రాహుల్ గాంధీకి వర్తించని నిభందన…మీకు ఎలా సాధ్యం జగన్ ?
ప్రభుత్వ విధానాలను చర్చిండానికి, ప్రశ్నించడానికి ప్రతిపక్షానికి గొప్ప వేదికలు చట్ట సభలు.అలాంటి ప్రజాస్వామ్య అవకాశం అందరికి దొరుకుతుందా? రాజ్యంగ బద్ధ సంస్థ ద్వారా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష శాసనసభ్యలు ఆ విషయాన్నే మర్చిపోయారా? ప్రతిపక్ష నేతగా గుర్తించనప్పుడు అసెంబ్లీ ఎందుకు అని సాక్షాత్తు ఒక మాజీ ముఖ్యమంత్రి ఎలా వ్యాఖ్యానిస్తున్నారు? పార్టీ కార్యాలయం నుంచే పాలక పార్టీ ని ప్రశ్నిస్తూ ఉంటాము అని ప్రకటిస్తున్నారు. పార్టీ కార్యాలయంలో సాధారణ కార్యకర్త నుంచి పార్టీ అధికార ప్రతినిధి వరకు ఎవరైనా మాట్లాడవచ్చు. ఎమ్మెల్యేలకు మాత్రమే కదా అసెంబ్లీ లో ప్రశ్నించాల్సింది.మాజీ ముఖ్యమంత్రి ,మాజీ ప్రతిపక్ష నేతగా పని చేసిన జగన్ ఇప్పుడు తాను సాధారణ ఎమ్మెల్యే ను మాత్రమే అని జీర్ణించుకోలేకపోతున్నారా? అనే విమర్శల ఆయన్ను చుట్టుముడుతున్నాయి. ఒక పక్క అసెంబ్లీ కి గైర్హాజరు, మరో పక్క ఉమ్మడి కృష్ణ, గుంటూరు,ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికలను బహిష్కరిస్తున్నాం అని జగన్ ప్రకటించడం పై వైసిపి ఆత్మ రక్షణలో పడింది అని రాజకియ వర్గాలు అంటున్నాయి.
రాహుల్ గాంధీ పోరాటపటిమ జగన్ కు లేదా?
ప్రస్తుత పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది. 2014,2019 ఎన్నికల్లో మాత్రం ప్రతిపక్ష పార్టీగా ఏ పార్టీకి గుర్తింపు దక్కలేదు. కేవలం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాత్రమే కాంగ్రెస్ నిలిచింది. 2013 లో లోక్ పాల్ చట్టం పాస్ అయినప్పటికీ 2019 వరకు ఎందుకు అపాయింట్ కాలేదు ? లోక్ పాల్ సెలక్షన్ కమిటీలో ప్రతిపక్ష నాయకుడు ఉండాలని చట్టంలో లేదా? అందుకేగా ఆ చట్టం 2019 వరకు ఖాళీగా ఉంది. మళ్ళీ … ప్రతిపక్ష హోదా నాయకుడు లేనట్టైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ లీడర్ ను లోక్ పాల్ సెలక్షన్ కమిటీలో ఉండవచ్చని అమెండ్మెంట్ చేయలేదా? ప్రతిపక్ష హోదా కావాలని అనేక విమర్శలు చేస్తున్న జగన్ …ఆ పదవికి హొదా, గౌరవం ఎందుకు ఇవ్వడం లేదు? స్పీకర్ తనకు మైక్ ఎక్కువ సమయం ఇవ్వరని రాహుల్ గాంధీ పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించారా? గత బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన అనేక రాజ్యంగ సవరణలను పార్లమెంట్ కు హాజరై విమర్శించలేదా? ఆ తర్వాత భారత్ జోడో యాత్ర, న్యాయ యాత్ర ల ద్వారా ప్రజలకు మరింత చేరువ అవ్వలేదా? మూడు స్థానాలున్న తెలుగుదేశం పార్టీ తన గొంతుని పార్లమెంట్ లో వినిపించలేదా? జగన్ ఇవన్నీ గమనించడం లేదా అంటూ రాజకియ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి ఏడాది లోపే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుంటే…ముందు ముందర అంతా ఎన్నికల వాతావరణంలో జగన్ అసలు అసెంబ్లీ కి హాజరు అవుతారా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.