పాకిస్తాన్ ఉగ్రవాద పీచమణచమంటే కరాచీ బేకరీలు, మైసూర్ పాక్ పేర్లు మారుస్తారా?

ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న పాకిస్తాన్ పనిబడతారని అంతా ఆశించారు. కానీ భారత ప్రభుత్వం అందుకు విరుద్ధంగా సాగింది. పట్టు చిక్కుతున్న దశలో జారవిడిచేసేసింది. అమెరికా ఆదేశాలతో గట్టి ప్రయత్నాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా మార్చేసింది. వాస్తవానికి సైనిక చర్యకు ముందే పాకిస్తాన్ ను కట్టడి చేసేందుకు దౌత్య యుద్ధం జరగాలి. ప్రపంచమద్ధతు కోరాలి. కానీ ఇప్పుడు చేతులు కాల్చుకుని పలువురిని ప్రపంచంలోని వివిధ దేశాలకు తరలించారు. దాని వల్ల ప్రయోజనమెంత అన్నది ప్రశ్నార్థకమే.

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యం సుస్పష్టంగా కనిపిస్తోంది. విదేశాంగ విధానంలో ఒకనాడు తృతీయ ప్రపంచదేశాలకు నాయకత్వం వహించిన దశ నుంచి అమెరికాకి ఉపగ్రహం మారి, ఏకంగా ట్రంప్ కోసం ఎన్నికల ప్రచారం చేసే స్థాయికి భారత ప్రధాని రావడంతో అనేక దేశాలు ఇండియాను విశ్వసించడం మానేశాయి. అదే దేశం ఇప్పుడు విశ్వ వినువీధుల్లో ఎదుర్కొంటున్న అసలు సమస్య.

ఇలాంటి వైపల్యాన్ని కప్పిపుచ్చేందుకు మధ్యప్రదేశ్ బీజేపీ నేతలు నోటికి పనిచెప్పడం ఓవైపు నడుస్తుంటే దేశమంతా కొందరు ఆర్ఎస్ఎస్ అనుకూలురు వీధుల్లో వీరంగం చేస్తున్నారు. పలు చోట్ల కరాచీ బేకరీల పేరు మార్చాలంటే సాగించిన అరాచకం చూసి అంతా అవాక్కయ్యారు. ఇప్పుడు మైసూర్ పాక్ వరకూ వెళ్లారు. స్వీట్ స్టాల్ బయట బోర్డు మార్చడానికి మొదట యత్నించి, ఇప్పుడు లోపల స్వీట్ పేరు మార్చడానికి పూనుకున్నారు.

మైసూర్ పాక్ ను మైసూర్ శ్రీ అంటూ నామకరణం చేశారు. దానికి కారణం అందులో పాక్ ఉందంటూ అంధవిశ్వాసం ప్రదర్శిస్తున్నారు. నిజానికి మైసూర్ మహారాజాని మెప్పించడం కోసం వందల ఏళ్ల నాడు చేసిన స్వీట్ ఇప్పటికీ క్రేజ్ నిలుపుకుంటోంది. దాని ప్రత్యేకత చాటుకుంటోంది. పాకిస్తాన్ అనే దేశం ఉనికిలో లేని దశలో మైసూర్ పాక్ ప్రజల నోటిని తీపిచేసింది. అలాంటిది దానిని పాక్ తో ముడిపెట్టి పేరు మార్చేందుకు పూనుకోవడం విడ్డూరంగానే కాకుండా పలువురు నవ్వుకునే చర్యగా మారింది.

నిజానికి పాక్ ను మార్చాలని అంతా ఆశించారు. ఆ దేశంలో ఉగ్రవాద క్యాంపులు ఖాళీ చేయించాలని భావించారు. కానీ అసలు పని వదిలేసి ఇలాంటి కొసరు వ్యవహారాలకు పూనుకోవడం పరువు తీసే చర్యగా మారుతోంది. మోదీ మద్ధతుదారులు కొందరు సాగిస్తున్న అజ్ఞానపు చర్యగా మిగులుతోంది. అంధ భక్తుల పనికి అందరూ అభాసుపాలుకావాల్సి వస్తుందని మొన్నటి ఫేక్ వీడియోలు చాటిచెప్పాయి. ఇప్పుడిలాంటి చర్యలు మరోసారి నిరూపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *