హుందాగా అల్లు అర్జున్, విడుదల తర్వాత పెదవి విప్పిన ఐకాన్ స్టార్
పుష్ప2 ద్వారా దేశవ్యాప్తంగా సినీ అభిమానులను అలరించిన అల్లు అర్జున్ అనుకోని కష్టాల్లో ఏకంగా జైలు పాలుకావడం సంచలనంగా మారింది. చివరకు ఒకరోజు జైలులో గడిపిన తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. చంచల్ గూడ జైలు నుంచి బెయిల్ మీద విడుదలయ్యారు.
తొలుత భార్య బిడ్డల దగ్గరికి వెళ్లి, ఆ తర్వాత గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వచ్చిన అల్లు అర్జున్ అక్కడే మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో ఆయన హుందాగా వ్యవహరించడం ఆకట్టుకుంది.
“చట్టాన్ని గౌరవిస్తాను. లీగల్ అంశాలపై ఇప్పుడేమి మాట్లాడను. బాధిత కుటుంబానికి అండగా ఉంటాను.” అంటూ ఈ స్టార్ హీరో చేసిన ప్రకటన ఆసక్తిదాయకం. వాస్తవానికి ఆయన్ని హుటాహుటీన అరెస్ట్ చేయడం, ఆ తర్వాత రిమాండ్ , హైకోర్టు బెయిల్ ఇచ్చినా రాత్రి విడుదల చేయకపోవడం వంటి అంశాల్లో కాసింత అసహనంగా కనిపిస్తారని అంతా ఆశించారు. కానీ అందుకు విరుద్ధంగా అల్లు అర్జున్ వ్యవహారం కనిపించింది.
స్టార్ హీరోగా ఎక్కడా గొప్పలు చెప్పుకోకుండా కేసు విషయంలో చట్ట పరిధిలో మాత్రమే మాట్లాడడం కీలకాంశం. అక్రమంగా ఆయన్ని అరెస్ట్ చేశారంటూ, చేయని నేరానికి బాధ్యుడిని చేశారంటూ పలువురు భావిస్తున్న తరుణంలో ఆయన కాస్త రెచ్చిపోయేందుకు ఆస్కారముంది. కానీ అందుకు విరుద్ధంగా ప్రవర్తించడం ప్రధానాంశం.
ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా పేర్కొంటూ మరణించిన రేవతి కుటుంబం పట్ల ఆయన సానుభూతి వ్యక్తం చేయటం, అండగా ఉంటాను అని చెప్పటంతో అల్లు అర్జున్ అందరినీ ఆకర్షించాడనే చెప్పవచ్చు. హుందాగా వ్యవహరించడం ద్వారా మరింతమందికి ఆయన చేరువయ్యేలా సాగడం విశేషంగా భావించాలి.