డీఎస్పీ అవుట్, ఆ ముగ్గురే పుష్ప 2ని ఫైనల్ కంపోజర్స్?
దేశంలో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉందా? అంటే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప ది రూల్ అనే చెప్పుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇలాంటి క్రేజ్ ఉన్న సినిమా నిత్యం వార్తల్లో మునిగి తేలుతున్నది.అందుకే పుష్ప టీమ్ నుంచి దేవీ శ్రీ ప్రసాద్‌ను తొలగించడమనే అంశం అత్యంత చర్చనీయాంశమైంది.
డీఎస్పీ, సుకుమార్ మధ్య రాజుకున్న వివాదమే దానికి కారణమనే వాదన ఉంది. కానీ గతంలో వారిది సూపర్ హిట్ కాంబినేషన్ గా గుర్తింపు ఉంది. సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో మంచి హిట్స్ వచ్చాయి. వాటిలాగే పుష్ప ది రైజ్ సినిమా కూడా భారీ విజయం అందుకొన్నది. ఈ సినిమాలోని పాటలకు దేశవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి భారీ ప్రతి స్పందన వచ్చింది. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోరు కూడా సన్నివేశాలను భారీగా ఎలివేట్ చేసి సినిమాకు బలంగా మారిందన్నది ఇండస్ట్రీ అంతా అంగీకరించే విషయం.
ఇక పుష్ప 2 సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. కోట్లలో వ్యూస్ సాధిస్తున్నాయి. అందుకే ఈ సినిమాకు ప్రాణంగా నిలిచిన డీఎస్పీని పుష్ప 2 నుంచి తొలగించారనే విషయం భారీగా రచ్చ చేస్తున్నది.
ఆయనను ఈ సినిమా నుంచి పక్కకు జరిపి తమన్, సామ్ సీఎస్, అజనీష్‌ను ఈ ప్రాజెక్టులో భాగం చేయడం తెలుగు ఇండస్ట్రీలో భారీ చర్చకు దారి తీసింది.
ఇటీవల కాలంలో అజనీస్, సామ్, తమన్ పలు సినిమాలకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. క (KA) సినిమాకు సామ్ సీఎస్, కాంతార, మంగళవారం మూవీస్‌కు అజనీష్ లోక్‌నాథ్, తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ ముగ్గురిని సుకుమార్ రంగంలోకి దించి తనకు నచ్చిన విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసుకొనే పనిలో ఉన్నారు అని తెలిసింది.
ఇక దేవీ శ్రీ ప్రసాద్‌ను పుష్ప 2 నుంచి తప్పించడానికి ప్రధాన కారణం.. అల్లు అర్జున్ సినిమాను పట్టించుకోకుండా ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన DSP కాన్సర్ట్‌కే సమయం కేటాయించడమనే విషయం ప్రచారంలో ఉంది. దాదాపు 20 రోజులు మ్యూజికల్ ఈవెంట్‌పై డీఎస్పీ దృష్టి పెట్టారు. అయితే పుష్ప 2 మూవీ కోసం పనిచేయాల్సిన టైమ్ లో ఇలాంటి ప్రోగ్రామ్స్ లో ఎంగేజ్ కావడం పట్ల సుకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారని.. దాంతో వారి మధ్య స్వల్పంగా విభేదాలు చోటు చేసుకొన్నాయనే వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది.
అయితే సినిమా రిలీజ్ డేట్ సమీపిస్తుండటంతో.. దేవీ శ్రీ ప్రసాద్‌ను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నుంచి తప్పించి.. ఈ ముగ్గురు దర్శకుల చేత పనిచేయిస్తున్నారు. దాంతో ఈ సినిమాకు పాటలు, కొంత బీజీఎం వరకు దేవీ బాధ్యతలు ఉంటాయి అనే విషయం మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఈ వివాదంపై మైత్రీ గానీ, సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ మౌనం వీడితే అసలు విషయమేమిటో తెలుస్తుందని
నెటిజన్లు అంటున్నారు.