రుషికొండ నిర్మాణాల మీద జగన్ ను జీవితకాలం జైల్లో పెట్టాలంట..!

రుషికొండ ప్యాలెస్ విషయంలో అధికమొత్తంలో ఖర్చు చేసినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జీవితకాలం జైలులో పెట్టాలని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. కేవలం సొంత ప్రయోజనాల కోసం కుట్రపూరితంగా నిర్మాణం జరిగిందని మండిపడ్డారు. వేల రూపాయలు వెచ్చించిన ఈ భవనం ప్రభుత్వ అవసరాలకు కూడా ఉపయోగపడదని వ్యాఖ్యానించారు.

ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం సందర్భంగా రుషికొండ ప్యాలెస్ గురించి వేసిన ప్రశ్నకు పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్ సమాధానమిచ్చారు. రుషికొండ మొత్తం భవనాలు, ల్యాండ్ స్కేపింగ్ సహా రూ. 410 కోట్లు వెచ్చించినట్టు వెల్లడించారు.

ఆ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ “రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు పక్కన పెట్టి అధికార దుర్వినియోగం చేసినందుకు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలి. చదరపు గజానికి రూ. 1400 లతో కట్టిన భవనాలకు నిధులు చెల్లించకుండా, రుషికొండ మీద ఏకంగా చదరపు గజానికి రూ. 23వేలు వెచ్చించడం దారుణం. బాత్రూమ్ సహా అన్నింటా అధికమొత్తం వెచ్చించి ఆడంబరాలతో సొంత ప్రయోజనాల కోసం అడ్డగోలుగా వ్యవహరించారు. దాని మీద తగిన చర్యలు అవసరం” అంటూ అభిప్రాయపడ్డారు.

ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ పచ్చి అబద్ధాలతో కోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘించారని విమర్శించారు. భారీ మొత్తంలో దుర్వినియోగం చేసిన వారి మీద కఠినంగా వ్యవహరించాలని కోరారు.

దాదాపు స్వల్పకాలిక చర్చ మాదిరిగా సాగిన ఈ అంశంపై స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పందించారు. వచ్చే సోమవారం రుషికొండ భవనాల మీద చర్చించాలని నిర్ణయించినట్టు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *