుతుంది. అల్లు అర్జున్ ను వేధించాలని మెగా కుటుంబంతో పాటుగా మరికొందరు ఎంతగా ఆశించినా కొద్ది రోజుల తర్వాత జనం మదిలోంచి ఈ విషయం పక్కకిపోతుందని, సోషల్ మీడియా జనాలకు మరో హాట్ టాపిక్ అవసరం పడుతుందని ఎరుగకపోరు. కానీ ఉదంతం తాలుకా ప్రభావం మొత్తం సినిమా వాళ్లను వెంటడబోతోంది. అల్లు అర్జున్ మీద గురిపెట్టిన వారందరికీ గుణపాఠమయినా ఆశ్చర్యం లేదు. టాలీవుడ్ సెలబ్రిటీలను చాలాకాలం వేధించే రీతిలో ఉండబోతోందన్నది మాత్రం చెప్పొచ్చు.