చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సిగ్గుపడాల్సిన విషయం! ఏపీకి ఇలా, కర్ణాటకలో అలా!
వైజాగ్ స్టీల్ అవస్థలు పడుతోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలతో అతలాకుతలం అవుతోంది. ఇంకా చెప్పాలంటే ఉన్నత స్థానంలో ఉన్న సంస్థను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది. ప్రైవేటీకరణ ప్రయత్నాల్లో రాష్ట్రీయ ఇష్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఊపిరితీసే ప్రయత్నం చేస్తోంది.
అదే సమయంలో కర్ణాటకలో అందుకు భిన్నంగా సాగుతోంది. భద్రావతిలో ఉన్న సర్ ఎం విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీని పరిరక్షించుకునేందుకు పెద్దమొత్తంలో కేంద్రం ప్యాకేజీ ప్రకటించింది. ఏకంగా 15వేల కోట్ల మొత్తం అందించబోతున్నట్టు కేంద్ర ఉక్కు, గనుల శాఖ మంత్రి హెచ్ డీ కుమార స్వామి ప్రకటించారు. మైసూరు మహరాజా నేతృత్వంలో స్థాపించిన ఈ స్టాల్ ప్లాంట్ కాపాడుకుంటామని కేంద్రమంత్రి వెల్లడించారు.
అదే సమయంలో లక్షల మందికి జీవనోపాధిగా ఉన్న వైజాగ్ స్టీల్ విషయంలో కేంద్రం సవతిప్రేమ చూపుతోంది. సొంత గనుల కేటాయింపు లేదు. కనీసం ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కే ప్యాకేజీ కూడా అందించడం లేదు. అదిగో ఇదిగో అంటూ ప్రకటనలు తప్ప కనీసం సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితికి వైజాగ్ స్టీల్ ను చేర్చేశారు. మూడు నెలలుగా సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వకుండా పొమ్మనలేక పొగబెడుతున్నట్టు కనిపిస్తోంది. సిబ్బంది వీఆర్ఎస్ తీసుకుని వెళ్లిపోవాలనే దురుద్దేశంతో వేదింపులు సాగుతున్నాయి.
కర్ణాటకలో ఉన్న స్టీల్ ప్లాంట్ కి భారీ మొత్తంలో నిధులు కేటాయించేందుకు కేంద్రం సుముఖంగా ఉండగా ఏపీకి తలమానికంగా ఉన్న ప్లాంట్ కునారిల్లుతున్నప్పటికీ పట్టించుకోకపోవడాన్ని ఏమనాలి. ఇంతగా కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్టు. విపక్షంలో ఉండగా వీరంగం చేసిన నేతలు ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నట్టు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం తమ బలం మీదనే ఆధారపడి సాగుతోందని చెప్పుకుంటున్న నేతలు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కనీసం పల్లెత్తు మాట అడగలేకపోవడానికి కారణమెవరు.
కర్ణాటకలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జేడీఎస్ నేత ప్రాతినిథ్యం వహిస్తున్న ఉక్కు గనుల శాఖ అక్కడి ప్లాంట్ కి ప్రాధాన్యతనిస్తుంటే, అదే శాఖలో సహాయ మంత్రిగా ఏపీకే చెందిన శ్రీనివాసవర్మ ఉన్నా సాధించింది శూన్యం. ఏపీలో టీడీపీ, జనసేన నేతలు కూడా ఆంధ్రుల హక్కుగా భావించే విశాఖ ఉక్కు పరిరక్షణ విషయంలో స్పందించకపోవడం చూస్తుంటే వేల మంది కార్మికుల భవితవ్యాన్ని గాలికొదిలేసినట్టు కనిపిస్తోంది. ఓవైపు ఏపీలో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు తెస్తున్నామని చెప్పుకుంటూ రెండోవైపు ఉన్న భారీ పరిశ్రమను చేజేతులా నాశనం చేస్తున్న తీరు పట్టకపోవడం సిగ్గుచేటు.